పుల్వామా దాడి: రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? : అభిప్రాయం

  • రంజిత్ కుమార్
  • బీబీసీ కోసం
పుల్వామా

ఫొటో సోర్స్, Getty Images

పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ దళంపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత భారతదేశం అంతటా మరోసారి పాక్ వ్యతిరేక భావనలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనతో దేశం షాక్ అయ్యింది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకే గళంతో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలనే సంకల్పం వ్యక్తం చేశాయి.

ఇంతకు ముందు కూడా భారీ తీవ్రవాద దాడులు జరిగినప్పుడు అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు చూశామో, ఇప్పుడు కూడా వారి మాటలు అలాగే ఉన్నాయి.

పాకిస్తాన్‌కు బుద్ధి చెబుతామని, ప్రతి రక్తం బొట్టుకూ బదులు తీర్చుకుంటామని ప్రమాణాలు చేస్తున్నారు.

దేశ భావోద్వేగాలను చూసిన ప్రతిపక్ష నేతలు కూడా రాజకీయ ఐక్యత చూపించి ప్రభుత్వానికి అండగా నిలిచారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వాటిని ప్రతిపక్షాల మద్దతు ఉంటుందని అఖిలపక్ష సమావేశంలో తెలిపారు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ ఘోరమైన దాడి పార్లమెంటు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు జరిగింది.

ఫొటో సోర్స్, PTI

ఉడీ, పఠాన్‌కోట్ తర్వాత పుల్వామా దాడి

అంతకు ముందు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ పదవీకాలంలోనే 2016 సెప్టంబర్ 18న, 2016 జనవరి 2న రెండు మిలిటెంట్ దాడులు జరిగాయి.

ఉడీ ఆర్మీ క్యాంప్‌పై జరిగిన మిలిటెంట్ దాడిలో 19 మంది జవాన్లు మృతి చెందగా, ఆ దాడి తర్వాత 11 రోజులకే నియంత్రణ రేఖ దాటి వెళ్లిన భారత సైన్యం పాకిస్తాన్‌లోని మిలిటెంట్ శిబిరాలను ధ్వంసం చేసింది. దానిని సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పారు. కఠిన వైఖరిని అవలంభిస్తామని, పాకిస్తాన్‌కు బుద్ధి చెబుతామని మాట ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని నెరవేర్చుకుంది.

అప్పుడు ఈ దాడి, తర్వాత దేశంలో చాలా పెద్ద రాజకీయ వివాదాన్ని రేపింది. ఈ దాడులు తమ ఘనతే అని చెప్పుకున్న ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది.

ఉడీ సైనిక స్థావరంపై జరిగిన దాడి తమ పనే అని అప్పుడు జైషే మహమ్మద్ చెప్పుకుంది. ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత వెంటనే దానికి తామే బాధ్యులమని ప్రకటించివ జైషే మహమ్మద్, ప్రభుత్వానికి బలమైన ఆధారాలు సేకరించే అవసరమే లేకుండా చేసింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి

1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ తర్వాత బంధీలను విడిపించడం కోసం భారత ప్రభుత్వం మసూద్ అజర్‌ను కశ్మీర్ జైలు నుంచి తీసుకెళ్లి అప్పగించింది. ఇప్పుడు అదే మసూద్ అజర్ పాకిస్తాన్ సైనిక సంరక్షణలో రాక్షసుడులా మారాడు. తన మిలిటెంట్ సంస్థ భారత్‌లోకి చొచ్చుకెళ్లి చర్యలు జరపగలదని చూపించాడు.

జైషే చీఫ్ మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు దేశ ప్రజల రక్తం ఉడుకుతోంది. కానీ తీవ్ర విమర్శలు, పాక్‌కు బుద్ధి చెబుతామనే బెదిరింపుల తర్వాత భారత ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా చేయగలదా? ప్రస్తుతం విదేశీ పొలిటికల్ సర్కిళ్లన్నీ అదే గమనిస్తున్నాయి.

ఇప్పుడు దేశం ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించబోతోంది. అందుకే పుల్వామా దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు మోదీ ప్రభుత్వం పాక్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది, చాలా వరకూ రాజకీయ లబ్ధి పొందే దృష్టితో తీసుకునే నిర్ణయంలా కూడా చూడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

పాక్ వ్యతిరేక భావనలతో ఎన్నికల్లో లబ్ధి

దేశవ్యాప్తంగా పాకిస్తాన్ వ్యతిరేక భావనలు కనిపిస్తున్నాయి. దీంతో ఒకవేళ ఇది అధికార బీజేపీకి ఎక్కడ రాజకీయ ప్రయోజనంగా మారుతుందేమోనని ప్రతిపక్షాలకు ఆందోళనగానే ఉంటుంది.

కానీ పాకిస్తాన్‌కు భారత్ బుద్ధి చెప్పిందని దేశంలోని ఓటర్లందరికీ అనిపించేలా మోదీ సర్కారు ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.

2016లో ఉడీ దాడి తర్వాత వెంటనే భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులకు పాకిస్తాన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది. ఎంత అవమానానికి గురైందంటే, భారత సైన్యం ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని చెప్పుకుంది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కదలికలను గమనించినప్పుడు వారు భయపడినట్లే అనిపించింది.

పాకిస్తాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ సంస్థలు భారత పాలిత కశ్మీర్‌లోకి తమ మిలిటెంట్లను పంపిస్తూనే వచ్చాయి. దాంతో భారత భద్రతా దళాలు ఇటీవల కొన్నేళ్లుగా అత్యధిక నష్టాన్ని చూశాయి.

ఉడీ దాడి తర్వాత వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ ప్రభుత్వం అందరితో శభాష్ అనిపించుకుంది. కానీ పుల్వామా దాడి తర్వాత ఇప్పుడు కర్ర విరగకుండా పాము చచ్చేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

మోదీ ప్రభుత్వం చేపట్టే ఈ భవిష్యత్ చర్యలు రాబోవు ఎన్నికల్లో దేశ రాజకీయాలనే నిర్ణయించవచ్చు.

మోదీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది?

పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థ జైషే మహమ్మద్‌కు బుద్ధి చెప్పడానికి మోదీ ప్రభుత్వం బహావల్‌పూర్‌లో ఉన్న దాని ప్రధాన కార్యాలయంపై కచ్చితత్వ దాడులు చేస్తుందా? లేక నియంత్రణ రేఖకు అవతల ఉన్న మిలిటెంట్ శిబిరాలను నాశనం చేయడానికి మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ మార్గాన్ని ఎంచుకుంటుందా?

వీటిలో ఎలాంటి సైనిక చర్య అయినా మోదీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేయవచ్చు, అందుకే ప్రభుత్వం ఆ బాధ్యతను సైన్యానికే వదిలేసింది. ప్రస్తుతం ఆయుధాల భారీ లోటుతో సతమతం అవుతున్న వారికి పాకిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధమైతే ఎం జరుగుతుందో బాగా తెలుసు.

అయితే పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వేలా లేవు. అందుకే భారత్ పక్కా ప్రణాళిక ప్రకారం నియమిత దాడులకు సిద్ధమైతే, పాక్ సైన్యం మరోసారి చేతులు ముడుచుకుని కూచుంటే, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అది కచ్చితంగా బీజేపీకి రాజకీయ ప్రయోజనం చేకూరుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

పాక్‌పై రాజకీయ, ఆర్థిక చర్యలు

సైనిక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడంతోపాటు మోదీ ప్రభుత్వం రాజకీయ, ఆర్థిక చర్యల గురించి కూడా ఎక్కువగా చెబుతోంది. అందుకే పాకిస్తాన్ 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదాను వెనక్కు తీసుకుని, పాకిస్తాన్ దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ సుంకం విధించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకుంటోంది.

దాంతోపాటు పాకిస్తాన్ వైపు నీళ్లు ప్రవహించేలా ఉన్న సింధు జల ఒప్పందంపై భారత్ తీసుకునే ఎలాంటి చర్యలైనా ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

ఇన్ని ప్రత్యామ్నాయాలతో పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని మోదీ ప్రభుత్వం మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కోగలదని అనిపించేలా ఎన్నికల సమయంలో పాక్ వ్యతిరేక గాలులు బలంగా వీచేలా అధికార పార్టీ ప్రయత్నించవచ్చు.

2016లో సర్జికల్ స్ట్రైక్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన విషయాన్ని కూడా తోసిపుచ్చలేం, ఇప్పుడు రాబోవు ఎన్నికల సమయంలో కూడా పాకిస్తాన్ భూతాన్ని చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పుల్వామా దాడి జరిగిన కొన్ని గంటలకే ప్రధాన మంత్రి మోదీ ఝాన్సీలో జరిగిన ఒక బహిరంగ సభలో ఏ రకంగా ప్రసంగించారో దానిని బట్టి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)