సుప్రీంకోర్టు: అనిల్ అంబానీ నెల రోజుల్లో రూ.453 కోట్లు కట్టకపోతే జైలుకే

అనిల్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్.కామ్) చైర్మన్ అనిల్ అంబానీ, ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల యథాలాప వైఖరిని అవలంభించారని నిందించింది.

మరో నాలుగు వారాల్లో స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌కు రూ.453 కోట్లు చెల్లించాలని, లేకుంటే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది.

అలాగే.. సుప్రీంకోర్టు న్యాయ సహాయ విభాగానికి అనిల్ అంబానీకి చెందిన మూడు కంపెనీలు కోటి రూపాయల చొప్పున నాలుగు వారాల్లో చెల్లించాలని, లేకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది.

కాగా, అంతకు ముందు ఆర్.కామ్ పూచీకత్తుగా పెట్టిన రూ.118 కోట్లను కంపెనీకి తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది.

ఎరిక్సన్ కంపెనీకి రూ.550 కోట్లు చెల్లించాలని గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని 120 రోజుల్లో చెల్లించాలని గడువు విధించింది.

కానీ, ఆర్.కామ్ కంపెనీ ఆ గడువులోపు డబ్బులు చెల్లించలేకపోయింది. తర్వాత మరో 60 రోజులు అదనపు గడువును కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ లోపు డబ్బు చెల్లించటంలో కూడా ఆర్.కామ్ విఫలమైంది.

ఈ మేరకు డబ్బు చెల్లిస్తామంటూ కోర్టుకు ఇచ్చిన పూచీకత్తు అబద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది న్యాయ పాలనకు విఘాతం కలిగించింది, సుప్రీంకోర్టుకు అబద్ధపు హామీ ఇవ్వటం కోర్టు నియమాలను ఉల్లంఘించటమేనని తెలిపింది.

ఈ విషయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆర్.కామ్ కంపెనీ తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

కేసు పూర్వాపరాలు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ తన నెట్‌వర్క్‌ కార్యకలాపాలను కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఎరిక్‌సన్ కంపెనీతో 2014లో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందానికి సంబంధించి ఆర్.కామ్ తమకు రూ.550 కోట్లు చెల్లించాల్సి ఉందని ఎరిక్‌సన్ గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)