ఆంధ్రప్రదేశ్‌లో లంక కష్టాలు... నావలో ప్రసవాలు

పడవపై ప్రయాణికులు

కృష్ణానది గురించి ఎందరో కవులు కవిత్వం రాస్తే, గాయకులు ఈ నది ఒంపు సొంపుల మీద పాటలు కట్టారు. కానీ, అదే 'కృష్ణానది ఒడ్డున చావుపాటలు వినిపిస్తున్నాయ్' అని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

వైద్య సౌకర్యాలు లేకపోవడం లంక గ్రామాల ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఈ సమస్యే గ‌ర్భిణుల‌కు ప్రాణాంతకంగా మారుతోంది.

కృష్ణా జిల్లా శివారున ఉన్న నాగాయ‌లంక మండలంలో ప‌లు లంక గ్రామాలున్నాయి. వీటిల్లో, న‌దీపాయ‌ల మ‌ధ్య ఉన్న గ్రామాల ప్రజలు.. పట్టణానికి రావాలంటే, రెండుమూడుసార్లు పడవపై ప్ర‌యాణం చేయవలసి వస్తోంది. అలాంటి వాటిలో ఈల‌చెట్ల‌దిబ్బ గ్రామం కూడా ఒక‌టి.

వీడియో క్యాప్షన్,

వీడియో: ఆంధ్రప్రదేశ్‌లో లంక కష్టాలు

2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఈ గ్రామ జనాభా 1300 మంది. గ్రామంలో దాదాపుగా అంద‌రూ చేప‌ల వేట వృత్తిగా జీవిస్తున్నారు.

గతంలో వ‌ర్షాలు జోరుగా ఉన్న స‌మ‌యంలో చెరువుల్లోకి నీళ్లు వచ్చేవి. ఆ చెరువు నీటిని తమ పొలాలకు మళ్లించుకుని వ్యవసాయం చేసేవారు.

కానీ, గత కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు నిండకపోవడంతో, వ్యవసాయాన్ని వదిలేసి అందరూ చేపల వేటకు వెళుతున్నారని స్థానికుడు నాగేశ్వ‌ర రావు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రాంత ప్రజలు.. అటు కృష్ణా న‌దిలో, ఇటు స‌ముద్రంలో చేపల వేట‌కు వెళ్లి జీవ‌నం సాగిస్తుంటారు. ఈ గ్రామంలో దాదాపు 60 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. వాటిల్లో అత్య‌ధికం కృష్ణా నదిలోనే వేట సాగిస్తూ ఉంటాయి.

వేట‌లో ల‌భించే మ‌త్స్య‌సంప‌ద‌ను ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన కొంద‌రు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఆ వ్యాపారులు.. మ‌త్స్య‌కారుల చేపలను చౌక‌గా కొనుగోలు చేసి, బ‌య‌టి మార్కెట్‌లో ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకుంటున్న‌ారని తెలిసినా, త‌మకు మరో మార్గం లేదని గ్రామ‌స్థుడు స‌త్తిబాబు అన్నారు.

విరేచనాలకే ప్రాణాలు పోతున్నాయి...

గ్రామంలో అత్య‌ధిక మ‌హిళ‌లు కూడా ప‌శుపోష‌ణ‌లో క‌నిపిస్తున్నారు. అయితే పాలు అమ్ముకోవాలంటే వారు రెండు సార్లు కృష్ణ‌మ్మ‌ను దాటాల్సి ఉంటుంది.

స‌మ‌యానికి పంటు, ప‌డ‌వ ఉంటే పర్వాలేదు. లేదంటే త‌మ ఉత్ప‌త్తులు త‌ర‌లించ‌డానికి, తీసుకురావ‌డానికి త‌ల‌కుమించిన ప‌నిగా మారుతుంద‌ని ఈ గ్రామానికి చెందిన శంక‌రమ్మ చెబుతున్నారు.

అన్నిటికంటే పెద్ద సమ‌స్య.. త‌మ‌కు రోగాలు ముసిరిన‌ప్పుడు వ‌స్తుంద‌ని ఆమె చెబుతున్నారు. ప్ర‌స్తుతం టైఫాయిడ్ తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ త‌గ్గించే నాథుడు లేడని ఆమె చెబుతున్నారు. ప‌లుమార్లు విరేచ‌నాల మూలంగానే కొంద‌రు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లున్నాయ‌ని వివరించారు.

గర్భిణుల కష్టాలు కృష్ణమ్మకే ఎరుక!

'ఇక గ‌ర్భిణుల క‌ష్టాలు వ‌ర్ణనాతీతం..' అంటూ.. గర్భిణిగా ఉన్నపుడు తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు భాగ్యలక్ష్మి అనే మహిళ.

''నా డెలివ‌రీ స‌మ‌యంలో న‌ర‌కం చూశాను. రాత్రిపూట పురిటినొప్పులు రావ‌డంతో ఆస్ప‌త్రికి చేర‌డ‌మే క‌ష్టంగా మారింది. నావ‌లు అందుబాటులో లేక‌పోవ‌డంతో స‌కాలంలో ఆస్ప‌త్రికి చేర‌క‌లేక‌పోయాను. ఈలోగా నా బిడ్డ ఉమ్మునీరు మింగేసింది..’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ప్రాణాల‌కు గ్యారెంటీ లేద‌ని డాక్టర్లు చెప్ప‌డంతో చాలా క‌ల‌వ‌ర‌ప‌డ్డాను. అయినా ఎలాగోలా గ‌ట్టెక్కాము. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో చాలామంది గ‌ర్భిణులు ప్రాణాలు కోల్పోయారు. నాకు తెలిసీ.. ఈ ఆరుఏడేళ్ల‌లో ముగ్గురు మ‌ర‌ణించారు'' అన్నారు.

‘‘ప్రసవం కోసం ఆస్పత్రికి చేరుకునేలోపే చాలామందికి నావ‌లోనే డెలివ‌రీ అయిపోతుంటుంది. అలాంటి సమయాల్లో గుడ్డ‌లు అడ్డుగాపెట్టి, వారిని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఊళ్లో ఇద్ద‌రు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. కానీ వారు చిన్నచిన్న స‌మ‌స్య‌ల‌కే త‌ప్ప, ఏదైనా పెద్దరోగం వస్తే కాపాడే దిక్కు లేదు’’ అని భాగ్యలక్ష్మి అన్నారు.

లంక గ్రామాల‌న్నింటికీ క‌లిపి ఒక డాక్ట‌ర్‌ను నియమించాలని చాలాకాలంగా కోరుతున్నా ప‌ట్టించుకున్నవారే లేరని శంక‌ర‌మ్మ అన్నారు.

రెండు పడవలు మారాలి!

అవ‌నిగ‌డ్డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈల‌చెట్లదిబ్బ గ్రామం చేరాలంటే మండ‌ల కేంద్రం నుంచి 12 కిలోమీట‌ర్లు రోడ్డు మార్గంలో వెళ్లి, అక్క‌డి నుంచి పంటులో ఎదురుమొండి గ్రామం చేరుకోవాలి.

అక్క‌డి నుంచి మ‌ళ్లీ కాలిన‌డ‌క‌న లేదంటే మరేఇతర మార్గంలోనైనా 7 కిలోమీట‌ర్ల దూరం వెళ్లాలి. అక్క‌డ మ‌ళ్లీ నావ ఎక్కి, న‌ది దాటాలి. ఇలాకాకుండా, న‌దిలోనే మండ‌ల కేంద్రానికి చేరాలంటే ప‌డ‌వ‌లో రెండున్న‌ర గంట‌ల ప్ర‌యాణం ఉంటుంద‌ని స్థానికుడు అర్జున్ అన్నారు.

ప్ర‌భుత్వం వంతెన కాదు క‌దా క‌నీసం ఎదురుమొండి నుంచి రోడ్డు మార్గం కూడా వేయ‌లేక‌పోతోంద‌ని ఆయన చెబుతున్నారు.

న‌దీ ప్ర‌యాణం కోసం, నాటు ప‌డ‌వ‌ల స్థానంలో పూర్తి ర‌క్ష‌ణ ఉన్న బోట్లను ఏర్పాటు చేస్తామ‌ని, ప్ర‌మాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం చెబుతూనే ఉంది.

కానీ ప్ర‌స్తుతం ఈల‌చెట్ల‌దిబ్బ చేర‌డానికి పూర్తిగా ప్రైవేటు ఇంజిన్ బోట్లు మిన‌హా ఎటువంటి ర‌క్ష‌ణ లేదు. ఇక లంక గ్రామాల్లో ప‌లు స‌మ‌స్య‌లు పేరుకుపోయిన‌ప్ప‌టికీ ప్రాణాలు కాపాడేందుకు వైద్య సౌకర్యాలు కల్పించాలని స్థానిక మ‌త్స్య‌కార‌సంఘం నాయుకుడు సైక‌న శాంత‌య్య కోరుతున్నారు.

ఈ విషయమై ఆ ప్రాంత అధికారులను బీబీసీ సంప్రదించింది. ఈలచెట్లదిబ్బ గ్రామంలో వైద్య సదుపాయాల సమస్య పట్ల కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమేష్ స్పందించారు.

ఆ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉండడంతో సబ్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే ప్రతిపాదనలు పంపించి ,ఆరోగ్య వసతి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గర్భిణులకు పరీక్షలు, ఇతర మందులు అందించేందుకు సంచార వైద్య వాహనాన్ని పంపుతామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)