ప్రేమలేఖ: ‘ఇలాంటి ఓ ప్రేమ, ఇలాంటి ఓ ముద్దు, ఇలాంటి ఆలింగనం ఒక్కటైనా... ఒక్కసారైన వుండాలి’ - అభిప్రాయం

  • 14 ఫిబ్రవరి 2019
Image copyright iStock

హాయ్...

నేనింకా నీ నవ్వునే వింటున్నా... ఆఫీస్ కి చేరుకొని నువ్వు Thank you అని పంపిన మెసేజ్ వచ్చేవేళకి కూడా నేనింకా నీ నవ్వునే వింటున్నా.

నిజానికి నేనేం ప్లాన్డ్ గా చెయ్యలేదిదంతా. గత వారం రోజులుగా నువ్వు ఆ ట్యూబ్ ని నొక్కినొక్కి చివరికి కత్తెరతో కట్ చేసి అందులోని క్రీం అంతా వాడేసి అంతా అయిపోయి పూర్తిగా సబ్బుతో కడిగినట్టు ఆ ట్యూబ్ తెల్లగా మెరుస్తూ మొన్న అద్దం ముందు కనిపించింది. పనులతో ఆ క్రీం కొనుక్కోడానికి నీకు వీలు కాలేదు. నా పనులతో నాకు తీసుకురావడానికి వీలుకాలేదు. ఆన్ లైన్ లో తెప్పిద్దామంటే నా క్రెడిట్ కార్డ్‌ని యెవరో వాడబోతే బ్యాంక్ వాళ్ళు కాస్తా ఆ కార్డ్ ని బ్లాక్ చేసేసారు. కార్డ్ నా పర్సులో, నేను యింట్లోనే వున్న అర్ధరాత్రి వేళ ఆ కార్డ్ ని యెవరో వాడటానికి ప్రయత్నించటం... ఆ విషయం బ్యాంక్ వాళ్ళే వెంటనే గుర్తించటం... వాళ్ళు యెంతో యెలర్ట్ గా వున్నారని సంతోషించాలో లేదా మన యిన్ఫర్మేషన్ ప్రపంచపు నలుమూలలా దొర్లుతుందని వాపోవాలో... యేమో...

సరే అసలు విషయం యేమిటంటే నిన్న దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ డిస్ ప్లేలో రకరకాల క్రీమ్స్ చూసినప్పుడు నీ క్రీం అయిపోయిందని గుర్తొచ్చి కొన్నా. యీ వుదయం నిన్న తెచ్చిన కాసిన్ని సామాను సర్దుతుంటే కనిపించిన యీ క్రీం నీకు యివ్వడానికి వచ్చిన క్షణంలో కూడా నా మనసు యే పాపం యెరగదు. :)

యిదిగో నీ క్రీమ్ అని యిస్తున్నప్పుడు - హ్యాపీ వాలెంటైన్ డే, అని మనసు చప్పున పలికేసింది.

లాప్ టాప్ నుంచి నువ్వు కళ్ళని తిప్పుతూ, నా చేతిలోని ఆ షేవింగ్ క్రీం వైపు, నావైపు చూస్తున్న నీ ముఖంలో సడన్ గా పొద్దుతిరుగుడు పువ్వు ధడేలున విచ్చుకొన్నట్టు విరబూసిన వుదయపు నీ నవ్వే మళ్ళీ కళ్ళంతా కాటుకలా పరుచుకొంటూనే వుంది.

చూడు యెంత మంచి కానుకో. నీ బుగ్గలు నిగనిగలాడించేది... నీ చుబుకం నున్నగా మెరిపించే కానుకా... అవసరమైన వస్తువే నిజమైన కానుక కదా. అమ్మాయిలకి పెర్ఫుమ్స్, లిప్ స్టిక్స్, కాటుక పెన్సిళ్ళు యిలా బోలెడు యివ్వవచ్చు. మీ అబ్బాయిలకి షేవింగ్ క్రీం, ఆఫ్టర్ షేవింగ్ లోషన్ గిఫ్ట్స్ గా యిస్తే లేలేత పరిమళాల చెంపలపై మీకో ముద్దునిస్తే... ప్రేమలు పూసే వేళ గరుకు బుగ్గలు గాభరా పుట్టించకూడదు...

కానీ నాకు గెడ్డపు బుగ్గే ముద్దు :)

ప్రేమ, ప్రణయం, LOVE Image copyright Getty Images

అసలు వాళ్ళకి ఫలాన షేవింగ్ క్రీం వాడండి అని పోయిన నెల నుంచి ప్రకటనల హోరెక్కిస్తే యెంతో సేల్స్ కదా. అంత ప్రేమైక తెలివి వాళ్లకి లేదులే... యీ ఆలోచనలు యెవ్వరికి చెప్పకూడదు. ఆ బోరింగ్ ముద్దుల యేడ్స్ చూడలేం.

సో... నీకు ఆఫీస్ కి వెళ్ళాక నాకు థాంక్స్ చెప్పలేదని గుర్తు వచ్చింది కదా... యిదిగో నువ్వు యిలా నా పట్ల గౌరవంగా వుండటమే నాకు నువ్వంటే భలే ప్రేమేస్తుంది. వొకరిని వొకరు గౌరవించుకోని స్నేహం త్వరగా పల్చపడిపోదు.

ప్రేమ యెందుకు కలిగింది... నిజమైన ప్రేమంటే యేమిటి. యివన్నీ అనవసరపు వాదనలు. ప్రేమ పేరుతో వ్యాపారం... యిదేదో పాశ్చ్యాత్యుల గోల... రోజూ వుండే అనుబంధానికి వొక రోజా... యిలా మొదట్లో మాటాడిన వాళ్ళలో చాల మంది క్రమేణా శుభాకాంక్షలు చెపుతున్నారు. యెంత హాయిగానో వుందీ యీ మార్పు.

వస్తువులుగానే బతకాలనుకొనే మనుష్యులకి యిలా యేదో వొక రోజు అక్కరలేదు. యే రోజైనా అలానే వుంటారు. అందులో వారికీ వారిదైన ఆనందం దొరుకుతుందనుకొంటా.

యీ రోజుని వో చిన్ని గులాబీ పువ్వుతోనో, వో కవితతోనో వాక్యంతోనో, చక్కర పొంగలితోనో, వో గ్లాస్ రెడ్ వైన్ తోనో, వో పాటతోనో, ట్రావెల్ తోనో, వో చిన్ని ముద్దుతోనో వారివారి ప్రేమని వ్యక్తపరుచుకోవటం క్యూట్ గా వుంటుంది కదా.

పోయిన యేడాది ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ తరువాత ఆ కెరటాల హోరు తీరంలో అర్ధ చంద్రుని కాంతిలో మాఘమాసపు గాలులు సున్నితంగా చుట్టుకొంటున్నప్పుడు అలాఅలా నా కాటుక కళ్ళల్లో కళ్లు పెట్టి నువ్వో చిన్న నవ్వు నవ్వినప్పుడు నీ చేతులని చేతుల్లోకి తీసుకోవాలనిపించి తీసుకొన్నప్పుడు అడక్కుండానే వొట్టేసిన్నట్టు నువ్వు నా యిష్టాలు ఆసక్తులు స్వప్నాలుగానే వుండిపోకుండా వాటిని నెరవేర్చుకునే తోడుగా వున్నందుకు కృతజ్ఞతలు. ప్రేమంటే కృతజ్ఞతే కదా.

రెండేళ్ళ క్రితం ఎడిన్‌బరోలో మంచు ఆవిరిత నిండిన గ్లాస్ అద్దాలపై నీ పేరు రాస్తుంటే వాటిపై తిరిగి మంచు పేరుకునేలోగా నీ స్ట్రాబెరీ పెదవులని ఆన్చావు చూడూ... వొళ్ళంతా పులకింతైన ఆ క్షణాల మోహపు మైమరపు ప్రేమే కదా...

లవ్ ఫార్ములా Image copyright iStock

వోహ్...

సరే వో విషయం... యీ యేడాది హాలిడే ప్లాన్ చేసుకోవాలి కదా...

వోయ్... వస్తావా అలాఅలా వెళదాం. అచ్చంగా మనవే అయిన కొన్ని సమయాలని వేటాడేoదుకు... ఆనవాళ్ళ వేట యెంత ఆసక్తికరమైన వేటో కదా... మన అడుగులని కలిసి వేద్దామా... మనవైన సమయాల కోసం.

కొన్ని సమయాలుంటాయి... మనల్ని మురిపించినవి. మైమరపించినవి. మోహపు బొగరంలా గిరగిరాతిప్పేవి. కాసేపే కాని యెంతో నిశ్సబ్దంగా భూమి చుట్టూ వొక్క తిప్పు తిప్పుతుంది చూడు బొంగరం. అలా తిరిగొద్దామా... బొంగరాలమై. తిప్పే బలమైన తాడు మనం చదువుకొన్నవి మనిద్దరికీ బోలెడు యిష్టమైనవి. భానుమతీ కోసం అడివికి... యిచ్చానదీ తీరపు వానకోసం... బెంగాలంతా తిరగాలి వో అప్పు కోసం, రవీంద్రుని గీతాల కోసం శాలవనాల గరుకు సవ్వడి కోసం వొక్కటా రెండా...

చలంగారి దేశికాచారిగారి కోసం భీమిలి, జమీల్యా కోసం బంగారు గోధుమ పంటల వెంటా,

I love you, profoundly and completely. And I always will - చూద్దామా The Bridges of Madison County ని, జమీల్యా పుస్తకం కనీకనిపించగానే యెన్నో సార్లు కొన్నాం. యెంతో మందికి బహుమతిగా యిచ్చాం. చూడాల్సిందే.

అస్సామంతా వీచే బ్రహ్మపుత్ర కోసం, రాహుల్ జీ పాదాల వోల్గా నుంచి గంగ వరకూ, మరల సేద్యానికి అన్న కావేరి తేటగాలుల కోసం, నీలకురింజీలు యెర్ర కురింజీలుగా పూసే ఆ పచ్చిమ కనుమల లోయల పచ్చిగాలి కోసం... కరేబియాతీరపు స్వరాలు కెరటాలై చుట్టుకొనే అనుభవ సాంద్రత కోసం... అమృత సంతానపు అనుకోని వానల కోసం... సుకుమారమైన లేహ్ యెండల అందం అరచేతుల్లో నింపుకోడానికి వెళదామా...

మనలోని చదువరిని నిరంతరం యిలాంటి వో ప్రేమ, యిలాటి వో సన్నివేశం, యిలాంటి వో ముద్దు, యిలాంటి ఆలింగనం వొక్కటైనా వొక్కసారైన వుండాలని మనకి కొన్ని స్వప్నాలని యిచ్చిన ఆ నదీతీరాలని, అడివిలోలోతులని, సముద్రగ్రామాలని, కొండలవెలుగునీడల్ని చూసొద్దాం... సమస్త జీవరాసికి ప్రేమైక శుభాకాంక్షలు చెప్పటానికి కృతజ్ఞతలు తెలపడానికి.

వొకే... వో కానుక యీ రోజు మనకోసం నే డిసైడ్ చేసింది...

యీ ట్రావెల్ వివరాల కోసం ఈ కింది అటాచ్‌మెంట్ చూడు... మనిద్దరం వేటాడే ఆ అద్భుతమైన చోటేదో...

(కుప్పిలి పద్మ రచయిత, కవి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు