తెలంగాణ బడ్జెట్: 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/kcr

తెలంగాణలో రెండోసారి పాలన పగ్గాలు అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఈ ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రిమండలి గురువారమే ఆమోదం తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దుల (సప్లిమెంటరీ డిమాండ్) గ్రాంట్స్‌ను ఆమోదించారు.

శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు సమావేశం కాగా పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.

తెలంగాణ తరఫున పుల్వానా అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సభ్యుల నివాళి అనంతరం ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రసంగం మొదలైంది.

శాసనమండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, TelanganaGovt

ఫొటో క్యాప్షన్,

కొత్త మరో రెండు జిల్లాలు ఏర్పడడానికి ముందున్న జిల్లాలతో కూడిన తెలంగాణ పటం

ఇదీ 2019-20 తెలంగాణ బడ్జెట్ స్వరూపం

మొత్తం బడ్జెట్‌: రూ. 1,82,017 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ. 1,31,629 కోట్లు

మూలధన వ్యయం: రూ.32,815 కోట్లు

సొంత రెవెన్యూ రాబడి ప్రతిపాదనలు: రూ.94,776 కోట్లు

రెవెన్యూ మిగులు: రూ.6,564 కోట్లు

ఆర్థిక లోటు: రూ.27,749 కోట్లుగా ఉంటుదని అంచనా.

ఫొటో సోర్స్, Facebook/TelanganaCMO

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్న కేసీఆర్

కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం

‘‘ఆవిర్భావం నాటికి తెలంగాణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుండేది. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం.

ఒకప్పుడు అభివృద్ధి అంటే గుజరాత్, కేరళలను నమూనాగా చూపేవారు.. కానీ, ఇప్పుడు తెలంగాణ ఆదర్శంగా మారింది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నాం.

దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం.

వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తాం.

ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం’’ అన్నారు.

2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

ఫొటో సోర్స్, TelanganaGovt/MissionBhagiratha

ఏప్రిల్ నెలాఖరుకు మిషన్ భగీరథ పూర్తి

నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు కేటాయింపు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఆదేశాలు జారీ చేశారు.

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.

బీసీల కోసం 119 గురుకులాలు ఏర్పాటు చేస్తామని.. మిషన్ భగీరథ పనులు ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో ఇప్పటివరకు 2,72,763 ఇళ్లు ఇచ్చినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

కేటాయింపులు ఇలా..

వ్యవసాయం: రూ. 20,107 కోట్లు

నీటిపారుదల: రూ. 22,500 కోట్లు

వైద్య, ఆరోగ్యం: రూ.5536 కోట్లు

రైతుబంధు: రూ. 12 వేల కోట్లు

రైతు రుణమాఫీ: రూ. 6 వేల కోట్లు

రైతు బీమా: రూ. 650 కోట్లు. 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ

ఎంబీసీ కార్పొరేషన్‌: రూ. వెయ్యి కోట్లు

షెడ్యూల్ తెగల ప్రగతి నిధి: రూ. 9,827 కోట్లు

షెడ్యూలు కులాల ప్రగతి నిధి: రూ. 16,581 కోట్లు

మైనార్టీ సంక్షేమం: రూ. 2004 కోట్లు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్: రూ. 1450 కోట్లు

నిరుద్యోగ భృతి: రూ. 1,810 కోట్లు

ఆసరా పింఛన్లు: రూ. 12,067 కోట్లు

ఈఎన్టీ, దంత పరీక్షలు: రూ. 5,536 కోట్లు

బియ్యం రాయితీ: రూ. 2,744 కోట్లు

పంచాయతీలకు రెండు ఆర్థిక సంఘాల నుంచి: రూ. 3,256 కోట్లు

500 జనాభా గల గ్రామానికి రూ. 8 లక్షల నిధులు

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)