పుల్వామా దాడి: పాకిస్తాన్‌ వైపు వెళ్లే నదుల నీటిని భారత్ ఆపేయబోతోందా

నితిన్ గడ్కరీ

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా వెనక్కు తీసుకుని, దిగుమతి పన్ను 200 శాతం చేసిన తర్వాత భారత్ పాకిస్తాన్ వైపు వెళ్లే తమ మూడు నదుల నీటిని కూడా ఆపేయాలని పెద్ద నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 14న కశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ ఈ దాడికి పాకిస్తాన్ కారణం అని ఆరోపించింది. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ ఆరోపణలను కొట్టిపారేసింది.

గురువారం ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ "దేశ విభజన తర్వాత మూడు నదులు పాకిస్తాన్‌కు, మూడు నదులు భారత్‌కు దక్కాయి. మన మూడు నదుల్లో మనకు హక్కున్న జలాలు పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు మేం ఆ నదులపై మూడు ప్రాజెక్టులు ప్రారంభించి ఈ నీళ్లను తిరిగి యమునలోకి తీసుకొస్తున్నాం" అన్నారు.

సింధు జల ఒప్పందం ప్రకారం భారత్ తన నదుల నీళ్లను పాకిస్తాన్‌తో పంచుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సింధు జల ఒప్పందం

సింధు జల ఒప్పందం అంటే..

 • 1960లో భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జల ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉప నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజిస్తారు.
 • ఒప్పందంలో సింధు, జీలం, చీనాబ్ నీళ్లు పాకిస్తాన్‌కు ఇచ్చారు. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీళ్లు భారత్‌కు దక్కాయి.
 • ఇందులో భారత్ తన నదుల్లో నీళ్లను కొన్ని మినహాయించి అపరిమితంగా వాడుకోవచ్చు. అదే పాకిస్తాన్ నదుల్లో నీళ్లను ఉపయోగించుకోడానికి కొన్ని నియమిత హక్కులు భారత్‌కు కూడా ఇచ్చారు. అంటే విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం కోసం పరిమిత జలాలు వాడుకోవచ్చు.
 • భారత్ జలాలతో పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న భారీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
 • ఇటు కశ్మీర్‌లో జల వనరుల వల్ల ఆ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోతోందని అక్కడి నేతలు చెబుతున్నారు. బీజేపీ మద్దతుదారు మెహబూబా ముఫ్తీ జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సింధు జల ఒప్పందం వల్ల రాష్ట్రానికి 20 వేల కోట్ల నష్టం జరుగుతోందని, కేంద్రం దానిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు,.
 • పాకిస్తాన్ పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం ఇక్కడినుంచే జలాలు అందుతాయి. పాకిస్తాన్‌లో ఎక్కువ ప్రాంతంలో వ్యవసాయానికి ఇదే అధారం. పాకిస్తాన్ ఇండస్ట్రీ, నగరాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం కూడా ఈ ఒప్పందం చాలా ముఖ్యమైనది.
 • ఒప్పందం ప్రకారం ఎవరూ ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించకూడదు, లేదా మార్చకూడదు.
 • కానీ వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీట్స్ ప్రకారం పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూపులను తమకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని చెప్పి భారత్ దాని నుంచి వెనక్కు వెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 • అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ప్రాథమిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే ఏ ఒప్పందాన్నైనా రద్దు చేయవచ్చని చెబుతోంది. కానీ అది చెప్పినంత సులభం కాదు.
 • విభజన తర్వాత సింధు లోయ నుంచి వెళ్లే నదులపై జరిగిన వివాదానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది. ఫలితంగా భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే, పాకిస్తాన్ మొట్టమొదట వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. వరల్డ్ బ్యాంక్ భారత్‌పై అలా చేయవద్దని ఒత్తిడి తీసుకురావచ్చు.
 • అయితే సింధు నది టిబెట్ నుంచి ప్రారంభం అవుతుంది. కానీ చైనాను ఈ ఒప్పందంలో చేర్చుకోలేదు. కానీ చైనా ఈ నదిని అడ్డుకుంటే, లేదా ప్రవాహ దిశను మారిస్తే, రెండు దేశాలకు దానివల్ల నష్టం జరుగుతుంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

450 మెగావాట్ల బగలిహార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ చీనాబ్ నదిపై 2008లోనే పూర్తైంది

జాతీయ ప్రాజెక్టు కింద నిర్మాణం

సభను ఉద్దేశించి మాట్లాడిన నితిన్ గడ్కరీ ఈ నదులపై కట్టబోయే ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద నిర్మిస్తాం అని చెప్పారు.

తన ట్విటర్ హ్యాండిల్లో దీని గురించి సమాచారం ఇచ్చిన ఆయన "గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం, (భారత్) పాకిస్తాన్‌తో నదుల నీటిని పంచుకోకూడదని నిర్ణయం తీసుకుంది. మనం తూర్పు నదుల ప్రవాహాన్ని కశ్మీర్, పంజాబ్ వైపు మళ్లిస్తాం" అన్నారు.

ట్వీట్ ద్వారా ఆయన షాహ్‌పూర్ ఆనకట్ట నిర్మాణం పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు.

నితిన్ గడ్కరీ ఈ ట్వీట్స్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు.

కమలేష్ కుమార్ ప్రతిహార్ ఈ చర్యలను అభినందించారు.

సంకేత్ కేశర్‌వాణి దీనిని ఒక పెద్ద నిర్ణయంగా వర్ణించారు.

నితిన్ గడ్కరీ ట్వీట్‌పై ఎక్కువగా సానుకూల స్పందనలు వస్తున్నాయి. కానీ కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు.

ఒక ట్విటర్ యూజర్ అయితే "మనం ఈ నీళ్లు ఆపడం ఎప్పుడు చూడచ్చు" అని ఆయన్ను ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)