హెల్ప్‌లైన్ 112 : అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన నంబర్ ఇదే

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న మహిళ

ఫొటో సోర్స్, OATAWA

విపత్కర పరిస్థితిలో సహాయం కోసం ఫోన్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే నంబరును తీసుకొచ్చింది.

గతంలో వైద్య సేవల కోసం 108, పోలీస్ సహాయం కోసం 100, మహిళా భద్రత కోసం 1090, ఆగ్నిమాపక శాఖ సహాయానికి 101 నంబర్లను వినియోగించేవారు.

అయితే, ఇప్పుడు వీటన్నింటినీ సమీకృతం చేస్తూ ఒకే నంబర్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. అదే 112.

ఎలాంటి ఆపదైనా 112 నంబర్‌కు డయిల్ చేస్తే సరిపోతుంది.

ఈఆర్‌ఎస్‌ఎస్‌ (అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ)గా పలిచే ఈ కొత్త వ్యవస్థను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈనెల 19న ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

వచ్చే ఏడాది నాటికి దేశమంతటా ఈ నంబరు పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Rajnath singh/fb

112 అంటే ఏమిటి?

అమెరికాలో ఎమర్జెన్సీ నంబర్‌గా పిలిచే 911 లాంటిదే మన దేశంలో ప్రారంభమైన ఈ 112 ఎమర్జెన్సీ నంబర్‌.

అమెరికాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అక్కడి ప్రజలు వెంటనే 911కు ఫోన్ చేస్తారు.

ఇప్పుడు అలాంటి వ్యవస్థనే మన దేశంలో ప్రవేశపెట్టారు. వైద్యం, పోలీసు, ఆగ్నిమాపక, మహిళ భద్రత ఇలా ఎలాంటి ఆపదకైనా ఇప్పుడు 112 నంబర్‌కు డయిల్ చేస్తే సరిపోతుంది.

ట్రాయ్ సూచనలను అనుసరించి టెలికాం కమిషన్ కూడా ఈ నంబర్‌ను అధికారికంగా వినియోగించేందుకు ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, Rajanath singh/fb

112 ఎలా పనిచేస్తుంది?

112 అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ. జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)ను ఆధారంగా చేసుకొని ఆపదలో ఉన్నవారికి సాయం అందించేలా దీన్ని రూపొందించారు.

జీపీఎస్ ( గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్) ను ఆధారంగా చేసుకునే ప్రతిస్పందన దళాలు ఆపదలో ఉన్నవారిని చేరుకుంటాయి.

అత్యవసర సాయం కావాల్సిన వారు ఫోన్‌లో ఉన్న 112 నంబర్ నొక్కాలి. లేదా స్మార్ట్ ఫోన్ పవర్ బటన్‌ను వెంటవెంటనే మూడు సార్లు నొక్కాలి.

అప్పుడు వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌కు కాల్ వెళుతుంది.

స్మార్ట్‌ఫోన్ కాకుండా సాధారణ ఫోన్ అయితే 5 లేదా 9 నంబర్‌ను కొద్ది సేపు నొక్కి పట్టి ఉంచి (లాంగ్‌ ప్రెస్‌) ఎమర్జెన్సీ సేవలు పొందవచ్చు.

బ్యాలెన్స్, అవుట్ గోయింగ్ లేని, తాత్కాలికంగా పనిచేయని సిమ్‌లలో, ల్యాండ్ లైన్‌ ఫోన్‌లలోనూ ఈ నంబర్ పనిచేస్తుంది.

కాల్ చేసే పరిస్థితి లేకుంటే 112 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసి కూడా సాయం పొందొచ్చు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌( ఈఆర్‌సీ) వెబ్‌సైట్‌కు వెళ్లి ఈమెయిల్ ద్వారా కూడా సాయం కోరవచ్చు.

ఎమర్జెన్సీ కాల్ వచ్చిన 10 లేదా 12 నిమిషాల్లో సాయం లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

112 అనేది ఉచితమేనా?

అవును. 112 నంబర్ అనేది పూర్తిగా ఉచిత కాల్. దీనికి కాల్ చేస్తే డబ్బులు కట్ కావు.

నా మొబైల్ నుంచి 112కు కాల్ చేయొచ్చా?

దేశంలో ఎక్కడికైనా మీ ఫోన్ నుంచి 112కు కాల్ చేయొచ్చు.

112కు ఫోన్ చేసి ఏ భాషలో మాట్లాడాలి?

మీ మాతృభాష‌లో లేదా హిందీ, ఇంగ్లిష్‌లో కూడా మాట్లాడి సాయం పొందొచ్చు.

112కు ఏ సమయంలో ఫోన్ చేయాలి?

112 అనేది 24 గంటలు పనిచేసే నంబర్. ఆపదలో ఉన్న ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు.

"network unavailable / emergency number only" అని ఫోన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు 112కు ఫోన్ చేస్తే కాల్ కలుస్తుందా?

అలాంటి మెసేజ్ కనిపించినా 112కు డయిల్ చేస్తే కాల్ కలుస్తుంది.

ఫొటో సోర్స్, 112india

112 ఇండియా పేరుతో మొబైల్ యాప్

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 112 ఇండియా పేరుతో ఒక మొబైల్ యాప్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించింది.

ఆపద సమయంలో పిల్లలు, మహిళల రక్షణకు ఉపయోగపడేలా ''SHOUT'' ఫీచర్‌ను ఇందులో ప్రవేశపెట్టింది.

ఇప్పటికే చాలా ఫోన్లు ఇప్పటికే ఈ నంబరు కోసం SOS యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)