క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
భారత్-పాక్ మ్యాచ్

ఫొటో సోర్స్, Reuters

భారత మీడియాలో వస్తున్న పతాక శీర్షికలను మీరు చదుతుంటే.. జూన్ 16న మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో ఆడబోయే మ్యాచ్‌ను భారత్ వదులుకోవచ్చనే అనిపిస్తుంది.

ఈ నెల కశ్మీర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి నిరసనగా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అనుకుంటోంది.

ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.

ఈ టోర్నమెంటు నుంచి పాకిస్తాన్‌ను నిషేధించాలని భారత్ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అది ఎలా సాధ్యమో స్పష్టంగా తెలీడం లేదు.

టోర్నమెంటునే ప్రమాదంలో పడేసి, పాకిస్తాన్‌తో తమ క్రీడా సంబంధాలను నాశనం చేసే అలాంటి అభ్యర్థనను, 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే మిగతా ఎనిమిది జట్లు ఎందుకు అంగీకరించాలి?

పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రతీకారానికి దిగేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

దక్షిణాసియాలో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఇరుగుపొరుగు దేశాల క్రికెట్ సంబంధాలు, రాజకీయ కారణాలతో దాదాపు ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటూ వచ్చాయి.

2008 ముంబై దాడుల తర్వాత భారత్-పాక్ ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఆడలేదు. నిజానికి సుదీర్ఘ కాలంగా రెండు జట్లూ పరస్పరం మైదానంలో తలపడలేదు.

ఉదాహరణకు క్రికెట్ విషయానికే వస్తే.. శత్రుత్వంతో 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 1978లో రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా బోర్డ్ పాకిస్తాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచింది.

భారత్-పాక్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

25 వేల టికెట్ల కోసం 5 లక్షల మంది పోటీపడుతున్నారు

కాల్పులు లేని యుద్ధం

జార్జ్ ఆర్వెల్ ఆటలను "కాల్పులు లేని యుద్ధం"గా వర్ణించారు.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరినప్పుడు చాలా మంది రెండు జట్ల మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానిని "అణ్వాయుధాలు ఉపయోగించని యుద్ధంగా" చెబుతారు.

గతంలో చాలాసార్లు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లతో దేశంలో జాతీయవాదం, దురభిమానం పెల్లుబికింది.

పాక్ భారత్‌లో పర్యటించడం ఇష్టం లేని మితవాద గ్రూపులు దిల్లీలో ఒక టెస్ట్ మ్యాచ్ పిచ్‌పై గుంతలు తీశాయి.

అహ్మదాబాద్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు హెల్మెట్లు వేసుకుని ఫీల్డింగ్ చేస్తే, కరాచీలో జరిగిన ఒక మ్యాచ్‌లో స్టాండ్స్‌ను తగలబెట్టడం కనిపించింది.

కాలక్రమేణ ఈ ఆగ్రహావేశాలు చల్లారాయి. కానీ రామచంద్ర గుహ తన 'ఎ కార్నర్ ఆఫ్ ఎ ఫారిన్ ఫీల్డ్‌'లో చెప్పినట్లు భారత క్రికెట్ చరిత్ర "1947 ముందు హిందూ, ముస్లింల మధ్య విభేదాల్లా ఉండేది", భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలు చాలా పెద్దవిగా చేసి చూపించేవి".

జూన్‌లో ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరిగే భారత్-పాక్ మ్యాచ్ ఈ టోర్నీకి చాలా కీలకం. ఈ మ్యాచ్‌కు ఉన్న ఆ క్రేజ్ దీనిని స్పష్టం చేస్తోంది.

వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ చూడ్డానికి 25 వేల టికెట్ల కోసం 2 లక్షల 70 వేల మంది అప్లై చేస్తే, అదే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉన్న 25 వేల టికెట్లకు సుమారు 5 లక్షల మంది అభిమానులు దరఖాస్తు చేశారు.

ఈ టోర్నమెంట్ డైరెక్టర్ స్టీవ్ ఎల్‌వర్తీ "ఈ మ్యాచ్‌ బహుశా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్" అవుతుంది అన్నారు.

భారత్-పాక్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రెండు దేశాల మధ్య జరిగిన ఎన్నో మ్యాచ్‌లలో దురభిమానం వెల్లువెత్తింది

టోర్నమెంటుకే పెద్ద దెబ్బ

ఈ మ్యాచ్‌ బాయ్‌కాట్ చేయాలంటున్న భారత అభిమానులు, గ్రూప్ గేమ్‌లో ఈ మ్యాచ్ వదులుకున్నంత మాత్రాన రౌండ్ రాబిన్ టోర్నీలో భారత్‌కు వచ్చే నష్టమేమీ లేదంటున్నారు.

ఉదాహరణకు 2003 ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌ను భద్రతా కారణాలతో హరారే నుంచి దక్షిణాఫ్రికాకు మార్చినప్పుడు దానికి ఒప్పుకోని ఇంగ్లండ్ నాలుగు పాయింట్స్ కోల్పోవడానికి సిద్ధమైంది.

కానీ, 2019 ప్రపంచ కప్‌లో ఎంతోమంది ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేస్తే, అది టోర్నమెంటుకే చాలా పెద్ద దెబ్బ అవుతుంది.

ప్రపంచకప్‌లో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోలేదు. 1996లో కార్గిల్‌లో రెండు దేశాల మధ్య చిన్నస్థాయి యుద్ధం జరుగుతున్నా.. రెండు జట్లూ మాంచెస్టర్‌లో తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది. అదే రోజు కార్గిల్లో ఆరుగురు పాకిస్తాన్ సైనికులు, ముగ్గురు భారత సైనికాధికారులు మృతి చెందారు.

పార్లమెంటు సభ్యుడు, రచయిత శశి థరూర్ , "ఈ ఏడాది మ్యాచ్‌ వదులుకోవడం వల్ల రెండు పాయింట్లు కోల్పోవడం కాదు, లొంగిపోవడం కంటే అధ్వానంగా ఉంటుంది. పోరాటం లేకుండానే ఓటమి రుచిచూసినట్టు ఉంటుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)