పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది

  • 17 ఫిబ్రవరి 2019
కశ్మీర్ యువత Image copyright Getty Images

కశ్మీర్లోని పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలో 2018 ప్రారంభంలో భారీ ఆయుధాలతో మిలిటెంట్లు చేసిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఎదురుదాడిలో ఇద్దరు మిలిటెంట్లు కూడా హతమయ్యారు.

చనిపోయిన ఆ ఇద్దరిలో ఒకరు ట్రాల్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల ఫర్దీన్ అహ్మద్ ఖాండే. సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడికి ముందు ఖాండే తాము ఈ దాడికి ఎందుకు పాల్పడుతున్నారో వివరిస్తూ ఓ వీడియోను షూట్ చేశారు.

ఇటీవల కాలంలో మిలిటెంటు గ్రూపుల్లో చేరిన అతిచిన్న వయస్కుడు ఖాండేనే.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన మిలిటెంట్ల ఆత్మాహుతి దాడిలో 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది 21 ఏళ్ల అదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ కమాండో. ఇతను అదే జిల్లాకు యువకుడు. 5 నెలల క్రితమే నిషేధిత మిలిటెంట్ గ్రూపు జైష్-ఏ-మొహమ్మద్‌లో చేరాడు.

కశ్మీర్‌లోని లోలబ్ లోయకు చెందిన మనాన్ వనీ అనే పీహెచ్‌డీ స్కాలర్ తన చదువును వదిలేసి గత సంవత్సరం మరో మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరారు. పది నెలల తర్వాత హింద్వారాలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మనాన్ వనీ చనిపోయారు.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న మనాన్ వనీ చాలా తెలివైన విద్యార్థి అని ఆయన అకడమిక్ రికార్డులను బట్టి తెలుస్తోంది.

రఫీక్ అహ్మద్ దార్ అనే మరో ప్రొఫెసర్ కూడా మిలిటెంట్ గ్రూపులో చేరిన కొద్ది గంటల్లోనే మరణించారు. కశ్మీర్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో దార్ ఓ అధ్యాపకుడు.

Image copyright Getty Images

తుపాకులు పడుతున్న యువత

గత నాలుగేళ్లుగా ఇలా చాలామంది యువకులు మిలిటెంట్ సంస్థలవైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే వారిలో చాలామంది ఎన్‌కౌంటర్లలో మరణిస్తున్నారు.

2018లో కశ్మీర్ నుంచి 191 మంది యువకులు మిలిటెంట్ శిబిరాల్లో చేరగా, ఈ సంఖ్య 2017లో 65 అని నివేదికలు చెబుతున్నాయి.

2018లో కశ్మీర్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 250 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇంత ఎక్కువమంది చనిపోవడం గత కొన్ని సంవత్సరాల్లో ఇదే తొలిసారి.

"ఈ దశాబ్దంలోనే 2018 అత్యంత దారుణమైన సంవత్సరం. ఈ ఒక్క ఏడాదిలోనే మిలిటెంట్లు, భద్రతా దళాలు, పౌరులు కలిపి మొత్తం 500 మంది మరణించారు" అని ది కొల్లేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆఫ్ జమ్ము కశ్మీర్ (జేకేసీసీఎస్) తన 2018 వార్షిక నివేదికలో పేర్కొంది.

Image copyright Getty Images

"సిద్ధంగా ఉన్నా ఆయుధాలు లేవు"

2016లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ మరణం తర్వాత మిలిటెంట్ గ్రూపుల్లో యువత చేరిక, ప్రత్యేకంగా దక్షిణ కశ్మీర్ ప్రాంతం నుంచి గణనీయంగా పెరిగింది.

మిలిటెంట్ శిబిరాల్లో చేరిన యువత తుపాకులు పట్టుకున్న తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గత కొన్నేళ్లలో చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది.

రాజకీయాల్లో యువతకు చోటు లేకపోవడమే వారు మిలిటెంట్ గ్రూపులపైపు ఆకర్షితులై, తుపాకులు పట్టకోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఈ ట్రెండ్ 2016లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మరణం తర్వాత నుంచి చూస్తున్నాం. అప్పటి నుంచి మిలిటెంట్ గ్రూపులవైపు మళ్లే యువత సంఖ్య పెరుగుతూ వస్తోంది. వేలాది మంది కశ్మీరీ యువత తుపాకులు పట్టడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ వారికి అందుబాటులో ఆయుధాలు లేవని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓ సందర్భంలో చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ మధ్యే నేనొక వీడియో చూశాను... నన్ను రోజూ సైనిక శిబిరానికి తీసుకెళ్లి, హింసించేవారని ఓ యువకుడు ఆ వీడియోలో చెబుతుంటాడు. కశ్మీర్ యువత బాధకు, వారి అణచివేతకు ఈ వీడియో అద్దం పడుతుంది. తమకు నచ్చినట్లుగా బతికేందుకు కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. కశ్మీరీ యువత మిలిటెంట్ గ్రూపుల మార్గాన్ని ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం" అని జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు ఖుర్షీద్ వనీ విశ్లేషించారు.

Image copyright Getty Images

"యువతలో అసంతృప్తికి కారణం ఇదే!"

"2008, 2010ల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మనం చూశాం. కానీ వారిలోని అసంతృప్తిని చల్లార్చడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. రాజకీయ వివాదంగా మారిన కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఎవరూ ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోవడమే వారి ఆగ్రహానికి ప్రధాన కారణం. ఈ సమస్య తీవ్రత రోజురోజుకూ ఇంకా పెరుగుతోంది" అని ఖుర్షీద్ వనీ తెలిపారు.

చదువులపై యువతకు ఆసక్తి తగ్గడంతో కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోందని ఆయనన్నారు.

ఉదాహరణకు, పుల్వామాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్యను చూస్తే... గత సంవత్సరం 400 మంది చేరారు, కానీ ఈ సంవత్సరం 200 మందే చేరారు. యువత సకారాత్మక అభివృద్ధికి దూరంగా జరుగుతోంది అనడానికి ఇదే స్పష్టమైన ఆధారం. ఈ స్థితిని వెంటనే నివారించకపోతే, సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై యువకుడి ఆత్మాహుతి దాడిలాంటి ఘటనలు మరిన్ని జరిగే ప్రమాదముంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. యువతలో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహాన్ని నేను చూస్తున్నా. వాళ్లు ఆయుధాలు పట్టడం తప్ప ఇంక దేనిగురించీ ఆలోచించడం లేదు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ నినాదాలు, జాతీయవాదమనే పేరుతో దీన్ని పరిష్కరించడం అసాధ్యం. విధాన నిర్ణయ స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు దీనిపై తీవ్రంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది అని ఖుర్షీద్ వనీ తెలిపారు.

Image copyright Getty Images

"ఇదేమీ కొత్త కాదు, తీవ్రత పెరిగిందంతే!"

"కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్నదంతా నిస్పృహలో ఉన్న యువత తుపాకులు చేపట్టడం వల్ల జరుగుతున్నదే. ఇదేమీ కొత్త కాదు, కాకపోతే తీవ్రత పెరిగింది" అని కశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి నూర్ మహ్మద్ బాబా అన్నారు.

ఇందులో కొత్తేమీ లేదు. 1990ల్లో జరిగినదానికి ఇది కొనసాగింపు, అంతే. కాకపోతే కొద్దిగా రాజకీయ మార్పు కనిపిస్తోంది. 1990లో నిరాశతో తుపాకీమార్గంవైపు వెళ్లేవారు. వేరే దారిలేక ఆ దారిలోకి వెళ్లేవారు. అయితే అది ఎక్కువకాలం కొనసాగలేదు. కానీ, వీరికి మద్దతుగా కొన్ని బాహ్య శక్తులు బలంగా చొచ్చుకుని వచ్చాయి. కానీ 2000 నాటికి వాటి ప్రభావం కూడా తగ్గింది. కానీ కశ్మీర్లో పరిస్థితి కూడా దిగజారడం మొదలైంది. మిలిటెంట్లను హతమార్చితే మిలిటెన్సీ అంతమవుతుందనే ఆలోచన సరికాదు. సాయుధపోరాటం అనేది ఎవరో పుట్టించినది కాదు. నిరాశ, నిస్పృహల కూడిన ప్రస్తుత వాతావరణంలో చదువుకున్నవారు కూడా మిలిటెన్సీవైపు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వాలు రాజకీయంగా, సైద్ధాంతికంగా దీన్ని పరిష్కరించకుండా, అధికార బలంతో, సైనిక బలగాలతోనూ అణచివేయాలని చూస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. కశ్మీర్లో మునుపెన్నడూ లేని విధంగా నిన్న జరిగిన తీవ్రమైన దాడి చూస్తే పరిస్థితి ఇప్పటికే చాలా దూరం వెళ్లిందని అర్థమవుతోంది.

Image copyright @NArendraModi

"వ్యవస్థాగత మార్పులు రావాలి"

కశ్మీరీ యువత మిలిటెన్సీ వైపు మళ్లడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యాత, కాలమిస్ట్ రవూఫ్ రసూల్ అభిప్రాయపడ్డారు.

"కశ్మీరీ యువతకు సంబంధించినంత వరకు... అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో వారు ప్రభావితమవుతున్నారు. సామాజికంగా, రాజకీయంగా వారికి ఎలాంటి అవకాశాలూ రావడం లేదు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా నిత్యం అణచివేతకు గురవుతున్నారు. ఈ అవకాశాలలేమి వారిని తప్పుదారిపట్టిస్తోంది, వారి మనసులపై ప్రభావం చూపిస్తోంది, విధ్వంసం వైపు నడిపిస్తోంది. నాకు అర్థమైన మరో అంశం ఏంటంటే... గత 30 ఏళ్లలో ఇక్కడ చోటుచేసుకున్న ఘర్షణలు భావోద్వేగ, మానసిక స్తబ్ధతకు దారితీశాయి. వీటి కారణంగా ప్రజలు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. ఈ అనిశ్చితిని అంతం చేయాలంటే వ్యవస్థాగత మార్పులు రావాలి. కానీ అది జరగడం లేదు. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నదంతా" అని రవూఫ్ రసూల్ అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption‘‘ఇన్నాళ్లు వాళ్లమ్మకు బాగులేదు.. ఇప్పుడు వాడు లేకుండా పోయాడు’’

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు