నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

 • 5 మార్చి 2019
చంద్రబాబు నాయుడు Image copyright Getty Images

దాదాపు 15 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు.

థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

1996లో వివిధ రాజకీయ పార్టీలతో కూడిన సెక్యులర్ యునైటెడ్ ఫ్రంట్ కూటమి ఏర్పాటులోనూ, దేవెగౌడ ప్రధానమంత్రి పీఠమెక్కడంలో కీలక పాత్ర పోషించారు.

ఆ తరువాత మరో టర్న్ తీసుకొని బీజేపీతో జతకట్టి మొదటి నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజపేయీ ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి తోడ్పడ్డారు.

2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓడిపోయింది. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ కూడా అధికారం కోల్పోయింది. అప్పుడు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'మతతత్వ బీజేపీ', నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్లే ఓటమికి కారణమని నిందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని చెప్పుకొచ్చారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా మొదలైన తెలుగుదేశం ప్రస్తుతం అదే కాంగ్రెస్‌తో ఎలా జతకడుతుందని అనేకులు ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చరిత్ర అలాంటిది. ఎన్టీఆర్ కాంగ్రెస్ నేతలపై దుమ్మెత్తి పోసిన తీరు, వాడిన పదజాలం ఇంకా పాతవారికి గుర్తొస్తూనే ఉంటాయి.

చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. 1978లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1980లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ చేశారు. అదే ఎన్టీఆర్‌ కుమార్తెను పెళ్లిచేసుకునేందుకు సాయపడింది.

'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌ మీద ఘన విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమిని చవిచూశారు.

ఆ తరువాత టీడీపీలో చేరి క్రమంగా శక్తిమంతమైన నేతగా ఎదిగారు. 1984లో చంద్రబాబుకు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశానుసారం గవర్నర్ రామ్‌ లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు, ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు జరిగిన ఆందోళనల్లో చంద్రబాబు క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు నీడలా ఉన్న చంద్రబాబు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంలో తోడ్పాటునందించారు. ఆ ప్రయత్నమే 1989లో నేషనల్ ఫ్రంట్‌గా రూపం దాల్చింది.

అదే చంద్రబాబు 1995లో ఎన్టీఆర్‌ను దింపేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొందరు దాన్ని ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటారు. మరికొందరు పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించుకుంటారు. ఏమైనా ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో చంద్రబాబును ‘జామాతా దశమ గ్రహం’ అని విమర్శించారు. ఆయన్ను చేరదీసి తప్పుచేశానని వాపోయారు.

Image copyright TDP

2002లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్ర మోదీ వైదొలగాలని చంద్రబాబు కోరుకున్నారు. 2014 తరువాత అదే మోదీతో చేయి కలిపి, బీజేపీ కూటమిలో భాగమయ్యారు.

2014 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. మరి ఇప్పుడు చంద్రబాబు తన కాంగ్రెస్ వ్యతిరేకతను పక్కనబెట్టి ఆ పార్టీతో ఎందుకు చేయి కలిపారు?

దీన్ని ఊసరవెల్లిలా రంగులు మార్చడం అని, విలువలు కొరవడడమని కొందరంటారు. కానీ, చంద్రబాబు మాత్రం దీన్ని 'ప్రజాస్వామ్య అనివార్యత' అని అభివర్ణిస్తున్నారు.

బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దేశ భవిష్యత్తును కాపాడండి' అనే నినాదాన్ని కూడా ఆయన అందించారు.

Image copyright Getty Images

కాంగ్రెస్‌తో జత కట్టడంపై వినవస్తున్న తీవ్ర వ్యాఖ్యానాలను పక్కనబెడితే అనేక ఇతర కారణాలకు తోడు ముఖ్యంగా రాజకీయాల్లో మనుగడ సాగించడమన్నది చంద్రబాబును కాంగ్రెస్‌కు దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు కొందరు పేర్కొంటున్నారు.

2018 మార్చిలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలబాణాలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం అది తీవ్రమైన పదజాలంతో పరస్పరం దూషించుకునేంత దూరం వెళ్లింది.

ప్రతి ఎన్నికల్లోనూ సమీకరణాలను లెక్కేసి కూటములు పొత్తులు కట్టడంలోనూ జనం నాడిని పసిగట్టి వ్యూహాలు వేయడం లోనూ దిట్ట అని చంద్రబాబుకు పేరుంది. బూత్ మేనేజ్ మెంట్, ఎలక్షనీరింగ్ అనే పదాలను ప్రాచుర్యం చేయడంలో ఆయన పాత్ర తిరుగులేనిదని అంటారు. అదే విషయాన్ని విమర్శకులు ఒక రకంగా, అభిమానులు ఇంకో రకంగా చెపుతుంటారు.

Image copyright FACEBOOK/YSJAGAN

జగన్‌మోహన్‌రెడ్డి మీద 2018లో జరిగిన కత్తి దాడి కూడా.. బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఆయనను లక్ష్యం చేసుకోవటానికి కొత్త ఆయుధాన్నిచ్చింది.

పోలవరం సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర రాజధాని నిర్మాణ కార్యక్రమంలో అవినీతి ఆరోపణలతో బీజేపీ నాయకులు ఇప్పటికే ఆయన మీద విరుచుకుపడుతున్నారు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కొనసాగుతున్న విరోధం కూడా ఆయన కష్టాలకు తోడైంది. తనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎత్తుల వెనుక బీజేపీ హస్తముందని ఆయన అనుమానించారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు బీజేపీయేతర శిబిరంలోని నాయకులతో స్నేహాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ప్రారంభించారు. మమతా బెనర్జీ, హెచ్.డి.దేవెగౌడ, శరద్ పవార్, మాయావతి, ఫరూఖ్ అబ్దుల్లా వంటి వారితో సంబంధాలు పునరుద్ధరించారు. కొత్త తరం నాయకులు అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారితో సంబంధాలు నెలకొల్పుకున్నారు.

కాంగ్రెస్ వైపు సహకార హస్తాన్ని చాచటానికి ఆయన తన గర్వాన్ని పక్కనపెట్టారు. తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని విడనాడారు.

ఈ క్రమంలో ఆయనకు దోహదపడిన ఒక అంశం.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కాంగ్రెస్ ఇప్పుడేమాత్రం పెద్ద శక్తి కాకపోవటం.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా సాయం అందించినందుకు ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్‌లో బలపడుతున్న ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తనకు మద్దతు అందించాలని ఆయన కోరుకుంటున్నారు.

చంద్రబాబును కలిసిన తర్వాత.. ''బీజేపీని ఓడించటం.. ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించటం ప్రధాన లక్ష్యమని మేం అంగీకారానికి వచ్చాం'' అని రాహుల్ ప్రకటించారు. కూటమి ముఖచిత్రం ఎవరవుతారు వంటి విషయాలను తర్వాత చర్చిస్తామని కూడా ఆయన చెప్పారు.

Image copyright NCBN/FACEBOOK

అయితే.. 1996లో, 1998లో ఉన్నంత శక్తిమంతుడిగా చంద్రబాబు ఇప్పుడు ఉన్నారా?

రాజకీయంగా కాదు. కానీ వ్యక్తిగతంగా అంత శక్తిమంతుడే.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఆయనలో బేరమాడే సామర్థ్యం తగ్గిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు కేవలం 25 లోక్‌సభ సీట్లే మిగిలాయి. మిగతా 17 సీట్లు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. అక్కడ కేసీఆర్ తన సొంత జాతీయ ఆకాంక్షలకు పదునుపెడుతున్నారు.

కానీ వ్యక్తిగతంగా.. చంద్రబాబుకు అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. పొలిటికల్ మేనేజ్‌మెంట్, లాబీయింగ్, ఇతరులను ఒప్పించటం, కూటమి ఏర్పాటు చేయటం, ఎంపిక చేసిన నాయకుడి విషయంలో ఏకాభిప్రాయం నిర్మించటం వంటి విషయాల్లో ఘనమైన అనుభవముంది. జాతీయ వేదిక మీదకు ఆయన పునరాగమనం సృష్టించిన ఆసక్తిలో ఇది ప్రతిఫలిస్తోంది.

Image copyright TDP

చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం

 • విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే 1970లలో ఆయన యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1978లో కాంగ్రెస్ టికెట్ పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
 • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రిగా పని చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తరువాత ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరినే చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు.
 • 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. కానీ, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌ను వీడలేదు.
 • 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఏడాదిలోనే ఆయన టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కు కుడిభుజంలా మారారు. క్రమంగా పార్టీలో ఎన్టీఆర్ తరువాత శక్తిమంతమైన నేతగా, పార్టీ జనరల్ సెక్రెటరీగా మారారు.
 • 1994 వరకు టీడీపీ హయాంలో ఆయన మంత్రి పదవి చేపట్టలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక, 1995లో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
 • 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో, దేవెగౌడ ప్రధాని కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
 • ఆ తరువాత ఆశ్చర్యకర రీతిలో యూ టర్న్ తీసుకొని బీజేపీతో జతకట్టి మొదటి నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజపేయీ ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు.
 • 2004లో ఏపీలో టీడీపీ కేంద్రంలో ఎన్డీయే ఓటమి పాలయ్యేవరకు ఆయన ఎన్డీయేతోనే కలిసున్నారు.
 • 2014లో యూపీయే ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును పాస్ చేశాక, మళ్లీ ఆయన బీజేపీతో చేతులు కలిపి ఎన్డీయేలో చేరారు. మోదీకి భావి ప్రధానిగా మద్దతు పలికారు.
 • ఆంధ్ర ప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న కారణంతో 2018 మార్చిలో ఎన్డీయే నుంచి వైదొలిగి బీజేపీకి వ్యతిరేకంగా మారారు.
 • ప్రస్తుతం కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి 2019 ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు