కస్తూర్భా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
మహాత్మా గాంధీతో కస్తూర్బా

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్,

మహాత్మా గాంధీతో కస్తూర్బా

మహాత్మాగాంధీ బొంబాయి శివాజీ పార్క్‌లో చాలా పెద్ద బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. దానికి ఒక రోజు ముందు 1942 ఆగస్టు 9న ఆయన్ను బొంబాయిలోని బిర్లా హౌస్‌ ‌వద్ద అరెస్ట్ చేశారు.

గాంధీ అరెస్ట్ తర్వాత ఆ సభలో ప్రధాన వక్తగా ఎవరు ప్రసంగిస్తారు అనే పెద్ద ప్రశ్న ఎదురైంది. అప్పట్లో మొత్తం బొంబాయిలో గాంధీ స్థాయి ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. అప్పుడే కస్తూర్బా హఠాత్తుగా "మీరేం కంగారు పడకండి, మీటింగ్‌లో నేను మాట్లాడతా" అన్నారు.

కస్తూర్బా మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే బా అప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. అంతే కాదు అంతకు ముందెప్పుడూ ఆమె సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. సభకు గంట ముందు కస్తూర్బా సుశీలా నాయర్‌కు తన స్పీచ్ డిక్టేట్ చేయించారు. శివాజీ పార్క్ వెళ్లడానికి కారులో కూచున్నారు.

ఆరోజు కస్తూర్బా గాంధీ లక్షన్నర మంది హాజరైన సభలో ప్రసంగించారు. ఆమె మాటలు విని జనం భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది కళ్లు చెమర్చాయి.

కస్తూర్బా గాంధీ ప్రసంగం పూర్తి కాగానే, ఆమెను సుశీలా నాయర్‌తోపాటు అరెస్ట్ చేశారు. 30 గంటల వరకూ ఆమెను మామూలు నేరస్థులతో కలిపి ఒక చీకటి గదిలో ఉంచారు. ఆ తర్వాత ఆమెను పుణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. మహాత్మాగాంధీ అక్కడ అంతకు ముందే అదుపులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Keystone/Getty Images

ఫొటో క్యాప్షన్,

కస్తూర్బా గాంధీ

కస్తూర్బాకు మూడు సార్లు గుండె పోటు

కానీ, రెండు నెలల తర్వాత కస్తూర్బాకు చాలా తీవ్రమైన 'బ్రాంకయిటిస్' వచ్చింది. ఆమెకు వెంటవెంటనే మూడుసార్లు గుండెపోటు వచ్చింది. కస్తూర్బా చాలా బలహీనం అయిపోయారు. ఎప్పుడూ పడుకునే ఉండేవారు.

గాంధీ తరచూ ఆమె పక్కనే కూచునేవారు. కస్తూర్బా సులభంగా తినడానికి వీలుగా ఒక చెక్క స్టూల్ చేయించిన ఆయన, దానిని ఆమె మంచం పక్కనే ఉంచేవారు. తర్వాత ఆ స్టూల్ బాపూజీకి కస్తూర్బా జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆమె చనిపోయాక ఆయన ఎక్కడికి వెళ్లినా, ఆ చిన్న స్టూలును తనతోపాటే తీసుకెళ్లేవారు.

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్,

దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీతో కస్తూర్బా

పెన్సిలిన్ ఇంజెక్షన్ వద్దన్న గాంధీ

1944 జనవరి నాటికి కస్తూర్బా ఇక కొన్నిరోజులే ఉంటారనే విషయం గాంధీకి అర్థమైంది. ఆమె మరణించడానికి నెల ముందు జనవరి 27న ఆయన కస్తూర్బాకు చికిత్స చేయడానికి ప్రముఖ డాక్టర్, డాక్టర్ దినషాను పిలిపించాలని హోంశాఖకు లేఖ రాశారు.

మనుమరాలు కనూ గాంధీని ఆమెతో పాటూ ఉండడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు. కనూ అంతకు ముందు కూడా కస్తూర్బాను చూసుకునేవారు. ఆమెకు తరచూ భజనలు, గీతాలు పాడి వినిపించేవారు.

ఫిబ్రవరి 3న కనూ గాంధీకి కస్తూర్బాతోపాటూ ఉండడానికి అనుమతి లభించింది. కానీ డాక్టర్‌ను పిలిపించాలన్నగాంధీ వినతిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. బా చివరిరోజుల్లో అవసరమైనప్పుడు వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు, డాక్టర్ వైద్య రాజ్ జైలు బయటే తన కారు నిలిపి అందులోనే పడుకునేవారు.

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్,

1916లో గాంధీ, కస్తూర్బా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ చేరుకున్నప్పుడు

కస్తూర్బాను కాపాడే ఆఖరి ప్రయత్నంగా ఆమె కొడుకు దేవదాస్ గాంధీ, కలకత్తా నుంచి 'పెన్సిలిన్' మందు తెప్పించారు. పెన్సిలిన్ ఆ సమయంలో కొత్తగా వచ్చింది. దానిని 'వండర్ డ్రగ్' అనేవారు. కానీ కస్తూర్బాకు పెన్సిలిన్ ఇంజక్ట్ చేయబోతున్నారని తెలీగానే.. గాంధీ దానికి ఒప్పుకోలేదు.

గాంధీ తర్వాత కొన్ని రోజులు బా పక్కనే ఆమె చేయి పట్టుకుని కూచునే గడిపారు. తర్వాత వారి కొడుకు హరిలాల్ ఆమెను చూడ్డానికి వచ్చారు. కానీ ఆయన అప్పుడు మద్యం మత్తులో మునిగి ఉన్నారు. దాంతో, ఆ పరిస్థితిలో కూడా కస్తూర్బా గుండెలపై కొట్టుకుంటూ ఆయన్ను తిట్టారు.

ఫిబ్రవరి 22న కస్తూర్బా జీవితంలో ఇక కొన్ని గంటలే మిగిలి ఉన్నాయని తెలిసినపుడు దేవదాస్ 3 గంటల సమయంలో ఆమె పెదాలపై కొన్ని గంగాజలం చుక్కలు వేశారు.

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్,

కస్తూర్బా మరణం తర్వాత జుహు తీరంలో శోకంలో గాంధీ

చివరి స్నానం చేయించిన గాంధీ

సాయంత్రం 7.30కు కస్తూర్బా తుది శ్వాస విడిచారు. సుశీలా నాయర్, మీరా బేన్‌తో కలిసి గాంధీ ఆమెకు అంతిమ స్నానం చేయించారు. కొన్ని రోజుల ముందు గాంధీ పుట్టినరోజు నాడు ఆమె కట్టుకున్న ఎర్ర అంచు చీరను కట్టారు.

గాంధీ తన చేతులతో కస్తూర్బా పాపిట కుంకుమ పెట్టారు. అప్పుడు ఆమె కుడి చేతికి ఐదు గ్లాస్ గాజులు ఉన్నాయి. వాటిని ఆమె తన వైవాహిక జీవితం అంతటా ఎప్పుడూ ఉంచుకుంటూ వచ్చారు.

కస్తూర్బా గాంధీ అంత్యక్రియలు బహిరంగంగా జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. కానీ గాంధీ మొండిపట్టు పట్టారు. "దేశం మొత్తం కస్తూర్బా అంత్యక్రియల్లో పాల్గొనడానికి అనుమతించాలని, లేదంటే తను ఒంటరిగానే ఆమెకు అంతిమ సంస్కారాలు చేస్తానని" చెప్పారు.

ఫొటో సోర్స్, Roli Bookc

ఫొటో క్యాప్షన్,

దక్షిణాఫ్రికాలో కొడుకులు మణిలాల్, రాందాస్, హరిలాల్‌తో కస్తూర్బా

గంధపు చెక్కలతో చితి

తర్వాత బా చితికి ఎలాంటి కలపను ఏర్పాటు చేయాలనే ప్రశ్న తలెత్తింది. గాంధీ సన్నిహితులు చాలామంది దహనం కోసం గంధపు చెక్కలు పంపిస్తామని చెప్పారు. కానీ గాంధీ దానికి ఒప్పుకోలేదు.

"పేద వ్యక్తి భార్య అయిన కస్తూర్బాను ఖరీదైన గంధపు చెక్కలతో దహనం చేయడానికి ఒప్పుకోనని" గాంధీ స్పష్టంగా చెప్పారు.

జైలు అధికారులు ఆయనతో తమ దగ్గర ముందే తెచ్చిపెట్టిన కొన్ని గంధపు చెక్కలు ఉన్నాయని చెప్పారు. 1943 ఫిబ్రవరిలో గాంధీ 21 రోజులు నిరశన దీక్ష చేయడంతో ఆయన చనిపోతారని భావించిన వారు వాటిని తెప్పించి పెట్టారు. అదే విషయం వారు గాంధీకి కూడా చెప్పారు.

చివరికి గాంధీ ఆ గంధపు కొయ్యలను కస్తూర్బా చితికి ఉపయోగించడానికి అంగీకరించారు. "వాటిని నా చితి కోసం తెప్పించింది నిజమే అయితే, వాటిని తన భార్య చితికి ఉపయోగించవచ్చు" అని ఆయన వారితో అన్నారు..

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్,

కస్తూర్బా పార్థివ దేహం దగ్గర బాపూజీ

చితి మండే వరకూ కూర్చునే ఉన్న గాంధీ

తర్వాత రోజు పది గంటలకు అంతకు కొన్నిరోజుల ముందే గాంధీ సహచరుడు మహాదేవ్ దేశాయ్ చితి మండిన ప్రాంతంలో సుమారు 150 మంది కలిశారు.

కస్తూర్బా పార్థివ దేహాన్ని ఆమె ఇద్దరు కొడుకులు ప్యారే లాల్‌తోపాటు స్వయంగా గాంధీనే మోశారు. దేవదాస్ చితికి నిప్పు పెట్టారు. చితి మంటలు పూర్తిగా ఆరిపోయేవరకూ గాంధీజీ చితి ముందు ఉన్న ఒక చెట్టు కిందే కూచుండిపోయారు.

మీరు మీ గదిలోకి వెళ్లండని అందరూ గాంధీకి చెప్పారు. కానీ గాంధీ "62 ఏళ్లు జీవించిన తర్వాత ఈ భూమిపై చివరి క్షణాల్లో ఆమెను ఎలా వదలగలను. అలా చేస్తే తను నన్ను ఎప్పటికీ క్షమించదు" అన్నారు.

ఫొటో క్యాప్షన్,

గాంధీ జీవితచరిత్ర రాసిన ప్రమోద్‌ కుమార్‌తో బీబీసీ స్టూడియోలో రేహాన్ ఫజల్

కస్తూర్బా ఎప్పటికీ మనతో ఉంటారు

అంత్యక్రియల తర్వాత నాలుగో రోజు రామ్‌దాస్, దేవదాస్ కస్తూర్బా అస్థికలు సేకరించడానికి అక్కడికి వచ్చినపుడు, తల్లి చేతికి ఉన్నఐదు గ్లాస్ గాజులు పూర్తిగా అలాగే ఉండడం చూశారు. చితి మంటల్లో కూడా అవి చెక్కు చెదరలేదు.

గాంధీకి ఆ విషయం చెప్పినపుడు, ఆయన "కస్తూర్బా మన మధ్య నుంచి ఎక్కడికీ వెళ్లలేదనడానికి, ఎప్పటికీ మనతోనే ఉంటుందని చెప్పడానికి అవి సంకేతం" అన్నారు.

(గాంధీ జీవితచరిత్ర రాసిన ప్రమోద్ కపూర్‌తో జరిపిన సంభాషణల ఆధారంగా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)