పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయి: చంద్రబాబు నాయుడు - ప్రెస్‌రివ్యూ

నారా చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/Facebook

'నవ్యాంధ్రకు ద్రోహం చేసి సరిగ్గా ఈ రోజు(బుధవారం)కు ఐదేళ్లు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి ఐదేళ్లయింది. నమ్మక ద్రోహం చేసిన బీజేపీని రాష్ట్ర ప్రజానీకం ఎండగట్టాలి. ప్రతి ఒక్కరూ 5వ నిరసన వార్షికోత్సవాలు జరపాలి' అని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్రత్యేక హోదా సహా మిగిలిన హామీలన్నీ గాలికి వదిలేశారని, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని... ఆర్థిక లోటులో 4వ వంతు కూడా చెల్లించలేదని మండిపడ్డారు. రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని తప్పుబట్టారు. ఎన్నికల మిషన్‌-2019పై బుధవారం ఉదయం తన నివాసం నుంచి టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

బీజేపీ నేతలు తప్పుడు పనులతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. ప్రజల్లో బీజేపీ పూర్తిగా పలుచనైందని తెలిపారు. అందుకే చిన్నాచితక పార్టీలతో పొత్తుల కోసం ఆరాటపడుతోందని.. అధికారం కోసం ఎంతకైనా దిగుజారుతోందని ధ్వజమెత్తారు.

'రిమోట్‌ కంట్రోల్‌తో రాష్ట్రాలను ఆడించాలని చూస్తోంది. స్వార్థంతో దేశభద్రతను ఫణంగా పెడితే.. రాజకీయ లాభం కోసం సైన్యంతో ఆటలాడితే సహించం. పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయి. మమతాబెనర్జీ వ్యాఖ్యలపై దేశంలో చర్చ జరుగుతోంది. పాకిస్తాన్‌ ప్రధాని వ్యాఖ్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి' అని పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, KCR/FB

మేలో స్థానిక సమరం

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని ఈనాడు తెలిపింది. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు జరపనున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, బడ్జెట్‌ రూపకల్పన, శాసనసభా సమావేశాల నిర్వహణపై సీఎం బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్‌, వ్యవసాయ, సంక్షేమ, శాసనసభా వ్యవహారాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్‌, శాసనసభ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయని, ఆ వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ వెనువెంటనే పురపాలక ఎన్నికలు చేపడతామని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అద్భుతంగా రూపొందిందని, అదే మాదిరిగా నగరాలు, పురపాలనకు కొత్త చట్టం అవసరమన్నారు.

దీనిపై వెంటనే అధ్యయనం చేసి దాన్ని రూపొందించాలని ఆదేశించారు. దేశంలోని ఆదర్శ నగరాలు, పట్టణాలను సందర్శించి అక్కడి విధానాలను పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాలన్నారు. దానిని మే నెలలో ఆమోదిస్తామని, దానికి అనుగుణంగా ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు.

2019-20 రాష్ట్ర బడ్జెట్‌ జనరంజకంగా ఉంటుందని, తెరాస ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతుందని కేసీఆర్‌ తెలిపారు. ఓటాన్‌ అకౌంట్‌ అయినా సంతృప్తికరంగా అన్ని శాఖలకు కేటాయింపులు ఉంటాయన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు నిధులుంటాయని, ఇప్పటికే నడుస్తున్న పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యాచరణ ఉంటుందని వివరించారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, SUDHEER KALANGI

ఫొటో క్యాప్షన్,

టి. రాజా సింగ్, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే

'10 నిమిషాలివ్వండి దేశద్రోహుల సంగతి చూస్తాం'

దేశం బయటే కాదు.. దేశంలోనూ శత్రువులున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

‘‘బయటి శత్రువులను సైన్యం చూసుకుంటే దేశంలోని శత్రువులను మేం చూసుకుంటాం. ఆర్మీకి ఇచ్చిన స్వేచ్ఛలో ఓ 10 నిమిషాలు మాకు ఇవ్వండి. దేశ ద్రోహులు అనే వారే లేకుండా చేస్తాం'' అని రాజాసింగ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌జీవో ముసుగులో పులివేట గ్యాంగ్‌

మంచిర్యాల జిల్లా శివ్వారం అడవుల్లో విద్యుత్‌ తీగలకు బలైన పులి కేసు మిస్టరీ వీడిందని సాక్షి వెల్లడించింది. మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి డిసెంబర్‌లో ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రవేశించిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ జాతికి చెందిన నాలుగేళ్ల మగ పులి జనవరి 8న శివ్వారంలో విద్యుత్‌ తీగలకు తాకి చనిపోవడం వెనుక పెద్ద కుట్ర నడిచినట్లు తేలింది.

అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసే శివ్వారం ప్రాంతపు యానిమల్‌ ట్రాకర్స్‌ పులి జాడను వేటగాళ్లకు తెలియజేయగా, పథకం ప్రకారమే విద్యుత్‌ తీగను అమర్చి అరుదైన పెద్దపులిని హతమార్చినట్లు రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ విచారణలో వెల్లడైంది.

పులి చనిపోయిన తరువాత దాని చర్మాన్ని, గోళ్లను ఒలిచి, తలను గుర్తుపట్టకుండా గొడ్డళ్లతో నరికిన వేటగాళ్లు చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. పులులను అంతమొందించేలా యానిమల్‌ ట్రాకర్స్‌ ద్వారా వేటగాళ్లను ఉసిగొల్పుతూ 'టైగర్‌ హంటింగ్‌ అండ్‌ అసోసియేషన్‌'అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్‌ పింప్లేతో పాటు ఏడుగురి దందాను పోలీసులు ఛేదించారు.

మందమర్రిలో డిసెంబర్‌ 24న 'పులిచర్మం'దొరికిన వ్యవహారంతో మొదలైన ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ 'సాక్షి' ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.కె. ఝా కోరిక మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పందించారు.

ఈ మేరకు అటవీశాఖ సాధారణ పులిచర్మం దొరికిన కేసుగా వదిలేసిన కేసును రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణకు అప్పగించడంతో మిస్టరీ వీడింది. రామగుండం సీసీఎస్‌ (అడ్మిన్‌) అదనపు డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్‌ సీఐల నేతృత్వంలో విచారణకు ఆదేశించగా, వాస్తవాలు వెలుగు చూశాయి.

ఈ మేరకు టైగర్‌ హంటింగ్‌ అండ్‌ అసోసియేషన్‌ సంస్థ నిర్వాహకుడు నందకిషోర్‌ పింప్లేతో సహా ఏడుగురు సభ్యుల చంద్రాపూర్‌ గ్యాంగ్‌ను, ఇద్దరు యానిమల్‌ ట్రాకర్స్, ముగ్గురు వేటగాళ్లు, నలుగురు బ్రోకర్స్‌ సహా 16 మందిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తొలినాళ్లలో మరో నలుగురిని అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసులో 20 మందిని అరెస్టు చేసినట్లు కమిషనర్‌ వి.సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)