తెలంగాణ మంత్రివర్గం: ఈసారీ కనిపించని మహిళలు.. ‘మహిళలు ఇంట్లో ఉండట’మే కారణమా?
- దీప్తి బత్తిని
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Telangana CMO
తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఈసారీ మహిళలు కనిపించలేదు. కారణమేమిటని అడిగిన ప్రశ్నకు కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీష్‌రెడ్డి ''మహిళలు ఇంట్లో ఉన్నారు'' అని బదులిచ్చారు.
ఆ వెంటనే ''వారి బ్యాకింగ్ మాకు ఎప్పుడూ ఉంటుంది.. అది చాలు" అని ముక్తాయించారు.
కేసీఆర్ ఒక ఫ్యూడల్ మెంటాలిటీ గల రాజకీయ నాయకుడని, ఆయన మంత్రివర్గంలో మహిళలు లేకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి.
కానీ ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే అవకాశం తప్పక ఉంటుంది అని నమ్ముతున్నట్లు ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత చెప్పారు.
ఫొటో సోర్స్, Telangana CMO
కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసిన 70 రోజులకు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 70 రోజుల తరువాత కేసీఆర్ మంగళవారం నాడు మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పది మంది మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
తాజా విస్తరణతో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య ఆయన సహా రెండు నుంచి 12 మందికి పెరిగింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడి టీఆర్ఎస్ విజయం ఖరారైన తరువాత 2018 డిసెంబర్ 13 న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు అదే రోజున మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఫొటో సోర్స్, Telangana CMO
కొత్త మంత్రులు, వారి శాఖలు...
- ఇంద్రకరణ్ రెడ్డి: అటవీ, పర్యావరణం, శాస్త్ర - సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖలు
- తలసాని శ్రీనివాస యాదవ్: పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు
- గుంటకండ్ల జగదీశ్ రెడ్డి: విద్యా శాఖ
- ఈటల రాజేందర్: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు
- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి: వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, ఆహారం - పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు
- కొప్పుల ఈశ్వర్: షెడ్యూల్డు కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సక్షేమ శాఖలు
- ఎర్రబెల్లి దయాకరరావు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలు
- వి.శ్రీనివాస్ గౌడ్: ప్రొహిబిషన్ - ఎక్స్సైజ్, క్రీడలు - యువజన సేవలు, పర్యాటక - సాంస్కృతిక, పురావస్తు శాఖలు
- వేముల ప్రశాంత్ రెడ్డి: రవాణా, రోడ్లు - భవనాలు, శాసనసభ వ్యవహరాలు, గృహ నిర్మాణ శాఖలు
- చామకూర మల్లారెడ్డి: కార్మిక - ఉపాధి, ఫ్యాక్టరీలు, మహిళా శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖలు
ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రులుగా పనిచేశారు. మిగతా ఆరుగురూ మొదటి సారి మంత్రులుగా ప్రమాణం చేశారు.
అయితే, కేబినెట్లో ఈసారి కూడా మహిళలకు స్థానం లభించలేదు. షెడ్యూల్డు తెగలకు చెందిన వారికి కూడా కాబినెట్లో ప్రాతినిధ్యం లేక పోయింది.
ఫొటో సోర్స్, Trs party/facebook
మంత్రివర్గంపై నాయకులు ఏమన్నారు?
''ఇది చాలా బాలన్స్ కేబినెట్'' అని కడియం శ్రీహరి బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు.
అయితే.. మంత్రులకు కులం అనేది అవసరం లేదని, ప్రజల మేలు కోసమే పని చేస్తామని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీష్ రెడ్డి చెప్పారు.
'మరి మహిళలు ఎందుకు లేరు?' అన్న ప్రశ్నకు.. ''మహిళలు ఇంట్లో ఉన్నారు'' అని బదులిచ్చారు. వెంటనే ''వారి బ్యాకింగ్ మాకు ఎప్పుడు ఉంటుంది.. అది చాలు'' అని చెప్పారు.
''ఈ మంత్రి వర్గంలో సీనియర్ సభ్యులకు అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఉన్నారు ముఖ్యమంత్రి. అంతేకాక వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా ముఖ్యం. రాష్ట్రంలో 16 సీట్లు గెలవాలన్నదే టీఆర్ఎస్ అశయం. అదే దిశగా పనులు జరుగుతున్నాయి'' అని ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత బీబీసీతో పేర్కొన్నారు.
మలివిడత కేబినెట్ విస్తరణలో మహిళలకు చోటు లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఫొటో సోర్స్, Harish Rao Thanneeru/Facebook
హరీష్‌రావుని దూరం పెడుతున్నారా?
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు చాలా సమయం తీసుకున్నారన్నది అనేక వర్గాల అభిప్రాయం.
''కేసీఆర్‌కి ఎదురు తిరుగుతారనే సమస్య లేదు కాబట్టి అయన తాపీగా పనులు చేసుకుంటున్నారు'' అని రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
''అధికారం అధికంగా ఒక దగ్గర కేంద్రీకృతమై ఉంది. కేసీఆర్ అధికారాన్ని ప్రశ్నించే సమస్యే లేదు. అనేక ఊహాగానాలు వచ్చాయి. ఏది ఏమైనా అయన భవిష్యత్తులో ఏం చేస్తారనేది చూడాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, Trs party/facebook
‘‘ఇద్దరు వారసులు ఉండే చోట ఉండే సమస్యే’’
కాబినెట్ లో సోషల్ బాలన్స్ కన్నా క్యాస్ట్ బాలన్స్ చూసుకొని చేశారనటం సరిగ్గా ఉంటుందని కూడా రవి వ్యాఖ్యానించారు. ''అది కూడా హెజెమోనిక్ కులం వారికీ అవకాశాలు కల్పించారు. అంతేకాక కేసీఆర్ ఒక ఫ్యూడల్ మెంటాలిటీ గల రాజకీయ నాయకుడు. కాబట్టి మంత్రివర్గంలో మహిళలు లేకపోవటం ఆశ్చర్యం కలిగించదు'' అని విశ్లేషించారు.
ఇక మాజీ మంత్రి హరీష్‌రావుకి కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించక పోవటంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇద్దరు వారసులు ఉండే ప్రతి చోటా ఉండే సమస్య ఇదని తెలకపల్లి రవి పేర్కొన్నారు.
''భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో చుసినా ఈ సమస్య ఉంది. ఏ రాజకీయ పార్టీలోనైనా ఇద్దరు వారసులు ఉన్నపుడు ఇలాంటి సమస్య తప్పలేదు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఇలాంటి రాజకీయ వారసత్వం సమస్య ఉంటూనే ఉంది'' అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Telangana CMO
ఆ పొజిషన్ గ్రాంటెడ్ కాదు అనే సందేశం ఇచ్చారా?
''అయితే.. ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్మేషన్లో మొదటి మెట్టు కేటీఆర్‌కి పార్టీ బాధ్యతలు అప్పగించటంగా చూడాలి. ఇప్పుడు హరీష్‌రావుకి మంత్రివర్గంలో స్థానం కల్పిచక పోవటం మీద అనేక ఉహాగాలు ఉన్నాయి.
వచ్చే పార్లమెంటు ఎన్నికలను చూసుకోవాలి కనుక ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు. దీని ఒక సాకుగా చూస్తే.. ఇంత కాలం ఒక మంత్రిగా, కెసీఆర్ సన్నిహితుడిగా హరీష్‌రావు ఎంజాయ్ చేసిన పొజిషన్ గ్రాంటెడ్ కాదు అన్న సందేశం ఇవ్వటానికిగా కూడా చూడొచ్చు. మంత్రిగా ఉంటూనే కదా కేటీఆర్ మున్సిపల్ ఎలక్షన్స్ బాధ్యత తీసుకున్నారు? ఏది ఏమైనా కుటుంబం లోపల ఏం జరుగుతుంది అన్నది వారికే తెలుస్తుంది.
మళ్లీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? జరుగుతే ఎలా ఉంటుంది? అన్నది మరి కేసీఆర్‌కి తప్ప ఎవరికీ తెలియదు'' అని తెలకపల్లి అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- పుల్వామా దాడి: కశ్మీర్ ఎలా విడిపోయింది? వారికి ఏం కావాలి?
- ‘‘కశ్మీర్ తల్లులారా... తప్పుదారి పట్టిన మీ పిల్లలను లొంగిపోమని చెప్పండి... లేదంటే చనిపోతారు’’
- పుల్వామా దాడి: ఈ స్థాయిలో పేలుడు పదార్థాలను పాక్ నుంచి భారత్‌లోకి తేవడం సాధ్యమేనా...
- కశ్మీర్: ప్రజాభిప్రాయ సేకరణను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)