పుల్వామా దాడి: ప్రకాశ్ జావడేకర్ మాటల్లో వాస్తవం ఎంత? - Fact Check

కశ్మీరీ విద్యార్థులు

పుల్వామాలో మిలిటెంట్ దాడి అనంతరం కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగాయనే వార్తలను మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ బుధవారంనాడు ఖండించారు.

"పుల్వామా దాడిపై దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయంటూ చాలామంది అంటున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. నేనో విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా... మేము అన్ని విద్యాసంస్థలనూ సంప్రదిస్తున్నాం. ఇప్పటి వరకూ ఇలాంటి ఘటన ఏదీ జరగలేదు" అని దిల్లీలో జరిగిన 'ఆపరేషన్ డిజిటల్ బోర్డ్' ప్రారంభోత్సవ సమయంలో జావడేకర్ వెల్లడించారు.

కానీ, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా నిజాలు కావు అని మా పరిశోధనలో తేలింది.

కశ్మీరీలపై బెదిరింపులు, దాడులు జరిగినట్లు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఈ దాడుల్లో బాధితులు కశ్మీరీ విద్యార్థులే.

ఫొటో సోర్స్, facebook

మంత్రి ప్రకటనలో నిజమెంత?

పుల్వామా దాడి ఘటన తర్వాత కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగినట్లు ఆరోపిస్తూ నమోదైన ఎన్నో కేసులను మా పరిశోధనలో గుర్తించాం.

ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం కారణంగానే తాను ఈ రకమైన రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని బాబా ఫరీద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీఎఫ్ఐటీ) ప్రిన్సిపల్ డాక్టర్ అస్లాం సిద్ధిఖీ బీబీసీకి తెలిపారు.

"విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే మేం ఇలా చేశాం" అని ఆయనన్నారు.

ఇలాంటి ప్రకటనే విడుదలే చేసిన మరో కాలేజ్.. అల్పైన్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ స్పందన కోసం మేం ఎదురుచూస్తున్నాం.

కశ్మీరీ విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకోవడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్న 22 మంది విద్యార్థులను అరెస్టు చేశామని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ నివేదిత కుక్రేతి బీబీసీతో అన్నారు.

కశ్మీరీ విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన ఇలాంటిదే మరో సంఘటన ఇది. ముల్లానా లోని మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులకు ఆశ్రయం ఇస్తున్న యజమానులు వెంటనే వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని చెబుతూ హరియాణా రాష్ట్రం అంబాలా జిల్లాలోని ఓ గ్రామ పెద్ద ఓ వీడియో విడుదల చేశారనే ఆరోపణలున్నాయి.

పుల్వామా దాడి అనంతరం కశ్మీరీ విద్యార్థులే లక్ష్యంగా దాడులు జరిగాయంటూ బీబీసీ కూడా వార్తను ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీరీల భద్రతపై ఆందోళన

దేశవ్యాప్తంగా కశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోందని, విద్యార్థుల భద్రత, రక్షణకు విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కశ్మీర్ కెరియర్ కౌన్సెలింగ్ అసోసియేషన్ (కేసీసీఏ) కోరినట్లు కూడా వార్తలొచ్చాయి.

పుల్వామా దాడి అనంతరం దేశంలోని వివిధ విద్యాసంస్థల నుంచి బహిష్కరణకు గురయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తాము ఉచిత ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు కోచింగ్ సెంటర్స్ అసోసియేషన్ (సీసీఏ) ఆఫ్ కశ్మీర్ ప్రకటించిందని కశ్మీర్లోని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

"ఆందోళనలో ఉన్న విద్యార్థులను పరామర్శించడానికి డెహ్రాడూన్ వెళ్లిన పీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బీజేపీ మంత్రి అన్నారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోకుండా అమాయక కశ్మీరీలను శిక్షించాలంటున్నారు. సిగ్గుచేటు" అని మెహబూబూ ముఫ్తీ ట్విటర్లో వ్యాఖ్యానించారు.

విద్యార్థులతోపాటు, కశ్మీరీ వ్యాపారులకు కూడా బెదిరింపులు వస్తున్నాయని.. పశ్చిమ బెంగాల్, బిహార్, న్యూదిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వారిపై కూడా దాడులు జరిగాయని వార్తలొస్తున్నాయి.

వీడియో క్యాప్షన్,

‘‘ఇన్నాళ్లు వాళ్లమ్మకు బాగులేదు.. ఇప్పుడు వాడు లేకుండా పోయాడు’’

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)