వర్జినిటీ ట్రీ: ఆ చెట్టుకు కండోమ్స్ కట్టి పూజలు చేస్తారు

  • 16 ఫిబ్రవరి 2019
Image copyright Getty Images

తమ కాలేజిలోని ఓ చెట్టుకు కండోమ్స్ వేలాడదీసి, మగపిల్లలంతా పూజలు చేస్తారు. ఎక్కడ? ఎందుకు?

దిల్లీలోని ప్రతిష్టాత్మకమైన హిందూ కాలేజిలోని ఈ చెట్టును 'వర్జిన్ ట్రీ' అని పిలుస్తారు. ప్రతి ఏటా వాలెంటైన్స్ డే రోజున ఆ కాలేజిలో చదివే విద్యార్థులు.. వర్జిన్ ట్రీ చుట్టూ చేరి, కండోమ్స్‌ను నీటితో నింపి, వాటిని ఆ చెట్టు కొమ్మలకు కట్టి, శృంగార దేవతకు పూజలు చేస్తారు.

అలా చేస్తే, 6 నెలల్లోపు అమ్మాయితో లైంగికంగా కలిసే అవకాశం దక్కి, వర్జినిటీ కోల్పోతామన్నది అబ్బాయిల నమ్మకం.

కానీ, ఈ ఆచారానికి ఇకపై స్వస్తి పలకాలంటూ హిందూ కాలేజి ఆడపిల్లలు కదం తొక్కారు. వాలెంటైన్స్ డే ముందురోజు.. బుధవారం రాత్రి, కాలేజ్ గేటు తోసుకునివచ్చారు. ఇకపై ఈ పూజను జరగనివ్వకూడదని డిమాండ్ చేశారు.

కొన్ని దశాబ్దాలుగా ఈ కేలేజ్‌లో విద్యార్థులు ప్రేమికుల రోజున ఈ పూజను చేస్తున్నారు. వర్జిన్ ట్రీ కొమ్మలకు బెలూన్లు, రంగురంగుల రిబ్బన్లు కట్టి, ఆ చెట్టుపై ఓ బాలీవుడ్ హీరోయిన్, లేదా ఓ ప్రముఖ మోడల్ ఫొటో పెట్టి పూజలు చేస్తారు.

ఒక విద్యార్థి పురోహితుడి వేషంలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తాడు. అందరూ చెట్టు చుట్టూ చేరి, తమ ఆరాధ్య దేవత గురించి పాటలు పాడతూ డాన్స్ చేస్తారు. ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచుతారు.

పెళ్లికి ముందు సెక్స్ అన్నది దురాచారంగా భావించే భారతదేశంలో, ఏకంగా పూజలే చేయడం ఆశ్చర్యం.

Image copyright Getty Images

'ఇది.. ఎవ్వరికీ హాని చేయకుండా సరదాగా జరుపుకునే కార్యక్రమం' అని బాయ్స్ హాస్టల్ యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ప్రేమను సెలబ్రేట్ చేయడంలో భాగంగా ఏటా వందలాదిమంది విద్యార్థులు ఈ చెట్టుకు పూజలు చేస్తారని, అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

స్త్రీలను బొమ్మల్లా చూస్తున్నారని మహిళా విద్యార్థులు అంటున్నారు. అమ్మాయిలు ఎవరో కొందరే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు.

''ఒక అబ్బాయి, తనకు ఇష్టమైన ఓ నటి ఫొటోను చెట్టుపై ఉంచి, ఆమెను 'దమ్‌దమీ మాయి' పేరుతో బ్రాహ్మణ పద్దతుల్లో పూజిస్తాడు. ఈ ఆచారం పురుషాహంకారంతో కూడిన వాతావరణంలో జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమంలో కనీసం 5% అమ్మాయిలు కూడా పాల్గొనడం లేదు'' అని ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న 20 ఏళ్ల ఆషీ దత్తా అన్నారు.

Image copyright FACEBOOK/HINDU COLLEGE HOSTEL

''వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని ఆషీదత్తా రాజకీయం చేస్తున్నారు'' అని వెంకటేష్ అంటున్నారు.

ఈసారి చోటుచేసుకున్న మార్పుల గురించి వెంకటేష్ వివరిస్తూ..

''ఈ కార్యక్రమంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్స్‌కు స్థానం కల్పిస్తున్నాం. సురక్షిత శృంగారాన్ని ప్రమోట్ చేసేందుకే మేం కండోమ్స్‌ను చెట్టుకు వేలాడదీస్తున్నాం'' అని వెంకటేష్ చెబుతున్నారు.

కార్యక్రమంలో భాగంగా శృంగార దేవత స్థానంలో పూజలు అందుకునే స్త్రీగా మంచిగా బట్టలు వేసుకున్న ఫొటోనే వాడుతున్నామని, స్త్రీ శరీరాన్ని పొగుడుతూ పాడే పాటల్లో వర్ణన శ్రుతి మించకుండా జాగ్రత్త వహించామని వెంకటేష్ అన్నారు.

Image copyright TELI VENKATESH

ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకుంటామని ఆషీ దత్తా అంటున్నారు.

''సంప్రదాయం పేరుతో ఈ కార్యక్రమాన్ని జరపడం సరికాదు. మాది చాలా ఉదారమైన కళాశాల. ఎలాంటి సంప్రదాయాలను పాటించాలో, వేటిని పాటించకూడదో మనమే ఆలోచించుకోవాలి'' అని ఆషీ అంటున్నారు.

మంగళవారంనాడు, ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇరు వర్గాలు ప్రొఫెసర్లతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మహిళా విద్యార్థుల తరపున మాట్లాడటానికి ప్రొఫెసర్ పి.కె.విజయన్ వచ్చారు. వర్జిన్ ట్రీకి పూజ చేయడం మొదలైన 1980దశకంలో విజయన్ ఈ కాలేజ్‌లోనే చదువుకున్నారు.

Image copyright PINJRATOD

''అప్పట్లో ఈ చెట్టు చుట్టూ ప్రేమ జంటలు కూర్చునేవి. భారతదేశంలో అప్పటికింకా వాలెంటైన్స్ డే గురించి పెద్దగా అవగాహన లేదు. రానురానూ ఈ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అమ్మాయిల పొటోలు, కండోమ్‌లను చెట్టుకు వేలాడదీయడం ప్రారంభించారు. పూజా ప్రసాదం తింటే త్వరగా తమ వర్జినిటీని కోల్పోతామన్న విశ్వాసంతో అబ్బాయిలు ప్రసాదం కోసం క్యూ కట్టారు. వారిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు'' అని విజయన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే అమ్మాయిల శాతం చాలా తక్కువగా ఉందని విజయన్ కూడా చెబుతున్నారు. ఈ కార్యక్రమంతో కొందరు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నట్లు తాను విన్నానని అన్నారు.

Image copyright WOMEN'S DEVELOPMENT CELL, HINDU COLLEGE

''అమ్మాయిలు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకోకుండా, తమకు ఇబ్బంది కలగని రీతిలో కార్యక్రమాన్ని రీడిజైన్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మగతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం చేశారు. కానీ కొన్ని మార్పులు చేసి, అమ్మాయిలకు కూడా ఇందులో స్థానం కల్పించాలి. వాళ్లెప్పుడూ మగవాళ్ల చేత ఆశించబడటమేనా..వారు కూడా ప్రేమను ఆశిస్తారు కదా..'' అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)