భారత్‌లో సౌదీ యువరాజు: ఈ రెండు దేశాల మధ్య స్నేహానికి అడ్డుగా నిలిచిందెవరు
- గురుప్రీత్ సైనీ
- బీబీసీ ప్రతినిధి
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
యువరాజు నేరుగా పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చారు. పాకిస్తాన్‌తో సౌదీ అరేబియా 20 బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు భారత్‌తో సౌదీ ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుంది అనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టీ ఉంది.
భారత్, సౌదీ అరేబియా మధ్య చాలా పరస్పర ప్రయోజనాలున్నాయి. కానీ, పాకిస్తాన్‌కు సౌదీ దగ్గర కావడం, కశ్మీర్‌పై సౌదీ వైఖరి, మతవాద శక్తులకు వారి మద్దతు లాంటి అంశాలు భారత్, సౌదీ అరేబియా స్నేహం మధ్య అడ్డంకిగా మారుతాయా?
"సౌదీ అరేబియా, భారత్ వ్యవస్థలో వ్యత్యాసాలు ఉన్నాయి. భారత్ ప్రజాస్వామ్య పాలనను విశ్వసిస్తుంది. సౌదీ అరేబియాలో ఇస్లామిక్ పాలన ఉంది. అక్కడ మతవాద పాలన ఉంది, ఆ దేశ పాలకులు మతవాద శక్తులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు" అని మధ్యప్రాచ్య అంశాల నిపుణులు కమర్ ఆగా అన్నారు.
"ఇక్కడ అసలు విషయం ఏంటంటే భారత్‌తోపాటు ప్రజాస్వామిక దేశాలన్నిటికీ ఈ సమస్య ఉంది. వీటిలో యూరప్‌లోని చాలా దేశాలు కూడా ఉన్నాయి".
కానీ చెప్పాలంటే, భారత్, సౌదీ అరేబియా మధ్య మంచి బంధం ఉంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడుతున్నాయి. 25 లక్షల మందికి పైగా భారతీయులు సౌదీలో పనిచేస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ అంశంపై సౌదీ వైఖరి
కశ్మీర్ అంశంలో సౌదీ అరేబియా వైఖరిపై భారత్ కఠినంగా ఉంది.
"నిజానికి, కశ్మీర్‌ను పాకిస్తాన్‌తో కలపాలనే ప్రస్తావనను ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్‌లోని సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు ఎప్పుడూ సమర్థిస్తున్నాయి. అది చాలా పెద్ద విషయం" అని కమల్ ఆగా చెబుతున్నారు.
అయితే సౌదీ అరేబియాలో భారత్ రాయబారిగా ఉన్న తల్మీజ్ అహ్మద్ మాత్రం "2001లో భారత్ అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్‌ను రియాద్ పంపించినపుడు, కశ్మీర్ అంశంపై సౌదీ విస్తృతంగా చర్చించింది. ఆ అంశంపై సౌదీ వైఖరికి అప్పుడు భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది" అని అన్నారు.
అంతేకాదు, అప్గానిస్తాన్‌లో తాలిబన్ల గురించి కూడా భారత్, సౌదీ అరేబియా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అప్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలనకు గుర్తింపు ఇచ్చి, వారికి సాయం కూడా చేసిన దేశాల్లో పాకిస్తాన్‌తోపాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉన్నాయి.
తాలిబన్లతో సౌదీ అరేబియాకు ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి. కానీ భారత్ మాత్రం తాలిబన్లను ఒక మిలిటెంట్ సంస్థగా భావిస్తోంది. అఫ్గానిస్తాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతిస్తోంది.
ఫొటో సోర్స్, PTI
మతవాద శక్తులకు మద్దతు
సౌదీ అరేబియా మతతత్వ శక్తులకు మద్దతిస్తోందని, మదర్సాలు, సంప్రదాయ భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని కమర్ ఆగా తెలిపారు.
"భారత్‌లో చాలా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. దేశ జనాభాలో సుమారు 14 శాతం ముస్లింలు ఉన్నారు. ఇక్కడ కూడా ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ లాగే, ఆ మదర్సాలకు కూడా భారీ స్థాయిలో ఫండింగ్ లభిస్తే, అది భారత దేశానికి ఒక పెద్ద సమస్యగా మారచ్చు" అన్నారు.
అయితే ప్రస్తుతం భారత్, సౌదీ అరేబియా రెండూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మాజీ రాయబారి తమ్లీజ్ అహ్మద్ చెప్పారు.
2008లో జరిగిన ముంబై దాడులపై సౌదీ అరేబియా స్పందించింది. పాకిస్తాన్ భూబాగం నుంచే వాటిని నడిపించారని, పాకిస్తాన్ అండ ఉన్న జీహాదీ గ్రూపుల వల్ల చాలా ప్రమాదం అని భావించింది.
"ప్రస్తుతం భారత్, సౌదీ అరేబియా మధ్య కౌంటర్ టెర్రరిజం ఆధారిత సంబంధాలు ఉన్నాయి. అది చాలా బలంగా ఉంది. రెండు దేశాలు ప్రాంతీయ భద్రత కోసం కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల రెండు దేశాలకూ పరస్పర ప్రయోజనాలున్నాయి" అని తమ్లీజ్ అహ్మద్ చెప్పారు.
"2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, 2016లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య ఉన్న బంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు".
కానీ సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య బంధం అంతకంటే దృఢమైనది అనేది వాస్తవం.
ఫొటో సోర్స్, @PID_GOV
పాకిస్తాన్.. సౌదీకి చాలా దగ్గరగా ఉందా?
"సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య చాలా బలమైన బంధం ఉంది. పాకిస్తాన్.. సౌదీ అరేబియా రాజ కుటుంబానికి రక్షణ కల్పిస్తోంది" అని కమర్ ఆగా అన్నారు.
"సౌదీ అరేబియాలో పాకిస్తాన్ తమ సైన్యాన్ని మోహరించింది. షియా సమాజం వారు నివసించే చోట ఆ దేశం తమ సైనికులను భారీ స్థాయిలో మోహరించింది. సౌదీ అరేబియాలో చమురు ఎక్కువగా లభించేది కూడా ఈ అల్ హసా ప్రాంతంలోనే" అని ఆగా తెలిపారు.
"సౌదీ అరేబియా సైన్యం చాలా బలహీనమైనది. భద్రత కోసం దానికి అమెరిగా గ్యారంటీ ఇస్తోంది. మరోవైపు పాకిస్తాన్ దానికి బహిరంగంగా మద్దతు ఇస్తోంది" అని అన్నారు.
భవిష్యత్తులో ఇరాన్-సౌదీ అరేబియా మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వస్తే, పాకిస్తాన్.. సౌదీకి చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది.
ఫొటో సోర్స్, @PID_GOV
పాకిస్తాన్‌తో మతపరమైన బంధం
"పాకిస్తాన్ - సౌదీ అరేబియా మధ్య మతపరమైన బంధం కూడా చాలా బలంగా ఉంది. పాకిస్తాన్.. దక్షిణాసియాలో ఇరాన్, పర్షియన్ ప్రభావాన్ని నియంత్రించే పని చేస్తుంది. దానికోసం సౌదీ అరేబియా పాకిస్తాన్‌లో కొన్ని వేల మదర్సాలు తెరిచేలా ఫండింగ్ అందించింది" అని కమల్ ఆగా తెలిపారు.
"మధ్యప్రాచ్యంలో, ముఖ్యంగా ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ చైనాను ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్, చైనా కలిసి డిఫెన్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నాయి. నిజానికి చైనా ఆ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను పాకిస్తాన్‌లో ఏర్పాటు చేస్తే, సౌదీ.. పాక్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. దానివల్ల ఆ దేశానికి పెట్టుబడులు కూడా వస్తాయి. అందుకే పాకిస్తాన్.. సౌదీ అరేబియాకు చాలా ముఖ్యమైన దేశం".
కానీ ప్రస్తుతం సౌదీ అరేబియా భారత్‌ను కూడా పక్కన పెట్టలేదు. భారత ఆర్థిక వ్యవస్థ సౌదీని అలా చేయకుండా అడ్డుకుంటోంది.
భారత్ 20 శాతం చమురును సౌదీ అరేబియా నుంచే కొంటుంది. సౌదీ అరేబియాకు అతిపెద్ద చమురు మార్కెట్ భారత దేశమే. అందుకే అది భారత్‌ను వదులుకోలేదు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. అలాంటప్పుడు సౌదీ అరేబియాకు చమురే కాకుండా, భారత్ వల్ల వేరే ఆదాయం కూడా కనిపిస్తోంది. అందుకే అది ఇక్కడ పెట్టుబడులు పెడుతోంది.
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కచ్చితంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఒక బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు.
ఫొటో సోర్స్, Reuters
ఇరాన్, సౌదీ రెండిటితో భారత్ బంధం బాగుంది. కానీ ఇరాన్, సౌదీ అరేబియాలకు పడడం లేదు. అలాంటప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంటుంది?
"భారత్ తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అది తన విదేశాంగ విధానం ప్రకారమే ముందుకెళ్తుంది" అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
భారత్‌కు సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయెల్ మూడు దేశాలతో మంచి సంబంధాలున్నాయి. ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలూ చాలా ముఖ్యమైనవి.
"భారత్ ఒక దేశంతో దగ్గరగా, మరో దేశానికి దూరంగా ఉండడం లేదు. సౌదీ, ఇజ్రాయెల్, ఇరాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో భారత్‌కు రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాల మధ్య పరస్పర సంబంధాలు ఎలా ఉన్నా, ఆ ప్రభావం భారత్‌పై ఉండదు" అన్నారు తల్మీజ్ అహ్మద్.
ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్-సౌదీ అరేబియా బంధం బలపడడం వల్ల భారత్‌తో దాని సంబంధాలపై ఏదైనా ప్రభావం పడుతుందా?
"ఇరాన్ మధ్య ఆసియాలోకి చేరడానికి భారత్ ఒక గేట్ వే లాంటిది. ఈ రెండు దేశాల మధ్య సివిల్ ఏవియేషన్ రంగం, సాంస్కృతిక రంగంలో ఎన్నో ఏళ్ల నుంచి మంచి సంబంధాలున్నాయి. అలాగే అరేబియాతో కూడా భారత్‌కు పురాతన సంబంధాలున్నాయి" అని తల్మీజ్ చెప్పారు.
ఆయా దేశాల అంతర్గత విషయాల్లో భారత్ తలదూర్చకపోవడం కూడా ఈ సంబంధాలు మెరుగుపడడానికి మరో కారణం.
అయితే, పాలస్తీనా డిమాండ్లు సరైనవే అని భావిస్తున్న భారత్ దానికి మద్దతిస్తోంది. కానీ ఆ దేశాల అంతర్గత గొడవలు, వివాదాల విషయంలో భారత్ తటస్థంగా ఉంటుంది.
అంతే కాదు, ఈ దేశాల అభివృద్ధి ప్రాజెక్టుల్లో కూడా భారత్ బహిరంగంగా సహకరిస్తోంది. భారత్‌కు చెందిన 70 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో, పర్షియన్ గల్ఫ్‌లో, ముఖ్యంగా అరబ్ దేశాల్లో పనిచేస్తున్నారు.
అక్కడ అభివృద్ధిలో వీరి భాగస్వామ్యం చాలా ఉంది. వారికి చాలా ప్రశంసలు కూడా దక్కాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఏయే అంశాలపై చర్చలు జరుగుతాయి
సౌదీ అరేబియా యువరాజు దిల్లీకి వస్తున్న సందర్భంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి పనిచేస్తామని ఆ దేశం చెప్పింది.
ఆసియా పర్యటనలో ఉన్న క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ తాజాగా పాకిస్తాన్‌లో పర్యటించారు.
సోమవారం దీనిపై మాట్లాడిన సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబైర్ "రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నించడమే మా ఉద్దేశం" అని చెప్పారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి మార్గం వెతుకుతాం అని అన్నారు.
"సౌదీ ప్రిన్స్ ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత వృద్ధి చేయడం గురించి చర్చలు జరుపుతారు. దానితోపాటు పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న తీవ్రవాద స్థావరాలపై పట్టు బిగించేలా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని కూడా భారత్ కోరాల్సి ఉంటుంది" అని కమర్ ఆగా అన్నారు.
"సౌదీ అరేబియా తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడింది. అధి తీవ్రవాద నిర్మూలనపై అది ఎంత సీరియస్‌గా ఉందో చూడాలి. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌లో మళ్లీ వస్తే ఇస్లామిక్ మూవ్‌మెంట్‌కు చాలా పెద్ద సపోర్ట్ లభిస్తుంది. ఇటీవల ఆత్మాహుతి దాడి తర్వాత దేశానికి వస్తున్న సౌదీ అరేబియా నేతలకు.. ఇది భారత్‌కు మాత్రమే కాదు, అందరికీ ప్రమాదమే అనే విషయాన్ని భారత్ మరోసారి గుర్తు చేయాలి" అంటారు తల్మీజ్ అహ్మద్.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి, 34 మంది మృతి
- Fact Check: 2014 తర్వాత భారత్‌లో భారీ తీవ్రవాద దాడులు జరగలేదా
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- '39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపేశారు'
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- "కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)