పుల్వామా దాడిని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కనీసం ఖండించలేదు: అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

ఫొటో సోర్స్, Reuters

పుల్వామా దాడి గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. పాకిస్తాన్ కనీసం ఈ దాడిని ఖండించలేదని ఆరోపించారు.

ఆధారాల విషయంలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన అరుణ్ జైట్లీ "నేరం చేసిన వారే దాన్ని అంగీకరిస్తున్నప్పుడు, మళ్లీ ఆధారాలు చూపమనడంలో అర్థం లేదు" అన్నారు.

"ఈ దాడికి ఇంతకు ముందు లాగే, పాక్ భూభాగాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే పాకిస్తాన్ తీసుకునే స్టాండ్‌పై ప్రపంచంలో ఎవరికీ నమ్మకం కలగడం లేదు" అన్నారు.

అంతకు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా విడుదలైన ఒక ప్రకటనలో "ఈ దాడిలో పాకిస్తాన్ పాత్ర లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు" అని తెలిపింది.

"పాకిస్తాన్‌కు టెర్రరిస్టులతో లింకులు లేవంటూ పాక్ మళ్లీ అదే పాట పాడుతోంది. దాడికి మేమే బాధ్యులమన్న జైషే మహమ్మద్ ప్రకటనను కూడా పాకిస్తాన్ ప్రధాన మంత్రి పట్టించుకోలేదు".

"జైషే మహమ్మద్, దాని చీఫ్ మసూద్ అజర్‌కు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పిస్తోంది అనేది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ వారిపై చర్యలు తీసుకోవడానకి ఇంతకు మించిన ఆధారాలు ఏముంటాయి" అని భారత్ ప్రశ్నించింది.

"దాడి విషయంలో ఆధారాలు ఇస్తే తమ దేశంలో దర్యాప్తు చేయడానికి సిద్ధం అని చెబుతున్నారు. ఇవి కుంటిసాకులు మాత్రమే. ఎందుకంటే 2011 నవంబర్ 26న జరిగిన ముంబై దాడులకు సంబంధించి, పాకిస్తాన్‌కు అన్ని ఆధారాలు సమర్పించాం. కానీ పదేళ్లైనా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పఠాన్ ‌కోట్ ఎయిర్ బేస్ దాడుల విషయంలో కూడా అదే జరిగింది. పాక్ డొల్ల హామీలు ఇస్తోంది" అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, EPA

ఎన్నికలకు జోడించడం విచారం

"పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దేశం ఇప్పుడు కొత్త పాకిస్తాన్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు, హఫీజ్ సయీద్ లాంటి టెర్రరిస్టుతో బహిరంగంగా వేదికను పంచుకుంటున్నారు. అంటే ఆ కొత్త ప్రభుత్వం ఇదేనా. తీవ్రవాదం అంశంపై చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని చెప్పారు. తీవ్రవాదం, హింస లేని వాతావరణంలో విస్తృత ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమని భారత్ ఎప్పుడూ చెబుతూ వస్తోంది" అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

"తీవ్రవాద బాధిత దేశంగా పాక్ చెప్పుకుంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందనే వాస్తవం అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసు."

"పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, పుల్వామా దాడిని రాబోవు ఎన్నికలకు జోడించి చూడడం విచారకరం. దీన్ని ఖండిస్తున్నాం" అని పేర్కొన్నారు.

"పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టించడం మానుకోవాలి. పుల్వామా దాడిలో దోషులపై విశ్వసనీయమైన, స్పష్టమైన చర్యలు చేపట్టాలి" అని భారత విదేశాంగ శాఖ తమ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)