మోదీతో సౌదీ ప్రిన్స్ 'తీవ్రవాదం' గురించి ఏం చెప్పారు...

మోదీ సౌదీ క్రౌన్ ప్రిన్స్

ఫొటో సోర్స్, EPA

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.

క్రౌన్ ప్రిన్స్ భారత్ వచ్చే ముందు పాకిస్తాన్ వెళ్లారు. ఆ దేశంతో బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకున్నారు.

క్రౌన్ ప్రిన్స్ నేతృత్వంలో సౌదీ ప్రతినిధి బృందం భారతీయ ప్రతినిధి బృందంతో చర్చించింది. ఆ తర్వాత సంయుక్త ప్రకటనను జారీ చేశారు.

దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో "భారత్‌లో క్రౌన్ ప్రిన్స్ మొదటి రాజకీయ పర్యటన సందర్భంగా చాలా కీలక ఒప్పందాలు జరిగాయని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తీవ్రవాదం సమస్యను కూడా ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Anadolu Agency

మోదీ ఏం చెప్పారు?

ప్రపంచవ్యాప్తంగా మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న వినాశనానికి పుల్వామా మిలిటెంట్ దాడి మరో క్రూర చిహ్నంగా నిలిచింది. ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే తీవ్రవాదాన్ని ఏదో ఒక విధంగా సమర్థిస్తున్న దేశాలపై మనం అన్నిరకాల ఒత్తిడులు పెంచాల్సిన అవసరం ఉంది.

తీవ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం, వారి మద్దతు లేకుండా చేయడం, మిలిటెంట్లకు, వారి మద్దతుదారులకు శిక్ష పడేలా చేయడం చాలా అవసరం

తీవ్రవాదానికి వ్యతిరేకంగా సహకరించుకోవడంతోపాటు, దానికోసం ఒక బలమైన కార్యాచరణ రూపొందించడం కూడా చాలా అవసరం. అప్పుడే మిలిటెంట్ శక్తులు మన యువతను తప్పుదారి పట్టించకుండా ఉంటాయి. దీనిపై సౌదీ అరేబియా, భారత్ తమ ఆలోచనలు పంచుకోవడం సంతోషంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

క్రౌన్ ప్రిన్స్ ఏం చెప్పారు?

భారత్, సౌదీ అరేబియా బంధం రక్త సంబంధం లాంటిది. ఇంధన, పర్యాటక, సాంస్కృతిక, లేదా మౌలిక సదుపాయాలు లాంటి రంగాల్లో మాకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికీ ఆయా రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి.

మేం ఒకే వ్యూహం రూపొందించవచ్చు. సంయుక్త ప్రణాళికలు రూపొందించవచ్చు. 2016లో నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా రెండు దేశాల సంబంధాలలో వృద్ధి వచ్చింది. సుమారు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా పెట్టాం.

భారత్ ఐటీ సెక్టార్‌లో చాలా బలోపేతమైంది. దానివల్ల మాకు సౌదీ అరేబియాలో కూడా ప్రయోజన లభించింది. ఈ రంగంలో భారత్‌లో 100 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అతివాదం, తీవ్రవాదం అనేవి రెండూ దేశాలకు ఆందోళన కలిగించే విషయమే. నిఘా సమాచారం పంచుకోవడమైనా, వేరే ఎలాంటి సాయం అయినా మీకు మా వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని మేం భారత్‌కు చెప్పాలని అనుకుంటున్నాం.

అందరితో కలిసి పనిచేస్తే, అది రాబోవు తరాల వారికి మెరుగైన భవిష్యత్తు అందించగలదు.

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ అరేబియా భారత్‌కు మిత్రుడా, శత్రువా?

ఇటు, కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ రణదీప్ సూర్జేవాలా సౌదీ ప్రిన్స్, ప్రధాన మంత్రి మోదీ ఆలింగనం చేసుకోవడాన్ని 'హగ్లోమెసీ'గా వర్ణించారు. సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల సాయం అందించడం, తీవ్రవాదం విషయంలో వెన్నుతట్టడం గురించి ప్రశ్నలు లేవనెత్తారు.

తర్వాత చేసిన మరో ట్వీట్‌లో ఆయన "పాకిస్తాన్‌తో కలిసి జారీ చేసిన సంయుక్త ప్రకటనను వెనక్కు తీసుకోవాలని సౌదీ అరేబియాను కోరే దమ్ము ప్రధాన మంత్రి మోదీకి ఉందా?" అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)