జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్‌'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే

  • 23 ఫిబ్రవరి 2019
జాకబ్ డైమండ్ Image copyright Getty Images
జాకబ్ డైమండ్
చిత్రం శీర్షిక జాకబ్ డైమండ్

మీరు ఇప్పటివరకూ ఎంత పెద్ద వజ్రాన్ని చూశారు. అందాల కిరీటాల్లోనో, ఆభరణాల్లోనో, పెద్ద పెద్ద ఉంగరాల్లోనో మెరిసే డైమండ్స్ చూసుంటారు.

లేదంటే ఎక్కడో మ్యూజియంలో ఉన్న పెద్ద వజ్రాల గురించి తెలుసుకుని ఉంటారు.

కానీ, ఒకప్పుడు హైదరాబాద్ నిజాం దగ్గర 'పేపర్ వెయిట్‌'లా ఉపయోగించేంత పెద్ద వజ్రం ఉందనే విషయం మీకు తెలుసా.

అంతే కాదు, బ్రిటిష్ వారి నుంచి దానిని కాపాడేందుకు నిజాం ఆ డైమండ్‌ను తన బూట్ల లోపల దాచిపెట్టేవారట..

నమ్మకం కలగడం లేదా, ఇక్కడ మీకు ఫొటోలో కనిపిస్తున్న వజ్రం అదే. దీనికి ఒక పేరు కూడా ఉంది-జాకబ్ డైమండ్.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్‌'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే!

ఏడో నిజాం నవాబు (మీర్ ఉస్మాన్ అలీఖాన్) తన దగ్గరున్న ఈ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించుకున్నారు.

ప్రస్తుతం ఈ డైమండ్‌తో పాటు నిజాం నగలను దిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.

ఈ ప్రదర్శనలో నిజాం నవాబులు వాడిన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఉంగరాలను మనం చూడొచ్చు.

జాకబ్ డైమండ్ Image copyright National Museum
చిత్రం శీర్షిక నిజాం సేకరించిన ఆభరణాలు

ఈ నగలు ఎక్కడివంటే..

ప్రస్తుతం దిల్లీలో ప్రదర్శనకు ఉంచిన నగలు ఒకప్పుడు నిజాం నవాబులు సేకరించినవి. ప్రస్తుతం ఇవి భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.

జాకబ్ డైమండ్ Image copyright National Museum
చిత్రం శీర్షిక నిజాం సేకరించిన ఆభరణాలు

''నిజాం ట్రస్టుల ఆధీనంలో ఉన్న వీటిని కేంద్రప్రభుత్వం చట్టపరమైన పోరాటం ద్వారా సేకరించింది'' అని నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ మణి బీబీసీకి చెప్పారు.

జాకబ్ డైమండ్ Image copyright National Museum
చిత్రం శీర్షిక నిజాం సేకరించిన ఆభరణాలు

184.75 క్యారెట్ల జాకబ్‌ డైమండ్‌ ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రస్తుతం ప్రదర్శనలో ఉంచిన జాకబ్ డైమండ్ విలువ రూ.900 కోట్లు ఉంటుందని తెలిపారు.

''జాకబ్ అనే వ్యక్తి పేరు మీద ఈ వజ్రానికి ఆ పేరు వచ్చింది. ఆరో నిజాం దీన్ని కొనుగోలు చేశారు. కోర్టు వివాదాలతో విసిగిపోయిన ఆయన, దీన్ని తన టేబుల్ డ్రాయిర్‌లో పెట్టేశారు. ఏడో నిజాంకు ఈ వజ్రం పాత చెప్పుల మధ్య దొరికింది. ఆయన ఈ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించుకున్నారు'' అని మణి వివరించారు.

నిజాం నగల ప్రదర్శన Image copyright Getty Images

జాకబ్ డైమండ్ కథ

కానీ భారత ప్రభుత్వానికి ఈ వజ్రం ఎలా దక్కిందనే కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది.

హైదరాబాద్ ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాషా, ఈ వజ్రాన్ని జాకబ్ అనే ఒక వ్యాపారి నుంచి కొన్నారు. అందుకే దీనిపేరు జాకబ్ డైమండ్ అయ్యింది.

అయితే ఈ వజ్రాన్ని ఇంపీరియల్ లేదా గ్రేట్ వైట్, విక్టోరియా అనే పేరుతో కూడా పిలుస్తారు.

ఈ వజ్రం దక్షిణాఫ్రికాలోని కింబర్లీ గనుల్లో దొరికింది. మెరుగు పెట్టడానికి ముందు ఈ వజ్రం బరువు 457.5 క్యారెట్లు ఉండేది. ఆప్పట్లో దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా భావించేవారు.

ఆ తర్వాత ఈ వజ్రాన్ని దొంగిలించారు. అంతకు ముందు దీన్ని లండన్, తర్వాత హాలెండ్‌లోని ఒక కంపెనీకి అమ్మేశారు. దీనిని హాలెండ్ మహారాణి ముందు కూడా మెరుగు పెట్టారు. దాంతో దీని బరువు 184.5 క్యారట్లు అయ్యింది.

జాకబ్ డైమండ్ Image copyright National Museum

1890లో మాల్కమ్ జాకబ్ అనే వజ్రాల వ్యాపారి హైదరాబాద్‌లో ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాషాకు ఈ వజ్రం నమూనాను చూపించారు. అసలు వజ్రాన్ని కోటీ 20 లక్షలకు బేరం పెట్టారు. కానీ నిజాం 46 లక్షలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే దానికే ఒప్పందం జరిగిపోయింది.

సగం మొత్తం తీసుకున్న తర్వాత జాకబ్‌తో ఇంగ్లండ్ నుంచి ఈ వజ్రం తెప్పించారు. కానీ నిజాం తర్వాత ఈ వజ్రం తీసుకోవడానికి నిరాకరించారు. తను ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేయమన్నారు.

అయితే దీని వెనుక కారణం ఒకటే అని చెబుతారు. నిజాం అప్పుల్లో ఉండడంతో బ్రిటిష్ రెసిడెంట్ ఈ వజ్రం కొనుగోలును వ్యతిరేకించారని చెబుతారు.

జాకబ్ డబ్బు తిరిగివ్వడానికి కలకత్తా హైకోర్ట్‌లో కేసు నమోదైంది. 1892లో నిజాంకు వజ్రం అందింది.

దిల్లీ మ్యూజియంలో దీనిని మూడోసారి ప్రదర్శనకు ఉంచారు. జాకబ్ డైమండ్‌ను మొదట 2007లో ఇక్కడ ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)