ద‌ళితుల‌ పట్ల చింత‌మ‌నేని వ్యాఖ్యలపై నిరసనలు... వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల డిమాండ్

  • వి.శంకర్
  • బీబీసీ కోసం
చింతమనేని ప్రభాకర్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా పెద్ద చర్చకు తెర తీశాయి.

గతంలో ఇసుక ర‌వాణా విష‌యంలో త‌హాశీల్దార్ వ‌న‌జాక్షి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించి ఆయన పెను దుమారం రేపారు.

ఆ త‌ర్వాత అంగ‌న్ వాడీ మ‌హిళ‌లు, ఫారెస్ట్ అధికారులు, చివ‌ర‌కు బేవ‌రేజెస్ గొడౌన్ లో ప‌నిచేస్తున్న జాన్ అనే కార్మికుడి విష‌యంలోనూ చింత‌మ‌నేని తీరు మీద తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు ఎస్సీల‌నుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ద‌ళిత సంఘాలు ఆందోళ‌న‌లు కూడా ప్రారంభించాయి. చింత‌మ‌నేనిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

ఈ నేప‌థ్యంలో చింత‌మ‌నేని కూడా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌ను ట్రోల్ చేస్తున్నారంటూ ఏలూరులో అడిష‌న‌ల్ ఎస్పీని క‌లిసి, ఫిర్యాదు చేశారు. ఏలూరులో ఆందోళ‌న‌కు కూడా దిగారు.

చింత‌మ‌నేనికి మ‌ద్ధ‌తుగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వ‌ర్గాల‌ను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత‌లు కోట‌గిరి శ్రీధ‌ర్, అబ్బాయి చౌద‌రి వంటి వారిని గృహ‌నిర్బంధంలో ఉంచారు.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మాట‌లు సోష‌ల్ మీడియాతో పాటు ఒక ప‌త్రిక‌లో కూడా ప్ర‌ధాన క‌థ‌నంగా రావ‌డంతో క‌ల‌క‌లం రేగింది. ఈ వీడియోలో మీరు కూడా చింత‌మ‌నేని మాట‌లు విన‌వ‌చ్చు..

వీడియో క్యాప్షన్,

దళితులపై చింతమనేని వ్యాఖ్యలు

చింతమనేని వ్యాఖ్య‌ల ప‌ట్ల తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.

కుల‌వివిక్ష వ్య‌తిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ "చింత‌మ‌నేని వంటి వాళ్లు ఎమ్మెల్యేగా ఉండ‌డం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువ‌ల ప‌ట్ల విశ్వాసం లేకుండా, అంద‌రి మీద రౌడీయిజం చేసే వాళ్ల‌ను జ‌నం క్ష‌మించ‌రు. చింత‌మ‌నేని ఇప్ప‌టికే ప‌లువురిపై దాడుల‌కు పాల్ప‌డ్డారు. అయినా చంద్ర‌బాబు ఆయ‌నకి కొమ్ము కాస్తున్నారు" అని విమర్శించారు.

"చంద్రబాబు అండతో మ‌రింత‌గా రెచ్చిపోతున్న ఆయన్ను త‌క్ష‌ణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం" మాల్యాద్రి అన్నారు.

విప‌క్ష నేత‌లు కూడా చింత‌మ‌నేని కామెంట్స్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక జిల్లాల్లో చింత‌మ‌నేనికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు సాగుతున్నాయి.

వివ‌క్ష పూరిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌భుత్వ విప్ పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ధ‌ర్నాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/Balusu Aravind

ద‌ళితులే నాకు బ‌లం

ఈ నేప‌థ్యంలో త‌న వ్యాఖ్య‌ల‌పై చింత‌మ‌నేని బీబీసీకి వివ‌ర‌ణ ఇచ్చారు. "గ‌త ఏడాది న‌వంబ‌ర్ 15 నాడు దెందులూరు మండ‌లం శ్రీరామ‌పురంలో రోడ్డు ప‌నుల‌కు శంక‌ుస్థాప‌న చేయ‌డానికి వెళ్లాను. కానీ అక్క‌డ మా కుల‌పోడు త‌గాదా పెట్టాడు. శంకుస్థాప‌న రాయి ప‌గుల గొట్టారు. దాంతో 2009లో గెలిచిన నాకు అధికారం లేక‌పోవ‌డం వ‌ల్ల ఏమీ చేయ‌లేక‌పోయాను.ఇప్పుడు అన్నీ చేస్తున్నాన‌ని ఆ ఊరి వాళ్ల‌కు చెప్పాను. ఆ పాత వీడియో తీసుకొచ్చి రాజ‌కీయంగా బ‌ద్నాం చేసే ప‌ని చేస్తున్నారు. ప‌ని చేస్తుంటే అడ్డుకుని ప్ర‌తిప‌క్షాలు దుమారం చేస్తున్నాయి. నా వీడియో క‌ట్ చేసి ప్ర‌సారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం సాగిస్తున్నారు" అని ఆయన చెప్పారు.

"నాకు ద‌ళితులే బ‌లం. ద‌ళితులను నాకు దూరం చేసేందుకే కుట్ర సాగుతోంది. దీనిపై ప్ర‌భుత్వం ఓ క‌మిటీ వేసి విచార‌ణ చేయాలి. నేను దోషిగా తేలితే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా" అని ఆయన సవాలు చేస్తున్నారు.

చింత‌మ‌నేని ఎప్పుడు వ్యాఖ్య‌లు చేసినా వాటిలో వివ‌క్ష‌ స్పష్టంగా క‌నిపిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ వివాదంపై ప్ర‌ముఖ న్యాయ‌వాది బంగారు రామ‌కృష్ణ "బ‌హిరంగంగానే ఒరేయ్..అంటూ ఆయ‌న మాట్లాడ‌డం నేరం. పైగా మీరు ద‌ళితులు, వెనుక‌బ‌డిన వారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు అనడం కులాన్ని ఎత్తి చూప‌డ‌మే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం ప్ర‌కారం కులాల‌ను ప్ర‌స్తావించి మాకు రాజ‌కీయాలుంటాయి అని పేర్కొన‌డం చ‌ట్ట విరుద్ధ‌మే. అంతేకాకుండా, దేహీ అంటే వాట‌ర్ ఇప్పించానంటూ ప్ర‌జాస్వామ్యంలో రాచ‌రిక ధోర‌ణులు ప్ర‌ద‌ర్శించ‌డం అంగీకార‌యోగ్యం కాదు. ఆయ‌న మీద న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంది" అని అన్నారు.

"అధికార పార్టీకి చెందిన నేత‌, ప్ర‌భుత్వ విప్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ కావ‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలుంటాయ‌న‌డంలో సందేహం లేదు. అయినా ఇలాంటి వాటిని ఎవ‌రూ స‌మ‌ర్థించ‌రు. దీనిపై టీడీపీ అధిష్ఠాన‌మే త‌గిన రీతిలో స్పందించ‌డం మంచిది" అని ఏలూరుకు చెందిన అధ్యాయ‌ప‌కుడు బి సంజీవ్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)