కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్: లైంగిక దాడుల బాధితులను ఆదుకోని భారత క్రైస్తవ మత గురువు

  • ప్రియాంక పాఠక్
  • బీబీసీ ప్రతినిధి
కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్
ఫొటో క్యాప్షన్,

కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్

బాలలపై అకృత్యాలను అరికట్టేందుకు ఈ వారం కీలకమైన వాటికన్ సదస్సును నిర్వహించిన నలుగురిలో ఒకరైన, క్యాథలిక్ చర్చి సీనియర్ మతాధిపతి, తన ముందుకు వచ్చిన అకృత్యాల ఆరోపణల విషయంలో మరింత మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందని అంగీకరించారు.

ముంబయి ఆర్చిబిషప్ ఓస్వాల్డ్ గ్రేసియస్ కూడా తాను ఒక చిన్నారిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో అవసరమైనంత త్వరగా స్పందించలేదని, ఆ ఆరోపణల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వలేదని బీబీసీ నిర్వహించిన పరిశోధన అనంతరం అంగీకరించారు.

వీడియో క్యాప్షన్,

కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్‌తో ఇంటర్వ్యూ

భారత్‌లోనే అత్యంత సీనియర్ క్రైస్తవ మతాధికారి, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి సదస్సు నిర్వహిస్తున్నవారిలో ముఖ్యుడు అయిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్.. చిన్నారులపై లైంగిక వేధింపులను ఆయన దృష్టికి తీసుకువచ్చినా సరే ఆయన పట్టించుకోలేదని బాధితులు, వారి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

భారతదేశంలోని క్యాథలిక్ చర్చిలలో మతాధిపతుల లైంగిక వేధింపుల గురించి మాట్లాడేందుకు భయపడే వాతావరణం ఉందని కేథలిక్కులు చెబుతున్నారు. ధైర్యం చేసి ఈ విషయాలు మాట్లాడిన వారు, దీనివల్ల చాలా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.

మతాధిపతులు అవసరమైన రీతిలో స్పందించకపోవడం, బాధితులకు మద్దతు ఇవ్వకపోవడం వంటి రెండు కేసులను మేం గుర్తించాం.

ఇందులో మొదటి కేసు 2015లో ముంబైలో జరిగింది.

ఆ సాయంత్రం ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆమె కుమారుడు చర్చి నుంచి తిరిగి వచ్చి, అక్కడున్న మతాధికారి తనపై అత్యాచారం చేశారని చెప్పాడు.

'ఏం చేయాలో నాకు అర్థం కాలేదు' అని ఆమె అన్నారు. ఇంతవరకూ ఆమెకు దీని గురించి తెలియదు. కానీ, ఈ ఘటన ఆమెను భారత్‌లో ఉన్న కేథలిక్ చర్చితో వివాదంలోకి దిగేలా చేసింది.

ఫొటో క్యాప్షన్,

క్రైస్తవ మతాధిపతి లైంగిక వేధింపులకు గురైన బాధితుని తల్లిదండ్రులు

సహాయం కోసం ఆమె భారత్‌లోని కేథలిక్ చర్చిల ప్రతినిధుల్లో చాలా సీనియర్ అయిన ఒకరిని ఆశ్రయించారు. అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు వచ్చిన 72 గంటల తర్వాత ఈ కుటుంబం ముంబై ఆర్చిబిషప్, కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్సెస్‌కు అప్పటి అధ్యక్షుడు అయిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్‌ను కలిసింది. తదుపరి పోప్ ఈయనే అని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అంతకన్నా ముఖ్యంగా, లైంగిక వేధింపులపై వాటికన్‌లో ప్రపంచ సదస్సు నిర్వహిస్తున్న నలుగురు ముఖ్యుల్లో ఈయన ఒకరు.

చర్చిల్లో లైంగిక వేధింపులు అనే అంశం ప్రస్తుత కాలంలో వాటికన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా భావించవచ్చు. ఈ సదస్సు ఫలితాలపైనే కేథలిక్ చర్చి చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. గత సంవత్సర కాలంగా కేథలిక్ చర్చిని ప్రపంచ వ్యాప్తంగా అనేక లైంగిక వేధింపుల వివాదాలు చుట్టుముట్టాయి.

కానీ ఉత్తర, దక్షిణ అమెరికాలు, యూరప్‌, ఆస్ట్రేలియాల్లో ఈ వేధింపుల ఆరోపణల వార్తలు పతాకశీర్షికలైనప్పుడు ఆసియా దేశాల్లో ఈ సమస్యల పరిస్థితి గురించి తెలిసింది చాలా తక్కువే. భారత్‌లాంటి దేశాల్లో వేధింపుల గురించి ఫిర్యాదు చేయడాన్ని సామాజికంగా అవమానంగా భావిస్తారు. 2.8 కోట్లున్న మైనారిటీ క్రైస్తవుల్లో నెలకొన్న భయం, మౌనంగా ఉండటమనే సంస్కృతి కారణంగా సమస్య తీవ్రతను పూర్తిస్థాయిలో అంచనా వేయడం అసాధ్యం.

చిన్నారులను రక్షించడంపైన, బాధితులకు న్యాయం చేయడంపైన రోమ్‌లో నిర్ణయాత్మకమైన చర్యలు ఉంటాయని, ఈ సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్‌లందరూ దీన్ని ఆచరిస్తారని నిర్వాహక కమిటీలో కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్‌తోపాటు నలుగురు సభ్యుల్లో ఒకరైన చికాగోకు చెందిన కార్డినల్ బ్లేస్ కుపిచ్ హామీ ఇచ్చారు.

ఇంతటి ప్రధాన బాధ్యతను ఎంతో ముఖ్యమైన ఈ సదస్సు సమయంలో ఈయనకు ఇవ్వడం భారత్‌లో కొంతమందికి నిరాశను కలిగించింది. వేధింపులకు గురిచేసేవారి బారి నుంచి పిల్లలను, మహిళలను రక్షించడంలో ఈయన గత చరిత్ర ప్రశ్నార్థకంగా ఉందని వారంటున్నారు. ఆయన వద్దకు కేసులు తీసుకువెళ్లినవారితో మేము మాట్లాడినప్పుడు వారు ఆయన నుంచి తమకు లభించిన మద్దతు స్వల్పమని చెప్పారు.

"నా కుమారుడిపై మతాధికారి చేసిన దాని గురించి కార్డినల్‌కు చెప్పాను. నా కుమారుడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పాను. ఆయన మా గురించి ప్రార్థించిన తర్వాత, తాను రోమ్‌కు వెళ్లాలని చెప్పారు. ఆ క్షణం నా మనసెంతో బాధపడింది. నా కుమారుడి గురించి ఆలోచిస్తారని, న్యాయం చేస్తారని ఓ తల్లిగా ఎంతో ఆశతో ఆయన వద్దకు వెళ్లాను. కానీ, మాతో మాట్లాడేందుకు ఆయనకు సమయం లేదని చెప్పారు. రోమ్‌కు వెళ్లడమే ఆయనకు చాలా ముఖ్యమైపోయింది" అని తల్లి చెప్పారు.

వైద్య సహాయం కావాలని ఆ కుటుంబం విజ్ఞప్తి చేసినా వారికి అది అందలేదు. 'ఇది వినడానికి నేనెంతో బాధపడుతున్నా' అని కార్డినల్ మాతో అన్నారు. ఆ బాలుడికి వైద్య సహాయం అవసరమనే విషయం తనకు తెలియదని, ఒకవేళ వారు అడిగి ఉంటే నేను వెంటనే దాన్ని ఏర్పాటు చేసేవాడినని చెప్పారు.

సంబంధిత అధికారులను అప్రమత్తం చేయకుండా తాను ఆ రాత్రే రోమ్‌కు వెళ్లినట్లు కార్డినల్ అంగీకరించారు. కార్డినల్ గ్రేసియస్ దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2012 (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012 - POCSO Act)ను ఉల్లంఘించారు. తన నియంత్రణలో పనిచేసే వ్యక్తులు చేసిన నేరాల గురించి ఏదైనా కంపెనీ లేదా సంస్థ అధిపతి తెలియచేయకపోతే, ఆ కంపెనీ అధిపతికి సంవత్సరం వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు అని ఈ చట్ట నిబంధనల్లో ఉంది.

ఆ మరునాడే తాను బిషప్‌కు ఫోన్ చేశానని కార్డినల్ మాతో చెప్పారు. కానీ, ఆ కుటుంబం అప్పటికే పోలీసులకు దీనిపై సమాచారం ఇచ్చిందని బిషప్ తనకు చెప్పారని కార్డినల్ తెలిపారు. పోలీసులకు స్వయంగా ఫోన్ చేయకపోవడంపై ఏమైనా చింతిస్తున్నారా అని అడగ్గా, "నిజాయతీగా చెప్పాలంటే, నూటికి నూరు పాళ్ళు అలా అనుకోవడం లేదు. కానీ దానిపై నేను స్పందించాలి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాల్సింది" అని చెప్పారు. ఆరోపణల విశ్వసనీయత ఎంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మాట్లాడి తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.

ఆ సమావేశం ముగిసిన తర్వాత ఆ కుటుంబం ఓ వైద్యుడిని సంప్రదించాలని నిర్ణయించుకుంది. "ఆయన నా కుమారుడి వైపు ఓసారి చూసి, ఇతనికి ఏదో జరిగింది అని అన్నారు. ఇదో పోలీస్ కేసు. మీరైనా ఫిర్యాదు చెయ్యండి లేదా నేను చేస్తా అన్నారు. దీంతో ఆ రాత్రే మేము పోలీసుల వద్దకు వెళ్లాం" అని తల్లి చెప్పారు. ఆ బాలుడి మీద లైంగిక దాడి జరిగిందని పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది.

ఈ మతాధికారిపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని, వాటి గురించి కార్డినల్ దృష్టికి తీసుకువెళ్లామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రస్తుత మతాధికారి ఒకరు చెప్పారు.

"ఈ ఘటన జరిగిందని ఆరోపణలు రావడానికి కొన్ని సంవత్సరాల ముందు నేను ఆయన్ను కలిశాను. ఈ డయోసీస్‌లో ఆయనపై చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఇలాంటి వేధింపులు జరుగుతూనే చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక పారిష్ (ప్రదేశం) నుంచి మరోచోటకి వెళ్తున్నట్లే ఉంటారు. వీటి గురించి నేరుగా తనకేమీ తెలియదని కార్డినల్ నాతోనే స్వయంగా చెప్పారు" అని ఆ మతాధికారి మాతో అన్నారు.

అప్పుడు జరిగిన సంభాషణ తనకు గుర్తులేదని కార్డినల్ తెలిపారు. ఆ వ్యక్తిపై అనుమానపు ఛాయలున్నట్లు తనకు గుర్తురావడంలేదని ఆయన అన్నారు.

ఈ కార్డినల్ నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలున్న సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయేమో అని మా పరిశోధనలో భాగంగా చూడాలనుకున్నాం.

ముంబై ఆర్చిబిషప్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దృష్టికి వచ్చిన ఓ సంఘటన.. అంటే దశాబ్దం క్రితం జరిగిన ఓ ఉదంతం మా దృష్టికి వచ్చింది.

ఏకాంత ప్రార్థనలు నిర్వహించే ఓ మతాధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2009 మార్చిలో ఓ మహిళ ఈయన వద్దకు వచ్చింది. ఆ మతాధికారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, అందుకే తాను మహిళా కేథలిక్ కార్యకర్తల బృందాన్ని కలిశానని, కార్డినల్ చర్యలు తీసుకునేలా వారే ఒత్తిడి ఒత్తిడి చేశారని ఆమె తెలిపారు.

వారి ఒత్తిడితోనే చివరికి ఆయన 2011 డిసెంబరులో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. 6 నెలల పాటు విచారణ జరిగినా, ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మతాధికారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన తన ప్రాంతంలో కొనసాగుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

వర్జీనియా సల్దాన్హా

"కార్డినల్‌కు మేం మూడు లీగల్ నోటీసులు పంపించాం. చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని కూడా బెదిరించాం" అని రెండు దశాబ్దాలుగా వివిధ చర్చిల్లోని మహిళల డెస్క్‌లలో పనిచేసిన కేథలిక్ భక్తురాలు వర్జీనియా సల్దాన్హా తెలిపారు.

ఆ మతాధికారి నా మాట వినడం లేదు అని కార్డినల్ సమాధానమిచ్చారు.

"ఆ వ్యక్తి ప్రార్థనలు నిర్వహిస్తుంటే నేను చూడలేకపోయేదాన్ని. అక్కడికి వెళ్లాలనిపించేది కాదు. అందుకే ఆ సమయంలో తాను చర్చిని వదిలి వెళ్లాల్సి వచ్చింది" అని సల్దాన్హా తెలిపారు.

చివరికి ఆయనను తన ప్రార్థనా ప్రదేశం నుంచి తొలగించారు. కానీ ఆయన తొలగింపుకు కారణాలు వెల్లడించలేదు. 2011 అక్టోబరులో కార్డినల్ వ్యక్తిగతంగా విధించిన శిక్ష ఏంటంటే... 'ఏకాంత మార్గదర్శనం, వైద్యపరమైన కౌన్సెలింగ్'.

ఈ ప్రక్రియ జరిగిన వేగం, శిక్షల గురించి బలంగా అడిగినప్పుడు, ఇదో సంక్లిష్టమైన కేసు అని కార్డినల్ అన్నారు. కొద్దిరోజుల శిక్షణ తర్వాత ఆరోపణలు వచ్చిన ఆ మతాధికారికి మళ్లీ ఓ ప్రార్థన స్థలాన్ని అప్పగించారు. ఇప్పటికీ ఆయన ఏకాంత ప్రార్థనలు చేస్తున్నారు.

మరోవైపు, లైంగిక దాడికి గురైన బాలుడి కుటుంబం తమను సంస్థలోని ఎవరూ పట్టించుకోవడంలేదనుకుని, వారి జీవితం వారు గడుపుతున్నారు.

ఇదో ఒంటరి యుద్ధం అని ఆ తల్లి వ్యాఖ్యానించారు. తమను చర్చి నుంచి బహిష్కరించారని, తమ వర్గంలోనే తమను ఒంటరి చేశారని వారు తెలిపారు. "పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, మేం చర్చికి వెళ్తే, అక్కడెవరూ మాతో మాట్లాడేవారు కాదు, ప్రార్థనల్లో మా పక్కను కూర్చోవడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. నేనెవరి పక్కనైనా కూర్చోవడానికి వెళ్తే, వాళ్లు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయేవారు. తాము ఎదుర్కొన్న ఈ ద్వేషభావం చివరికి తాము చర్చినే వదిలేలా చేసింది. కానీ మాకు ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైందంటే చివరికి మేం ఇల్లు కూడా మారాల్సి వచ్చింది. అన్నీ వదులుకుని వచ్చేశాం" అని ఆమె చెప్పారు.

బాధితులు, వారి కుటుంబాలు బహిరంగంగా మాట్లాడకపోవడానికి ఈ బహిష్కరణలే కారణమని చర్చి సభ్యులు తెలిపారు. ఏమాత్రం సహకరించని మతాధిపతులు, ప్రతికూల సామాజిక సంబంధాల మధ్య చిక్కుకుంటే వారి గొంతులు వణుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)