పుల్వామా దాడి: పాకిస్తాన్‌‌కు బుద్ధి చెప్పే ఆ ‘మాస్టర్ స్ట్రోక్‌’ను మోదీ కొడతారా

  • 16 ఫిబ్రవరి 2019
మోదీ, ఇమ్రాన్ ఖాన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

జమ్ము-కశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో 46 మంది మృతి చెందిన తర్వాత భారత్ తన అంతర్గత, బయటి భద్రత విషయంలో నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు భావిస్తోందా?

భారత్ వద్ద ప్రత్యామ్నాయాలు లేవా? భవిష్యత్తులో కూడా ఇలాంటివి భరించాల్సిందేనా?

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన కన్వల్ సిబ్బల్ మాత్రం పాకిస్తాన్‌ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరించాలి కానీ, అలా చేయలేకపోతోందని అంటున్నారు.

భారత్ దగ్గర ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేవు, కానీ 'మాస్టర్ స్ట్రోక్‌' అనిపించే వ్యూహం ఒకటుందని ఆయన చెబుతున్నారు.

"భారత్ దగ్గర ఒక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం ఉంది. అదే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం ఇంకా ఎందుకు రద్దు చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి. అలా చేయగానే పాకిస్తాన్ దారికొస్తుంది" అన్నారు.

Image copyright Getty Images

ఒప్పందం తక్షణం రద్దు చేసుకుంటే...

"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఒప్పందాలు రద్దు చేశారు. అమెరికా తన మిత్ర దేశాలైన జపాన్, కెనడాతో కూడా ఒప్పందాలు రద్దు చేసింది" అని కన్వల్ చెప్పారు.

"అమెరికా అలా చేయగలిగినప్పుడు, భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఏంటి సమస్య? అమెరికా పారిస్ ఒప్పందం నుంచి బయటికొచ్చింది. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంది".

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఇంకా ఎందుకు కొనసాగిస్తోందో తనకు అర్థం కావడంలేదని సిబ్బల్ అంటున్నారు.

"దీన్ని రద్దు చేసుకోవడం వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం పడదు. ఒకసారి భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే, పాకిస్తాన్‌కు దాని ప్రభావం తెలిసొస్తుంది" అని సిబ్బల్ చెప్పారు.

భారత విదేశీ సేవల సీనియర్ అధికారి వివేక్ కాట్జూ కూడా భారత్ ఇప్పుడు ప్రతి ప్రత్యామ్నాయం పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

"దౌత్య ప్రత్యామ్నాయాల వల్ల భారత్‌కు అంత లాభం లేదు. అయితే వాటి సాయం కూడా తీసుకోవాలి. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కశ్మీర్‌లో కూడా ప్రక్షాళన చేయాలి. ఇప్పటివరకూ ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోలేకపోయారు" అని కన్వల్ సిబ్బల్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింధు ప్రాజెక్ట్

కశ్మీర్‌లోనూ ప్రక్షాళన అవసరం

"కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కశ్మీర్ వేర్పాటు వాద నేత మీర్వాయిజ్ ఒమర్ ఫరూక్‌తో మాట్లాడారు. భారత్ దానిని వ్యతిరేకించింది కూడా. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి తర్వాత గిలానీకి ఫోన్ చేశారు. ఈ వేర్పాటు వాదులకు, అంటే గ్రౌండ్‌పై తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న వారికి చాలా స్పేస్ ఇస్తున్నారు. కశ్మీర్ పార్టీల ప్రతినిధులు టీవీల్లో దేశానికి ఎంత వ్యతిరేకంగా మాట్లాడతారంటే, అవి వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది" అన్నారు.

జనవరి 30న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కుసూరీ ఈ ఇద్దరు వేర్పాటువాద నేతలతో మాట్లాడినపుడు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు.

దిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమన్లు పంపిన భారత్ దీనికి వివరణ కోరింది. అలా మాట్లాడ్డం అంతర్జాతీయ సంబంధాల నిబంధనలను ఉల్లంఘించినట్టేనని చెప్పింది.

కశ్మీరీ వేర్పాటువాదులకు ప్రభుత్వం కాస్త ఎక్కువ స్వేచ్ఛే ఇస్తోందని కన్వల్ సిబ్బల్ భావిస్తున్నారు.

"భారత్‌లో కశ్మీర్, తీవ్రవాదం గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది మనకు చాలా జటిలమైన విషయం. మనం దీన్ని కూడా హ్యాండిల్ చేయాలి. మరో వైపు ఈ విషయంలో న్యాయవ్యవస్థ సాయం కూడా తీసుకోవాలి. ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటే వీళ్లు జమ్ము-కశ్మీర్ హైకోర్ట్ లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడ వారికి ఉపశమనం లభిస్తుంది. మన ప్రజాస్వామ్యం చాలా దారుణమైన స్థితిలో ఉంది.

"కశ్మీర్ లోపల ప్రక్షాళన చేయల్సిన అవసరం ఉంది. హురియత్‌ వారికి సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల రక్షణను తక్షణం తొలగించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించాల్సుంటుంది. దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడానికి ఐక్యరాజ్యసమితి మళ్లీ చురుకుగా వ్యవహరించాలి" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింధు నది

ఇంకా వెనకడుగు ఎందుకు?

మసూద్ అజర్ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. అజర్‌ను రెండుసార్లు అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటన చేయించాలని భారత్‌ ప్రయత్నించింది. కానీ చైనా భద్రతా మండలిలో వీటో చేసింది.

భారత్‌ చైనాతో ఈ విషయాన్ని పరిష్కరించుకోవడంలో ఇప్పటికీ విఫలం అవుతోంది. పఠాన్ కోట్ దాడి వెనుకా మసూద్ అజర్ పేరు వచ్చింది.

భారత్‌లో ఇప్పుడు మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఉంది. మొత్తం బలమంతా వారి దగ్గరే ఉంది. అలాంటప్పుడు ఏదైనా నిర్ణయాత్మక అడుగు వేయడానికి మనకేదైనా చెప్పుకోదగ్గ సాయం ఎందుకు లభించడం లేదు?

ఈ ప్రశ్నకు సమాధానంగా "నాకెందుకో ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్సివ్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. అది దేశీయ సంస్థలను బలహీనం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి" అని కన్వల్ సిబ్బల్ అన్నారు.

తీవ్రవాద దాడులపై మన్మోహన్ సింగ్ కూటమి ప్రభుత్వం, మోదీ మెజారిటీ ప్రభుత్వం తీరు ఎలా ఉంది?

దీనికి ఆయన "మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూచుందని చెప్పలేం. అది కూడా ఇలాంటి దాడులు జరిగినపుడు ఏం చేయాలో అది చేసింది. సమస్య ఏంటంటే భారత్ దగ్గర ప్రత్యామ్నాయాలు తక్కువ ఉన్నాయి. పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుందాం అనుకుంటే దానికి కూడా సమస్యలున్నాయి. ఐక్యరాజ్యసమితిలో చైనా పూర్తిగా పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. మన దేశ ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండడం చాలా పెద్ద విషయం" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింధు నది

దేశహితం కోసం ఒక్కతాటిపై నిలవాలి

తీవ్రవాదాన్ని తన ఇంట్లోనే పెట్టుకున్న పాకిస్తాన్‌కు దానిపై మాట్లాడే హక్కు లేదు అని సిబ్బల్ భావిస్తున్నారు.

"మన దేశంలో ఉన్నవారే పాకిస్తాన్‌తో చర్చలు జరపండి, ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానాన్ని స్వీకరించండి, చర్చలు ఆపకండి అని చెబుతుంటారు. మొత్తం మీద నా ఉద్దేశం ఒకటే. దేశంలో ఉన్న వాళ్లే రెండుగా ఉన్నారు. పాకిస్తాన్ తరఫున, లేదా వారి విధానాలపై సానుభూతి వ్యక్తం చేసేవారు ఇక్కడ తక్కువేం లేరు. కశ్మీర్‌లో పాకిస్తాన్ వైపు మాట్లాడే అలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఉమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఏం మాట్లాడతారు. వాళ్లు పాకిస్తాన్‌తో చర్చలకు మద్దతుగా మాట్లాడతారు. ఏదైనా కఠిన చర్యలు చేపట్టే విషయానికి వస్తే, వీళ్ల వైఖరి సానుకూలంగా ఉండదు".

విదేశీ సేవల సీనియర్ అధికారి వివేక్ కాట్జూ కూడా సిబ్బల్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారు. కశ్మీర్ నేతలు కూడా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలని చెబుతారు.

"భారత్ దగ్గర పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేయడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉపయోగించవచ్చు. ఆ విషయంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తామని రాహుల్ గాంధీ మంచి వైఖరి కనపరిచారు. కశ్మీర్ నేతలు కూడా దేశ ప్రయోజనాల కోసం అందరితో కలిసి నిలబడాలి" అన్నారు కట్జూ.

మోదీ ప్రభుత్వం 2016లో సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకునే విషయం గురించి మాట్లాడింది. కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. చైనా కారణంగా భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంత సులభం కాదని చాలా మంది భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం