కోడి రామకృష్ణ మృతి: సెంటిమెంట్‌కు గ్రాఫిక్స్ జోడించిన దర్శకుడు

కోడి రామకృష్ణ

ఫొటో సోర్స్, kodi ramakrishna/fb

సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి (64) చెందారు. ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.

ఆయన వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకత్వం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో చిరంజీవి కథానాయకుడిగా నటించారు. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో కోడి రామకృష్ణ అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు.

ఫొటో సోర్స్, http://www.kodiramakrishna.in/gallery/

ఫొటో క్యాప్షన్,

చిరంజీవి, గొల్లపూడి మారుతి రావుతో కోడి రామకృష్ణ

'మంగమ్మగారి మనవడు', 'ఆగ్రహం', 'ఆహుతి', 'శత్రువు', 'అమ్మోరు', 'ముద్దుల మావయ్య', 'మా ఆవిడ కలెక్టర్'‌, 'పెళ్లి', 'దొంగాట', 'అంజి', 'దేవీపుత్రుడు', 'దేవి', 'దేవుళ్లు' 'అరుంధతి' గుర్తింపు పొందిన ఆయన చిత్రాల్లో కొన్ని.

నటులు అర్జున్‌, భానుచందర్‌, సుమన్‌, జీవితలను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2012లో ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.

ఆయన దర్శకతం వహించిన చివరి చిత్రం నాగహరువు. దీన్ని 2016లో కన్నడంలో తీశారు.

ఫొటో సోర్స్, kodiramakrishna/fb

అదే ఆయన సంతకం

కోడి రామకృష్ణ సెట్లోకి వస్తే తలకు రుమాలు కట్టుకునే వాడు. అది ఆయన ట్రేడ్‌మార్క్‌గా స్థిరపడిపోయింది. ’’తలకు తెల్లటి బ్యాండు కట్టుకోవడం నాకు సెంటిమెంట్’’ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

నటుడిగానూ ఆయన రాణించారు. 'దొంగాట', 'ఆస్తి మూరెడు ఆశ బారెడు', 'అత్తగారూ స్వాగతం', 'ఇంటి దొంగ', 'మూడిళ్ల ముచ్చట' చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరించారు.

తన సినిమాల్లో సెంటిమెంట్‌ను బాగా పండిస్తారని పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణ చాలా కాలం గ్యాప్ తర్వాత భక్తి, గ్రాఫిక్స్‌ను మేళవిస్తూ అమ్మోరు చిత్రంతో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఆ తర్వాత అదే పంథాలో వచ్చిన దేవి, అరుంధతి చిత్రాలు ఆయనకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి.

ఫొటో సోర్స్, http://www.kodiramakrishna.in/gallery/

ఫొటో క్యాప్షన్,

దర్శకుడు దాసరి నారాయణరావుతో కోడి రామకృష్ణ

ఆయన మృతికి సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన కృషిని మరిచిపోలేమని సినీనటుడు మహేశ్ ట్వీట్ చేశారు. హీరోలు జూనియర్ ఎన్టీయార్, నాని, నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)