#PakistanAndCongressతో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వాదనల వెనుక అసలు నిజం ఏంటి: Fact Check

  • ఫ్యాక్ట్ చెక్ టీమ్
  • బీబీసీ న్యూస్
పుల్వామా

ఫొటో సోర్స్, Getty Images

సోమవారం ఉదయం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నలుగురు ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతి చెందారనే వార్తలు వచ్చాయి. తర్వాత కాసేపటికే #PakistanAndCongress ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో కనిపించింది.

మితవాద వైఖరి ఉన్న చాలా మంది #PakistanAndCongress తో ట్వీట్ చేశారు. పుల్వామా దాడి తర్వాత కూడా పాకిస్తాన్‌‌పై కాంగ్రెస్ పార్టీ మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ హ్యాష్‌ట్యాగ్‌తో వేలాది మంది ట్విటర్‌లోనే కాదు, ఫేస్‌బుక్, షేర్‌ చాట్‌ లాంటి చాటింగ్ యాప్స్‌లో కూడా రెచ్చగొట్టే సందేశాలను షేర్ చేశారు.

చాలా మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పాత ఫొటోలు, వీడియోలు ఉపయోగించారు. కానీ వీటిలో చాలా వరకూ పూర్తిగా అవాస్తవం, నిరాధారమని మా పరిశోధనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, TWITTER

ప్రియాంకా గాంధీతో సమావేశం

మితవాద మద్దతుదారులు తమ ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఫిబ్రవరి 7న దుబయ్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్‌ బాజ్వాతో సమావేశం అయ్యారని రాశారు.

ట్విటర్, ఫేస్‌బుక్‌లో ఈ సందేశాన్ని కొన్ని వేల సార్లు షేర్ చేశారు.

కానీ వాస్తవాలు చూస్తే ఈ వాదన తప్పని నిరూపితమైంది. ఎందుకంటే ఫిబ్రవరి 7న ప్రియాంకా గాంధీ తూర్పు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులందరితోపాటు రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ ట్వీట్

రాహుల్ గాంధీ 2018 అక్టోబర్ 24న చేసిన ఒక ట్వీట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ట్వీట్‌లో ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ "విచారణను అడ్డుకునేందుకు ప్రధాని సీబీఐ డైరెక్టర్‌నే తొలగించారు" అని అన్నారు. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకూ 12 వేల కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter

కానీ కొంతమంది రాహుల్ చేసిన ఈ ట్వీట్‌ను పాకిస్తాన్ డిఫెన్స్ కూడా రీ-ట్వీట్ చేసిందని, మోదీని తొలగించడానికి పాకిస్తాన్.. కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తోందని రాశారు.

ఈ వాదన పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ డిఫెన్స్ పేరుతో ఎలాంటి అధికారిక ట్విటర్ హ్యాండిల్స్ లేవు.

పాకిస్తాన్ తన డిఫెన్స్, సైన్యానికి సంబంధించిన సమాచారం గురించి ట్వీట్ చేయడానికి 'ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్' (ISPR) అధికారిక హ్యాండిల్ ఉపయోగిస్తుంది.

కపిల్ సిబల్ ప్రకటన

దక్షిణ భారత్‌లో మోదీ మద్దతుదారులుగా భావిస్తున్న చాలా మంది.. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేసిన ప్రకటన అంటూ #PakistanAndCongress ట్యాగ్‌తో షేర్ చేస్తున్నారు. అందులో ఆయన "పుల్వామా దాడికి అతివాదం-జాతీయ వాదమే కారణం" అని అన్నట్లు ఉంది.

దీన్ని మితవాద హిందీ సోషల్ గ్రూప్స్‌లో కూడా షేర్ చేస్తున్నారు.

దీనిపై బీబీసీతో మాట్లాడిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌, "ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి గురించి సోషల్ మీడియా ద్వారా గానీ, మీడియా ద్వారా గానీ తను ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter

కశ్మీరీ ట్రక్ డ్రైవర్

సోషల్ మీడియాలో చాలా మంది కశ్మీర్ నివాసితులపై ద్వేషం వ్యక్తం చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

"చాలా మంది కాంగ్రెస్ నేతలు పుల్వామా దాడికి కారణమైన ఆ కశ్మీరీలకు అండగా నిలుస్తున్నారు" అని కొందరు రాస్తున్నారు.

కానీ కొంతమంది అయితే ఒక పాత వీడియోను షేర్ చేస్తూ కశ్మీరీలను భయపెట్టేందుకు, వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోను రెండు వైపులా ఉపయోగించడం జరుగుతోంది.

అలాంటిదే ఒక వీడియో ఉంది. దానితోపాటు "పుల్వామా దాడితో కోపంగా ఉన్న ప్రజలు కశ్మీరీ ట్రక్ డ్రైవర్‌ను చితకబాదారు" అని రాశారు.

సోషల్ మీడియాలో వారు "ఈ వీడియో జమ్మూలోని ఉధమ్‌పూర్‌లో జరిగింది" అని చెబుతున్నారు. కానీ 2018లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు పుల్వామా ఘటనతో ఎలాంటి సంబంధం లేదని జమ్ము-కశ్మీర్ పోలీసులు చెబుతున్నారు.

కశ్మీరీ డ్రైవర్‌ను కొడుతున్న ఘటన ఉధమ్‌పూర్‌లో జరిగిందని చెబుతూ వీడియో ద్వారా వదంతులు సృష్టిస్తున్నారు. అది ఫేక్. ఇలాంటి వదంతులపై జాగ్రత్తగా ఉండాలి అని జమ్ము-కశ్మీర్ పోలీసులు ఫిబ్రవరి 16న తమ అధికారిక ట్విటర్‌లో ప్రజలను హెచ్చరించారు.

కశ్మీరీ వర్కర్లను కొట్టారు

అలాగే కశ్మీర్ స్థానిక సోషల్ మీడియా గ్రూప్‌లో కొన్ని రోజుల ముందు ఒక పెళ్లిలో జరిగిన గొడవ వీడియోను పోస్ట్ చేసి వైరల్ చేశారు. కశ్మీరీ వర్కర్లను కొట్టారు అని చెప్పి దీనిని షేర్ చేశారు.

ఈ వీడియో చండీగఢ్‌ది అని చెబుతున్నారు. కానీ ఈ వీడియోలో ఘటన దిల్లీలోని జనక్‌పురిలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర జరిగింది. ఇక్కడ భోజనం వడ్డించడం గురించి అతిథులు, హోటల్ స్టాఫ్ మధ్య గొడవ జరిగింది.

అయితే సోషల్ మీడియాలో కశ్మీరీలతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, వారిని తిడుతున్నారని చాలా వార్తలు వస్తున్నాయి.

కానీ ఆ పెళ్లి వీడియోలో ఒక భాగం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దానికి పుల్వామా దాడి, కశ్మీరీ ప్రాంత ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు.

బీజేపీ నేత ప్రకటన

సోషల్ మీడియాలో కొంతమంది #PakistanAndCongressకు సమాధానంగా బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ చేసిన ఒక పాత వ్యాఖ్యను పుల్వామాతో జోడించి షేర్ చేస్తున్నారు.

కాంగ్రెస్ మద్దతుదారుల ఫేస్‌బుక్ గ్రూప్స్‌లోనే కాదు, ముంబై కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో కూడా బీజేపీ ఎంపీ ప్రకటన ఆధారంగా ఏడాది క్రితం వచ్చిన వార్తను పుల్వామా వార్తకు జోడించి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter

2017 చివర్లో సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ క్యాంప్‌పై జరిగిన దాడిలో నలుగురు భారత జవాన్లు మృతి చెందారు. దానికి స్పందనగా బీజేపీ నేత నేపాల్ సింగ్, "ఆర్మీలో రోజూ చనిపోతారు, ఘర్షణలు జరిగినపుడు జవాన్ చనిపోకుండా ఉండే దేశం ఏదైనా ఉందా" అన్నారు.

నేపాల్ సింగ్‌పై తీవ్రంగా విమర్శలు రావడంతో, తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాల్సి వచ్చింది. కానీస, ఆయన ప్రకటనను పుల్వామా ఘటనకు జోడించడం పూర్తిగా తప్పు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)