ఇండియన్ ఆర్మీ: ‘‘కశ్మీర్ తల్లులారా... ఉగ్రవాదంలో చేరిన మీ పిల్లలను లొంగిపోమని చెప్పండి... లేదంటే వాళ్లు చనిపోతారు’’

చినార్ కార్ప్స్ కమాండర్ కేజేఎస్ ధిల్లాన్
ఫొటో క్యాప్షన్,

చినార్ కార్ప్స్ కమాండర్ కేజేఎస్ ధిల్లాన్

పుల్వామా దాడి తర్వాత భారత సైన్యం తొలిసారి స్పందించింది. మంగళవారం లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్లాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

కశ్మీరీ తల్లులందరూ తప్పుదారి పట్టిన తమ కొడుకులను పిలిచి సరెండర్ అయ్యేలా చేయాలని, లేదంటే వారు చనిపోతారని చెప్పారు.

‘‘కశ్మీరీ సమాజంలో తల్లుల పాత్ర కీలకమైనది. నేను కశ్మీరీ తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గన్ను పట్టి ఉగ్రవాదంలో చేరిన మీ కొడుకులతో లొంగిపొమ్మని చెప్పండి. లేదంటే వారు చనిపోతారు. మీ అబ్బాయిలకు తిరిగి రావాలని నచ్చజెప్పండి. తుపాకీ పట్టిన వాళ్లంతా (లొంగిపోకుంటే) చనిపోతారు’’ అని అన్నారు.

సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లను కాల్చి చంపామని, పుల్వామా దాడి జరిగిన 100 గంటల్లోపే జైషే మహమ్మద్ మొత్తం నాయకత్వాన్ని కశ్మీర్‌లో లేకుండా చేశామని ఆయన తెలిపారు.

"పుల్వామాలో ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన కారు బాంబు తరహా దాడి కశ్మీర్‌లో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇలాంటి దాడులు సిరియా, అఫ్ఘానిస్తాన్‌లోనే జరుగుతూ వచ్చాయి. జైషే మహమ్మద్‌ను పాకిస్తాన్ సైన్యం పెంచి పోషిస్తోంది. జైష్‌ వెనక పాకిస్తాన్ ఆర్మీ 100 శాతం ఉంది" అన్నారు.

ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు తాము అన్ని విధాలా సిద్ధంగా ఉంటామని చెప్పారు.

ఈ దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలపై తమకు కొంత సమాచారం లభించిందని, అయితే విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ వివరాలను తాను వెల్లడించలేనన్నారు.

సెలవులో వెళ్లిన బ్రిగేడియర్ హర్‌దీప్ సింగ్.. తన సెలవుల్ని స్వచ్ఛందంగా రద్దు చేసుకుని, జైషే మహమ్మద్ మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొని, ముందుండి నడిపించారని చెప్పారు. పుల్వామా దాడి తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో హర్‌దీప్ సింగ్ గాయపడిన సంగతి తెలిసిందే.

‘‘కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు సంబంధించి మా ఫోకస్ స్పష్టంగా ఉంది. కశ్మీర్ లోయలో అడుగుపెట్టే (మిలిటెంట్లు) ఎవ్వరూ ప్రాణాలతో వెనక్కు వెళ్లలేరు’’ అని ఆయన తెలిపారు.

"మేం జైషే మహమ్మద్ నాయకత్వం వహించేవారి కోసం అన్వేషించాం. కశ్మీర్ లోయలో జైష్ మొత్తం నాయకత్వం లేకుండా చేశామని చెప్పడం సంతోషంగా ఉంది. జైష్ మొత్తం నాయకత్వాన్ని పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారు" అని కన్వల్ జీత్ చెప్పారు.

సీఆర్పీఎఫ్ ఐజీపీ జుల్ఫికర్ హసన్ మాట్లాడుతూ.. పుల్వామా దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలకు హెల్ప్‌లైన్ నెంబర్ 14411 ద్వారా సహాయం అందిస్తున్నామని, ఎంతో మంది కశ్మీరీ విద్యార్థులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందారని తెలిపారు.

సోమవారం జరిగిన ఆపరేషన్లో కమ్రాన్ అనే ఒక మిలిటెంట్‌ను కాల్చి చంపామని, అతడు పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ ఆహ్మద్ డార్ సహచరుడని సైన్యం తెలిపింది.

కమ్రాన్ లోయలోని యువకులను రెచ్చగొట్టి, వారికి ట్రైనింగ్ ఇచ్చేవాడని అధికారులు తెలిపారు.

కశ్మీర్ వెలుపల చదువుతున్న కశ్మీరీ విద్యార్థుల రక్షణకు భద్రతా దళాలు చర్యలు తీసుకున్నాయని చెప్పారు.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మరో మిలిటెంట్‌ను హిలాల్‌గా గుర్తించారు. కశ్మీరీ యువకుడైన ఇతడు బాంబులు తయారు చేసేవాడు. మూడో మిలిటెంట్ పేరు రషీద్ అలియాస్ గాజీ. ఇతడు పాకిస్తాన్‌కు చెందినవాడు. ఈ మిలిటెంట్లు చాలా దాడులకు కుట్ర పన్నుతున్నారని అధికారులు తెలిపారు.

కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీపీ) ఎస్పీ పనీ మాట్లాడుతూ.. (మిలిటెంట్) రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గిందని, గత మూడు నెలల్లో ఎలాంటి చేరికలూ తమ దృష్టికి రాలేదని చెప్పారు. రిక్రూట్‌మెంట్ తగ్గడంలో కుటుంబాలదే కీలక పాత్ర అని, రిక్రూట్‌మెంట్‌ను నివారించేందుకు కశ్మీరీ కుటుంబాలు, సమాజం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)