ఆంధ్రప్రదేశ్: కొండవీడు రైతు కోటయ్య మృతి... సమాధానాల్లేని ప్రశ్నలు

రైతు కోటేశ్వరరావు మృతదేహం

గుంటూరు జిల్లా ఎడ్ల‌పాడు మండ‌లం కొండ‌వీడు గ్రామంలోని రైతు కోటేశ్వ‌ రరావు మరణించిన తీరుపై ఆయన కుమారుడు వీరాంజనేయులు, ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న పున్నారావు, రైతును కాపాడే ప్రయత్నం చేశామని చెబుతున్న పోలీసులు, రాజకీయాలనుంచి వైదొలగడానికి సిద్ధమని ప్రకటించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు మీడియాకు చెప్పిన వివరాలు పోలీసుల తీరుపై ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

ఈ ప్రశ్నలలో కొన్నింటికి సమాధానాల బీబీసీ ప్రయత్నించింది. కానీ, సంబంధిత వ్యక్తులు వాటికి సమాధానాలు ఇవ్వలేదు. దాంతో, ప్రస్తుతానికి అవి జవాబు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి.

హెలీప్యాడ్ నిర్మాణం... పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కోటయ్య పొలంలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నామని, ఆయన స్వయంగా అనుమతి ఇవ్వటంతో పాటు మరో రైతుతో మాట్లాడి పార్కింగ్ కోసం మూడెకరాలు ఇప్పించారని మంత్రి పత్తిపాటి చెప్పారు. ఎండ తీవ్రంగా ఉండటంతో పొలంలోని వేపచెట్టు కింద కూర్చున్నామని నీసు సుందరరావు అనే కానిస్టేబుల్ (ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం) చెప్పారు.

పోలీసు కంట్రోల్ రూమ్ లేదా టెంట్లు కోటయ్య పొలంలో వేశారా? లేదా? వేస్తే వేపచెట్టు కింద ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది?

కోటయ్య పొలంలోకి కొందరు పోలీసులు చొరబడి బొప్పాయిలను కోశారని గ్రామస్తులు చెప్పారు. ఈ నెల 20న ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, బొప్పాయి తోటలోని కాయలను పోలీసులు కోసుకెళ్లడంతో పాటు తోటను ధ్వంసం చేస్తున్నారని తన భర్త తనకు చెప్పి బాధపడ్డారని, కుటుంబ సమేతంగా తమ గోడును మంత్రి పుల్లారావుకు వివరించి, పంటనష్ట పరిహారం కోరదామని చెప్పారని కోటేశ్వరరావు భార్య ప్రమీల చెప్పారు.

మరి నిజంగానే పోలీసులు కాయలు కోశారా? లేదా? పోలీసులకు, కోటయ్యకు మధ్య వాగ్వాదం జరిగిందా?

దీనికి ఫిబ్రవరి 19వ తేదీన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు సమాధానం ఇస్తూ.. బొప్పాయి తోటలో పోలీసులు ఎవరైనా కాయలు కోసి ఉంటే రూ.500లకు మించి నష్టం ఉండదని, ఆ విషయం పోలీసు శాఖ దృష్టికి తీసుకొస్తే పరిహారం ఇచ్చేవారమని అన్నారు. అంతే తప్ప పోలీసులు కాయలు కోశారా? లేదా? అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

పున్నారావుతో కలసి కోటయ్య పొలానికి వెళ్లారని వీరాంజనేయులు చెబుతున్నారు. కానిస్టేబుల్ సుందరరావు మాత్రం, కోటయ్యతో పాటు ఒక మహిళ తమ ఎదుటే పొలానికి వెళ్లారని చెబుతున్నారు. కోటయ్య మృతి వార్త తెలుసుకుని తాము పొలం వద్దకు వచ్చే సరికి పున్నారావు పోలీసుల అదుపులో, పోలీసు వాహనంలో ఉన్నారని వీరాంజనేయులు చెబుతున్నారు.

మరి, కోటయ్యతో పాటు పొలానికి వెళ్లింది పున్నారావా? లేక మహిళా? ఒకవేళ మహిళ అయితే ఆమె ఏమైంది? పోలీసులు పున్నారావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

18వ తేదీ మధ్యాహ్నం పోలీసుల అదుపులో కనిపించిన పున్నారావు తిరిగి ప్రత్యక్షమైంది 20వ తేదీన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా ముందుకు వచ్చినప్పుడే.

అప్పటి వరకూ పున్నారావు ఏమయ్యారు? మీడియా ముందుకు వచ్చినప్పుడు పున్నారావును తీసుకొచ్చిందీ, తీసుకెళ్లిందీ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అది నిజమేనా? నిజమైతే పోలీసులు అదుపులోకి తీసుకున్న పున్నారావు తెలుగుదేశం పార్టీ నాయకుల అదుపులోకి ఎలా వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు?

ఉదయాన్నే తాను, కోటయ్య కలసి పొలానికి వెళ్లామని, బొప్పాయి తోట దగ్గర తనను దించిన కోటయ్య టిఫిన్ తీసుకొస్తానని గ్రామంలోకి వెళ్లారని, మళ్లీ వచ్చి మునగతోటలోకి వెళ్లారని పున్నారావు 20వ తేదీన మీడియాతో చెప్పారు. 11 గంటల సమయంలో గ్రామంలోకి వెళ్లడానికి బైక్ కోసమని తాను మునగతోటకు వెళ్లగా.. అక్కడ చేతిలో పురుగుల మందు డబ్బాతో నోటి నుంచి నురగలు కక్కుకుంటూ కోటయ్య కనిపించారని పున్నారావు తెలిపారు. తాను వెంటనే డబ్బా లాగేశానని, గ్రామంలో అందరికీ చెబుదామని పరుగెత్తుకెళ్లానని, కోటయ్య కొడుక్కి ఫోన్ చేసి చెప్పానని పున్నారావు వెల్లడించారు.

ఈనాడు దినపత్రిక గుంటూరు జిల్లా ఎడిషన్‌లో ఫిబ్రవరి 20వ తేదీన ప్రచురించిన కథనం ప్రకారం (అంటే పున్నారావు 19వ తేదీన చెప్పిన కథనం ప్రకారం).. తాను కోటేశ్వరరావును కలుద్దామని అతను ఉన్న ప్రదేశానికి వెళ్లగా నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించారని పున్నారావు చెప్పారు. అతని పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించిందని, గొంతులో మంట ఉందని కోటేశ్వరరావు చెప్పారని, కంగారుపడ్డ తాను కేకలు వేయగా.. సమీప పొలాల్లోని రైతులు వచ్చి పరిస్థితిని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించారని అన్నారు. సమీపంలో ఉన్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి వచ్చి తనను అదుపులోకి తీసుకుని పోలీసు జీపులో కూర్చోబెట్టారని వెల్లడించారు.

మరి పురుగుల మందు డబ్బా ఏమైంది?

పోలీసులు చిత్రీకరించినట్లు చెబుతున్న వీడియో ప్రకారం.. కోటయ్య మృతదేహాన్ని పోలీసులు వాహనం వరకూ మోసుకెళుతున్నప్పుడు అక్కడ పున్నారావు కానీ, గ్రామస్తులు కానీ లేదు. పైగా, తనకు పున్నారావే స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని కోటయ్య కుమారుడు వీరాంజనేయులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 19వ తేదీన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు సైతం.. పున్నారావే స్వయంగా ఫోన్ చేసి వీరాంజనేయులుకు సమాచారం ఇచ్చారని చెప్పారు.

అలాంటప్పుడు పున్నారావుకు ఫోన్ ఉందా? లేదా? ఉంటే ఆ ఫోన్ ఏమైంది? 19వ తేదీన పున్నారావు చెప్పిన కథనం ప్రకారం చుట్టుపక్కల రైతులు వచ్చి కోటయ్య పరిస్థితిని గమనించారా? లేదా? గమనిస్తే ఆ వచ్చిన రైతులు ఎవరు?

ఇదే ప్రశ్నను 20వ తేదీన విలేకరుల సమావేశంలో పున్నారావును అడగ్గా.. తన సెల్‌ఫోన్ పోలీసులు తీసుకున్నారని ఒకసారి, తనకు ఫోన్ లేదని మరోసారి చెప్పారు.

తండ్రి పరిస్థితి గురించి తనకు తెలియగానే ఊళ్లో పెద్దలను తీసుకుని ఆటోలో పొలానికి వెళ్లానని కోటయ్య కుమారుడు వీరాంజనేయులు చెప్పారు. రూరల్ ఎస్పీ మాత్రం వీరాంజనేయులు ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి వచ్చారని, ఆ మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ద్విచక్రవాహనాలను అనుమతించలేదని, అయితే, కోటయ్య కుమారుడు విషయం చెప్పడంతో వెంటనే అతని వాహనాన్ని పోలీసుల వద్దకు పంపామని తెలిపారు.

చనిపోయిన రైతు బట్టలు ఎప్పుడు, ఎక్కడ ఎలా మారాయి? అసలు మారాయా? లేదా?

ఒకపక్క పోలీసుల పాత్రపై అనుమానాలు వస్తుండగా.. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ముగ్గురు పోలీసులు కోటయ్య ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారని అభినందిస్తూ, నగదు రివార్డులు ఇవ్వటం ఎంత వరకు సమంజసం?

ఒకపక్క డీఎస్పీ స్థాయి పోలీసు అధికారితో సంఘటనను దర్యాప్తు చేయిస్తున్న పైస్థాయి అధికారి.. స్వయంగా ఆ సంఘటనలో పాల్గొన్న, విచారణకు హాజరు కావాల్సిన వారికి ప్రశంసలు, రివార్డులు ఇవ్వటం దర్యాప్తును ప్రభావితం చేసినట్లు అవ్వదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)