పెయిన్ కిల్లర్స్: తేడా వస్తే నొప్పినే కాదు మనిషినే చంపేయొచ్చు

  • 17 ఫిబ్రవరి 2019
పెయిన్ కిల్లర్ మాత్రలు Image copyright Getty Images

నా కాళ్లెందుకో నాలుగు రోజుల నుండీ ఉబ్బరంగా వుంటున్నాయి డాక్టర్ గారూ అన్నాడు ఉబ్బిపోయిన తన రెండు కాళ్లూ చూపిస్తూ అప్పారావు. అన్ని పరీక్షలూ చేసిన డాక్టర్, "ఈ మధ్య పెయిన్ కిల్లర్ టాబ్లెట్లేమన్నా వేసుకున్నారా?" అని అడిగాడు. "అదేం లేదండీ", ఈ మధ్య తలనొప్పిగా వుంటే మందుల షాపులో తీసుకుని ఎప్పుడూ తలనొప్పికి వేసుకునే మాత్రలే వేసుకున్నాను అంతే" అన్నాడు.

"అదే కారణం, తలనొప్పికీ, ఒళ్లు నొప్పులకీ వాడే మాత్రల వలన కాళ్లూ, మొహమూ ఉబ్బటమే కాదు, ఒక్కోసారి కిడ్నీలు కూడా చెడిపోతాయి జాగ్రత్తగా వుండాలి"అని హెచ్చరించి, నీరు తగ్గడానికి మాత్రలిచ్చాడు డాక్టర్ .

విజయకు రాత్రి నుండీ ఒకటే వాంతులూ,విరేచనాలూ. వాంతులు నల్లగా ముద్దలు ముద్దలుగా అవుతున్నాయి, విరేచనాలు కూడా నల్లగా తారులాగా అవుతున్నాయి. ఒళ్లంతా చెమటలు కమ్మడంతో పాటు, చల్లబడిపోతుంటే డాక్టర్ దగ్గరకి తీసికెళ్లారు. అన్ని పరీక్షలూ చేశాక తేలిందేమంటే, కడుపులోని పేగుల నుండీ స్రవించిన రక్తం వాంతులలోనూ, విరోచనాలలోనూ నల్లగా ముద్దలుగా పడుతోందనీ, బ్లడ్ ప్రెషర్ బాగా డౌనయ్యిందనీ, ఆమెకు మందులతో పాటు నాలుగు సీసాల రక్తం అవసరమనీ లేకుంటే ప్రాణానికి ప్రమాదమని, దీనికంతటికీ కారణం ఆమె నడుము నొప్పికి వేసుకున్న రెండు రూపాయల మాత్ర.

ఎల్లప్పుడూ ఆరోగ్యంతో అలరారే ఆనందరావుకి హఠాత్తుగా ఒళ్లంతా దద్దుర్లూ,దురదలు, ఆయాసం, గాలి అందకపోవడంతో పాటు వాంతులై ఒళ్లంతా చల్లబడి పోయేసరికి పరుగున హాస్పిటల్‌కు తీసికెళితే, అదంతా అలర్జిక్ రియాక్షన్ అని తేల్చి వెంటనే తగిన చికిత్స చేసి ఆక్సిజన్ పెట్టారు.

ఆలస్యం చేయకుండా తీసుకురావడం వలన ప్రాణాన్ని కాపాడగలిగామన్నారు. ఇంత ప్రమాదానికీ కారణం పంటి నొప్పికి వేసుకున్న ఒక రూపాయి పెయిన్ కిల్లర్ మాత్ర.

పెయిన్ కిల్లర్ మాత్రలు ఎలా పని చేస్తాయి? ఎంత వరకు సురక్షితం?

చాలామంది తల నొప్పి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పిలను సాధారణ వ్యాధులుగా పరిగణిస్తూ, ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలా? అనవసరమైన ఖర్చు అని భావిస్తూ,అలవాటుగా మందుల షాపుకెళ్లి , తమ బాధేమిటో చెప్పి అతనిచ్చిన మందులేవో తెచ్చుకుని వేసుకుంటూ వుంటారు. వీటినే "ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ "(OTC) అంటారు.

వీటిలో సాధారణంగా "పెయిన్ కిల్లర్ "అని పిలిచే "నాన్ స్టిరాయిడల్ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ "(NSAIDS) వుంటాయి. అవి నొప్పులనీ, జ్వరాన్నీ, వాపులనీ తగ్గించడంతో ప్రపంచ వ్యాప్తంగా వీటి వాడకం సర్వ సాధారణమయింది. డాక్టర్లతో సహా ఒక్క అమెరికాలోనే వీటిని వాడే వారి సంఖ్య సంవత్సరానికి 3 కోట్ల పై మాటే.

వీటిలో ఆస్పిరిన్ ,ఐబూప్రోఫెన్ ,డిక్లోఫినాక్ ,అసిక్లోఫినాక్ ,నిమసలైడ్ ఎక్కువగా వాడే మందులు.

1897లో మొదటగా శాలిసిలిక్ ఆసిడ్ నుండీ ఏస్పిరిన్ తయారు చేశారు. 1950 నుండీ మిగతా NSAIDs ని తయారు చేశారు. 1960 లో NSAID అనే పదాన్ని ఈ పెయిన్ కిల్లర్స్ అన్నింటికీ కలిపి వాడటం మొదలు పెట్టారు (అంటే వాపు తగ్గించే, స్టిరాయిడ్స్ కాని మందులు అని చెప్పుకోవచ్చు).

Image copyright Getty Images

నొప్పి ఎలా వస్తుంది

శరీరంలో ఎక్కడయినా దెబ్బతగిలినా, లేక గాయమైనా ఆ దెబ్బతిన్న కణజాలం నుండీ "ప్రోస్టా గ్లాండిన్స్ "అనే పదార్థాలు విడుదలవుతాయి. ఈ ప్రోస్టా గ్లాండిన్స్ రిలీజవ్వడానికి "సైక్లో ఆక్సిజనేజ్ 1&2 " ప్రధాన పాత్ర వహిస్తాయి, వీటినే cox1&cox2 అంటారు.

ఇలా విడుదలయిన ప్రోస్టాగ్లాండిన్స్ వలన దెబ్బతిన్న భాగం, ఎర్రబడి వాపు వస్తుంది. తద్వారా ఆ ప్రదేశంలో నొప్పి కలుగుతుంది, ఈ నొప్పి అనే అనుభూతి ఆ కణజాలాల వద్దనున్న నాడీకణాల చివరల నుండీ బయలు దేరి వెన్నుపూసలో నరాల ద్వారా మెదడు పైనున్న కార్టెక్సులోని నిర్ణీత భాగానికి ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు నొప్పి తెలుస్తుంది.

Image copyright Getty Images

పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయి?

పెయిన్ కిల్లర్స్ లేక NSAID లు cox 1&cox2 ఎంజైములను నిరోధించడం ద్వారా ప్రోస్టా గ్లాండిన్స్ విడుదలవకుండా నిరోధించి తద్వారా నొప్పి తీవ్రతనీ, కణజాలాలలో వాపునీ, జ్వరాన్నీ కూడా తగ్గిస్తాయి.

అయితే, ఇవి రెండు రకాలు గా పనిచేస్తాయి.

  1. cox1&2 ఎంజైమ్‌లు రెండింటినీ నిరోధించేవి.
  2. కేవలం సెలక్టివ్‌గా cox2 ఎంజైమ్‌ని నిరోధించేవి.

cox1 ఎంజైమ్ చేసేపని ఏమిటంటే... దీని నుండి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ శరీరానికి అవసరమయ్యే పదార్థం ఒకరకంగా రక్షణ కలిపిస్తుంది. అది ఎలాగంటే, జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్ విడుదలవ్వకుండా చూస్తుంది. రక్తనాళాల గోడలు బలంగా వుండేట్టు చూస్తుంది. కిడ్నీలకు రక్త సరఫరా చక్కగా వుండేట్టు చూస్తుంది.

అయితే ఈ cox1 యెంజైమ్ నిరోధించే పెయిన్ కిల్లర్ల వలన ఈ రక్షణ వ్యవస్థ దెబ్బతిని కడుపులో ఎసిడిటీ పెరగడం, కిడ్నీలు దెబ్బతినడం, రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరగడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఉదాహరణకు నిమసలైడ్, మెలాక్సికామ్ లాంటి మందులు.

cox2 ఎంజైమ్ పని ఏమిటంటే.. దీని వలన విడుదలయ్యే ప్రోస్టా గ్లాండిన్ నొప్పినీ, వాపునూ, జ్వరాన్నీ కలగ జేస్తుంది, కాబట్టి దీనిని నిరోధిస్తే ఆ లక్షణాలన్నీ తగ్గుతాయి.

ఈ cox2 ని నిరోధించే మందులు సెలీ కాక్సిబ్ ,రోఫి కాక్సిబ్. వీటి వలన జీర్ణాశయ ఇబ్బందులు తక్కువయినా రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టి గుండె జబ్బులొచ్చే ప్రమాదముందని వైద్యశాస్త్రం చెబుతోంది.

ఇంకా cox1&2 ఎంజైముల్ని నిరోధించే మందులను నాన్ సెలెక్టివ్ ఇన్హిబిటార్స్ అంటారు. పెయిన్ కిల్లర్స్ చాలా వరకూ ఈ కోవకే చెందుతాయి. ఉదాహరణకు ఏస్పిరిన్, డిక్లోఫినాక్, ఐబూప్రోఫెన్, ఇండో మెథాసిన్, కీటోరోలాక్, పైరాక్సికామ్ వగైరా.

ఏస్పిరిన్ (శాలిసిలేట్ గ్రూపునకు చెందినది), ఐబూప్రోఫెన్, కీటో ప్రోఫెన్(ప్రొపియానిక్ యాసిడ్ గ్రూప్), నాప్రాక్సిన్, డిక్లోఫినాక్, అసిక్లోఫినాక్ , నిమసలైడ్ (సల్ఫోనానిలైడ్స్ గ్రూపు), ఇండోమిథాసిన్ (అసిటిక్ ఆసిడ్ గ్రూపు), మెఫినామిక్ ఆసిడ్ (ఆంథ్రానిలిక్ ఆసిడ్ గ్రూపు), ఫినైల్ బ్యుటజోన్, పైరాక్సికామ్ (ఇనాలిక్ యాసిడ్ గ్రూపు), సెలో కాక్సిబ్ తదితరాలు సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్లు. వీటిలో కొన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరంలేకుండా షాపులలో ఓవర్ ది కౌంటర్ దొరుకుతాయి.

ఎలా వాడతారు?

పైపూతలుగా, నోటి మాత్రలుగా,ఇంజక్షన్ల రూపంలో వీటిని వాడుతారు. పైపూతలకంటే, మాత్రలకీ, మాత్రల కంటే ఇంజక్షన్లకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా వుంటాయి.

తలనొప్పికి, ఒళ్లు నొప్పులకు, రుమటాయిడ్, ఆర్థ్రయిటిస్, ఆస్టియో ఆర్థ్రయిటిస్, గౌట్, జ్వరం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, దెబ్బలు, ఎముకలు విరగడం, శస్త్రచికిత్స నొప్పులు, దంత సమస్యలు, కండరాల నొప్పులు, స్పాండైలైటిస్, మైగ్రేన్, క్యాన్సర్ల వలన కలిగే నొప్పులకు ఈ మందులను వాడుతారు.

వీటి వాడకం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, మలబధ్ధకం, తలతిరగడం, కడుపునొప్పి, రక్త వాంతులు, రక్త విరేచనాలు, ఒళ్లంతా దద్దుర్లు,దురదలు, చర్మం మీద నల్లటి మచ్చలు, ఆయాసం, పిల్లికూతలు, రెస్పిరేటరీ, డిప్రెషన్, ఒళ్లంతా ఉబ్బటం, కిడ్నీ ఫెయిల్యూర్, అనాఫైలాక్సిస్ వస్తాయి.

నిజానికి, ఏ మందూ సురక్షితం అని చెప్పలేం. కొంతమందిలో కొద్దికాలం వాడినప్పుడు సురక్షితం అనిపించిన మందులు, దీర్ఘకాలం వాడినప్పుడు రియాక్షన్ రావచ్చు. అందుకే దీర్ఘకాలం బాధించే సమస్యలయిన ఆర్థ్రయిటిస్ లాంటి వాటికి చాలాకాలం వాడినా ఇబ్బంది కలిగించని మందులని డాక్టర్ సలహాతో వాడాలి. లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎక్కువకాలం వాడినందువల్ల గుండెజబ్బులకీ, కిడ్నీ ఫెయిల్యూర్‌కు గురయ్యే ప్రమాదముంది.

Image copyright Getty Images

ఎవరెవరిలో ఈ మందులు జాగ్రత్తగా వాడాలి

పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా చివరి మూడునెలలలో పాలిచ్చే తల్లులు, హైపర్ టెన్షన్‌, గుండెజబ్బుతో ఇబ్బంది పడేవారు.

అలర్జీలు, ఆయాసం,ఆస్తమా, హీమో ఫీలియా, కాలేయ జబ్బులు, కిడ్నీ సమస్యలు, లుకేమియా క్యాన్సర్ల బాధితులు, త్రాంబోసిస్ లాంటి జబ్బున్నవారు, జీర్ణాశయం సమస్యలు- ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు, 50 ఏళ్లు పైబడిన వారు పెయిన్ కిల్లర్స్‌ను జాగ్రత్తగా వాడాలి.

గుండె జబ్బులు ,బి.పి. కిడ్నీ మందులతో పెయిన్ కిల్లర్స్‌ను కలపి వాడకూడదు. రక్తం గడ్డకట్టే మందులు, మత్తుమందులు, ఆల్కహాల్‌తో కూడా వీటిని కలిపి వాడొద్దు.

Image copyright Getty Images

నొప్పి నుంచి ఉపశమనమిచ్చే సురక్షిత మార్గాలు

వైద్యులు చాలా వరకు సురక్షితమని భావించే మందులు పారాసిటమాల్ ,అసిటమైనోఫెన్ , ట్రమడాల్.

వీటిని ఆపరేషన్ తర్వాత కలిగే నొప్పులలోనూ, ఎముకలు విరిగినప్పుడు కలిగే నొప్పులలో ఇంకా మిగతా నొప్పులలో NSAIDలకు ప్రత్యామ్నాయంగా వాడటం వలన చాలా వరకు రోగులు ఉపశమనం పొందుతున్నారు.

అయితే, గుర్తు పెట్టుకోవలసిన విషయమేమంటే ఏ మందూ నూటికి నూరుపాళ్లూ సురక్షితమైనది కాదు. సర్వసాధారణంగా సేఫ్ అని భావించే పారాసిటమాల్‌కు కూడా రియాక్షన్ రావచ్చు. ఎక్కువ డోస్‌లో వాడితే లివర్ పైన ప్రభావం చూపవచ్చు.

రియాక్షన్‌కు విరుగుడుగా వాడే ఆంటీ హిస్టమిన్సయిన్ "అవిల్ "కు, స్టిరాయిడ్స్‌కు కూడా రియాక్షన్ వచ్చిన సందర్భాలున్నాయి.

అందువలన డాక్టర్ సలహాపైన, పర్యవేక్షణలో మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడాలి. చివరగా చెప్పేదేమంటే పెయిన్ కిల్లర్స్ నొప్పిని ఎంత సులభంగా తగ్గిస్తాయో అంత ప్రమాదకరమైనవి.

ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరుబడితే వాళ్లు, తమంతట తాముగా వాడటం వలన ప్రమాదాలు సంభవించడమే కాక ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తుంది.

పెయిన్ కిల్లర్స్ వాడకాన్నిడాక్టర్ సలహా పై మొదలు పెట్టి కొద్ది కాలానికే పరిమితం చేసుకోవాలి. ఎవరికి ఏ మందు సరిపోతుందో, ఎవరు ఏ మందులకు దూరంగా ఉండాలో సమగ్రమైన అవగాహనతో వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నిరోధించవచ్చు. నొప్పి నుండి నివారణ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)