తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే..

ఫొటో సోర్స్, facebook/Information&PublicRelationsDept, Telangan
గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు
ఎట్టకేలకు కేసీఆర్ ప్రభుత్వంలోకి కొత్తగా మంత్రులొచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడి టీఆర్ఎస్ విజయం ఖరారైన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు అదేరోజున మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఒక మంత్రితోనే కేసీఆర్ ప్రభుత్వం సాగుతోంది.
ఇప్పుడు కొత్తగా మరో 10 మందిని తీసుకోవడంతో మంత్రివర్గానికి ఒక రూపమొచ్చింది. తాజా విస్తరణతో కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన సహా 12 మంది మంత్రులు ఉన్నట్లయింది.
ఇంతకుముందు డిసెంబర్ 13న కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు.
కొత్త మంత్రులు వీరే..

ఫొటో సోర్స్, facebook/Information&PublicRelationsDept, Telangan
ప్రమాణ స్వీకారం చేస్తున్న అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి: నిర్మల్ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మంత్రి పదవి వరకు అనేక కీలక బాధ్యతలు చేపట్టారు.
నాలుగు సార్లు 1999,2004, 2014, 2018లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991, 2008లలో ఆదిలాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు.


ఫొటో సోర్స్, facebook/TalasaniSrinivasayadav
తలసాని శ్రీనివాస యాదవ్
సనత్ నగర్ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో మంత్రిగా టూరిజం, కార్మిక శాఖ, సినిమాటోగ్రఫీ, డెయిరీ డెవలప్‌మెంట్ వంటి శాఖల బాధ్యతలు చూశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు మంత్రి పదవి దక్కడం ఇది నాలుగో సారి. మొత్తం అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు కేబినెట్లో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.
2014లో టీడీపీ టిక్కెట్‌పై గెలిచి అనంతరం టీఆర్‌ఎస్‌లోచేరి మంత్రి పదవి పొందారు. 2018లో టీఆర్ఎస్ నుంచే పోటీ చేసి గెలిచి మరోసారి మంత్రి పదవి చేపట్టారు.


ఫొటో సోర్స్, facebook/JagadishReddyGuntakandla
గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట్ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
విద్య, విద్యుత్, ఎస్టీఎస్టీల అభివృద్ధి వంటి మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు.


ఫొటో సోర్స్, facebook/Eatala
ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో ఆర్థిక, పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు.
2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటల 2004లో పాత కరీంనగర్ జిల్లాలో అప్పటి కమలాపూర్ నియోజవర్గం నుంచి గెలిచారు. 2008లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009లో ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేశారు. తర్వాత హుజూరాబాద్ నుంచి పోటీ చేసి, గెలుపొందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల్లో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి మంత్రి పదవి పొందారు. 2018 ఎన్నికలతో ఆయన ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచినట్లయింది.


ఫొటో సోర్స్, facebook/Singireddy NiranjanReddy
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యే. నిరంజన్ రెడ్డి మొదటి సారి మంత్రి పదవి చేపడుతున్నారు.
కేసీఆర్ గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్ రెడ్డి పనిచేశారు.
2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఈసారి గెలవడంతో పాటు మంత్రి పదవి కూడా అందుకున్నారు.


ఫొటో సోర్స్, facebook/KoppulaEshwar
కొప్పుల ఈశ్వర్
ప్రస్తుతం ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఉప ఎన్నికలు సహా ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనా తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. కేసీఆర్ గత ప్రభుత్వంలో చీఫ్ విప్‌గా పనిచేశారు.
1983 నుంచి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉన్న కొప్పుల 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన టీడీపీలో ఉండేవారు.
1994లో రామగుండం నుంచి తెలుగుదేశం టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో తొలిసారి రామగుండం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉప ఎన్నికలతో కలుపుకొని ఇప్పటి వరకు ఆరుసార్లు గెలిచారు. డీలిమిటేషన్‌లో రామగుండం జనరల్ స్థానం కావడంతో 2009లో ధర్మపురి రిజర్వ్‌డ్ స్థానానికి పోటీ చేశారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు.


ఫొటో సోర్స్, facebook/errabelli Dayakara rao
ఎర్రబెల్లి దయాకరరావు
ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి మంత్రి పదవి చేపట్టారు.
1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ 1994లో తొలిసారి వర్ధన్నపేటలో పోటీ చేసి గెలిచారు. 1999, 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలిచారు.
డీలిమిటేషన్ తరువాత పాలకుర్తికి మారారు. 2009, 2014, 2018 ఎన్నికల్లోనూ ఆయనకు విజయం సొంతమైంది.
2008 ఉప ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచారు.


ఫొటో సోర్స్, facebook/VSrinivasGoud
వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉద్యోగ సంఘాలను ఏకం చేసిన నేతగా కేసీఆర్ వద్ద మంచిపేరుంది.


ఫొటో సోర్స్, facebook/VemulaPrashantReddy
వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రస్తుతం బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి కావడం తొలిసారి. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి ఆయన కేసీఆర్ వద్ద గుర్తింపు పొందారు.


ఫొటో సోర్స్, facebook/facebook/Information&PublicRelationsDept,
చామకూర మల్లారెడ్డి
2014లో మల్కాజ్‌గిరి ఎంపీగా పనిచేసిన మల్లారెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.
విద్యాసంస్థల అధిపతి.
ఆరుగురు కొత్తవారే..
కొత్త మంత్రుల్లో ఆరుగురు తొలిసారి మంత్రి పదవులు చేపట్టారు.
వేముల ప్రశాంతరెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు తొలిసారి మంత్రులయ్యారు.
ఈ విస్తరణలో చోటు దక్కించుకున్న జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్ గతంలోనూ మంత్రులుగా పనిచేశారు.
కేసీఆర్ సహా మొత్తం 12 మంది ఉన్న ప్రస్తుత తెలంగాణ కేబినెట్‌లో మహిళలు లేరు.
కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ దాడి: 46 మంది జవాన్లు మృతి... 19 ఏళ్ల జైష్-ఎ-మొహమ్మద్ రక్తచరిత్ర
- పుల్వామా దాడి: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వుతున్న ప్రియాంకా గాంధీ, నిజమేంటి?
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)