తెలంగాణ బడ్జెట్: బెజవాడ గోపాలరెడ్డి నుంచి కేసీఆర్ వరకు.. బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులు వీరే
- అరుణ్ శాండిల్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 బడ్జెట్‌ను శాసనసభ ముందుంచారు. ఇలా ముఖ్యమంత్రే బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలంగాణలో ఇదే తొలిసారి.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్ర రాష్ట్ర సీఎంగా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి తొలిసారి తానే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1955-56 ఆర్థిక సంవత్సరంలో ఆయన శాసనసభలో బడ్జెట్ ప్రసంగం చేశారు.
అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉంటూ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బ్రహ్మానందరెడ్డి 1968-69, 1969-70 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్‌ను సభ ముందుంచారు.
రోశయ్య 2010-11లో తానే స్వయంగా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య తరువాత మళ్లీ కేసీఆరే ఇలా చేయగా.. తెలంగాణలో ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరే.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
'కేసీఆర్ కిట్' అందజేస్తున్న కేసీఆర్
ఇతర రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సందర్భాలున్నాయి. అలాంటివి కొన్ని..
ఉత్తరప్రదేశ్: 2013-14, 2015-16లో అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్
కేరళ: 2016-17లో అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ
కర్ణాటక: 2017-18లో అప్పటి సీఎం సిద్ధరామయ్య, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 2018-19 ఆర్థిక సంవత్సరానికి జులైన 5న సీఎం కుమారస్వామి
రాజస్థాన్: 2018-19 వసుంధర రాజె
నాగాలాండ్: 2018-19 అక్కడి సీఎం కన్రాడ్ సంగ్మా
ఛత్తీస్‌గఢ్: 2018-19 అప్పటి సీఎం రమణ్ సింగ్
హిమాచల్ ప్రదేశ్: 2018-19లో సీఎం జైరాం ఠాకుర్
గోవా: 2018-19లో మనోహర్ పారికర్ సీఎంగా ఉంటూనే ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2018-19 బడ్జెట్లను అయిదు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే ప్రవేశపెట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది ఇప్పటికే నలుగురు ముఖ్యమంత్రులు
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు బడ్జెట్ సమర్పించగా. అందులో నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే ఈ బాధ్యత తీసుకున్నారు.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జనవరి 30న ఆ రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ సమర్పించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఫిబ్రవరి 8న అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఛత్తీస్‌గఢ్‌లోనూ ఫిబ్రవరి 8నే అక్కడి ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ బడ్జెట్ సమర్పించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ ఫిబ్రవరి 9న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్‌ను కూడా పలు సందర్భాల్లో ప్రధాన మంత్రులే ఆర్థిక మంత్రి హోదాలో ప్రవేశపెట్టారు.
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలోనే ఇలా ఆర్థిక మంత్రులుగా బడ్జెట్ సమర్పించారు.
1958-59 ఆర్థిక సంవత్సరానికి జవహర్ లాల్ నెహ్రూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటికి ఆయన ప్రధానిగా ఉన్నారు.
1970-71లో ఇందిరాగాంధీ కూడా ప్రధాని మంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ సమర్పించారు.
1987-88 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీయే లోక్‌సభ ముందుంచారు.
మాజీ ప్రధాని మన్మోహన్ కూడా తాను ప్రధానిగా ఉన్న సమయంలో కొద్దికాలం పాటు ఆర్థిక శాఖ బాధ్యతలు చూసినా ఆ సమయంలో బడ్జెట్ పెట్టాల్సిన అవసరం రాలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)