పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం

  • వినీత్ ఖరే
  • బీబీసీ ప్రతినిధి
పుల్వామా

ఫొటో సోర్స్, EPA

కేంద్ర జల వనరుల మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గురువారం సాయంత్రం పాకిస్తాన్ వైపు ప్రవహించే మన మూడు నదుల జలాలను ఆపేస్తున్నామని ట్విటర్ ద్వారా చెప్పారు.

ఆ జలాలను ఇక జమ్ము-కశ్మీర్, పంజాబ్ ప్రజల కోసం ఉపయోగిస్తామని అన్నారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మహమ్మద్ ఆత్మాహతి దాడి తర్వాత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను భారత మీడియాలోని ఒక భాగం పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న 'నీటి సర్జికల్ స్ట్రైక్స్'గా వర్ణించింది,.

అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం మాత్రం ఇది దీర్ఘకాలిక ప్రాజెక్టని, దీనికి సింధు జల ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేదని బీబీసీకి గురువారమే చెప్పింది.

ఈ నిర్ణయానికి పుల్వామా దాడికి ఎలాంటి సంబంధం లేదని గడ్కరీ కార్యాలయం స్పష్టం చేసింది. సింధు జల ఒప్పందంలో మార్పు ఉండదని తెలిపింది.

రావీ, సట్లెజ్, బియాస్ నదులపై ఆనకట్టలు నిర్మించి నీటిని ఆపుతామని గడ్కరీ కార్యాలయం తెలిపింది. షాహ్‌పూర్-కాండీ డామ్ నిర్మాణ పనులు పుల్వామా దాడికి ముందు నుంచే జరుగుతున్నాయని చెప్పింది. నదులపై మరో రెండు డ్యాంలు నిర్మించే విషయంపై ఇక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని వివరించింది.

కానీ మీడియాలోని ఒక భాగం ఈ నిర్ణయాన్ని వేరేలా చూపిస్తోంది. ఈ ప్రకటన తర్వాత పాకిస్తాన్ నీటి చుక్క కోసం తపిస్తుందని అంటోంది.

అంతే కాదు, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న టైమింగ్‌పై కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Twitter

పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి భారత్‌లో కొంతమంది ఎప్పుడూ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని, లేదా నీళ్లను పాక్‌కు వ్యతిరేకంగా ఆయుధంలా ఉపయోగించాలని చెబుతూ వచ్చారు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు దిగితే, చైనా వైఖరి ఎలా ఉంటుందోనని చర్చిస్తున్నారు.

మిలిటెంట్ సంస్థ జైష్ బేస్ పాకిస్తాన్‌లోనే ఉంది. పుల్వామా దాడికి భారత్ నేరుగా పాకిస్తాన్‌పైనే ఆరోపణలు చేస్తోంది. పాకిస్తాన్ ఇంతకు ముందులాగే ఈసారి కూడా అన్ని ఆరోపణలనూ తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Twitter

అయితే గడ్కరీ ఈ ట్వీట్‌లో ప్రభుత్వం తరఫున కొత్త విషయం ఏదైనా చెప్పారా, లేక పాత విషయాన్నే మళ్లీ చెప్పారా?

"ఒప్పందం ప్రకారం తన భాగం నీళ్లను భారత్ ఉపయోగించులేకపోయింది, అది ఆ దేశం సమస్య, పాకిస్తాన్ సమస్య కాదు" అని భారత్, పాకిస్తాన్ నిపుణులు చెబుతూ వస్తున్నారు.

1960లో సింధు జల ఒప్పందం ప్రకారం సింధు నది ఉప నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. సట్లెజ్, బియాస్, రావి నదులను తూర్పు నదులుగా, జీలం, చీనాబ్, సింధు నదులను పశ్చిమ నదులుగా చెప్పారు.

ఒప్పందం ప్రకారం తూర్పు నదుల నీళ్లు( కొన్ని మినహాయింపులు తప్పించి) భారత్ ఎలాంటి పరిమితులు లేకుండా ఉపయోగించుకోవచ్చు.

పశ్చిమ నదుల నీళ్లను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. కానీ ఒఫ్పందం ప్రకారం ఈ నదుల నీళ్లను పరిమితంగా ఉపయోగించుకునే హక్కు భారత్‌కు ఉంది. అంటే విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం లాంటి వాటికి పరిమితంగా వాడుకోవచ్చు.

నితిన్ గడ్కరీ వార్తా చానల్ 'ఆజ్‌తక్‌'తో మాట్లాడుతూ "రావి, సట్లెజ్, బియాస్‌లో మొత్తం 33 మిలియన్ ఎకరాల నీళ్లు ఉన్నాయని, భారత్ వాటిలో 31 మిలియన్ ఎకరాల నీళ్లు వాడుకుంటోందని" చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఏదైనా కొత్త విషయం ఉందా

2016లో ఉడీపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత భటిండాలో జరిగిన ఒక ర్యాలీలో నరేంద్ర మోదీ "ఈ ఇండస్ వాటర్ ట్రీటీ(సింధు జల ఒప్పందం) ప్రకారం, పాకిస్తాన్ వైపు వెళ్లే భారత జలాలను ఇప్పుడు చుక్క నీరు కూడా వెళ్లకుండా ఆపేస్తాం. నేను వాటిని పంజాబ్, జమ్ము-కశ్మీర్, భారత రైతుల కోసం తీసుకురావడానికి"...( మాటలు స్పష్టంగా లేవు)

అప్పుడు నరేంద్ర మోదీ "రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవని" కూడా అన్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.

అంటే గడ్కరీ చేసిన ట్వీట్‌లోని పాత విషయమే పునరావృతమైంది. కానీ, ప్రభుత్వం తను చెప్పిన మాటనే ఇప్పటివరకూ ఎందుకు అమలు చేయలేకపోయిందనేదే, ఇప్పుడు ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సింధు నది

భారత్ తన జలాలను ఎందుకు ఉపయోగించలేకపోయింది

దానికి "నిధుల లోటు, ఆసక్తి లేకపోవడం, ప్రాజెక్టుల అభివృద్ధిపై సరిగా లేని ప్లానింగ్ లాంటి దీనికి ఎన్నో కారణాలున్నాయి" అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌కు సంబంధించిన డాక్టర్ ఉత్తమ్ కుమార్ సిన్హా చెప్పారు.

నదీ జలాల పంపకాలపై రాష్ట్రాల మధ్య వివాదాలు కూడా దీనికి ఒక కారణం.

నితిన్ గడ్కరీ తన ట్వీట్‌లో "రావీ నదిపై షాహ్‌పూర్-కాండీ ఆనకట్ట పనులు ప్రారంభం అయ్యాయి" అని చెప్పారు.

"ఈ పనులన్నీ రాత్రికిరాత్రే జరిగిపోవు, దీనికి ఎన్నో ఏళ్లు పడుతుంది" అని నీటి అంశాల్లో నిపుణులు హిమాన్షు ఠక్కర్ అన్నారు.

పంజాబ్, జమ్ము-కశ్మీర్ మధ్య వివాదాల వల్ల షాహ్‌పూర్-కాండీ ఆనకట్ట పనులు ఏళ్ల నుంచీ ఆలస్యం అయ్యాయి. ఆగి-ఆగి జరుగుతున్నాయి

సింధు బేసిన్ ట్రీటీపై 1993 నుంచి 2011 వరకూ పాకిస్తాన్ కమిషనర్‌గా ఉన్న జమాత్ అలీ షా బీబీసీతో "భారత్ వాడుకోలేకపోయిన, నిల్వ చేసుకోలేకపోయిన జలాలు పాకిస్తాన్ వైపు వచ్చేవి. భారత్ వరద నీటిని కూడా నిల్వ చేయాలని, వాటిని ఉపయోగించుకోవాలని చెబుతోంది. ఎందుకంటే ఆ నీళ్లతో కూడా పాకిస్తాన్‌కు ప్రయోజనం లభిస్తుంది. ఎండిన నదుల రీచార్జింగ్ కూడా అవుతుంది" అన్నారు.

"నాకు ఈ ట్వీట్‌తో ఒకటి అర్థమైంది. వారు తమ జలాలను ఉపయోగించాలని అనుకుంటే, అలా చేయచ్చు. వారు దాచిపెట్టిన విషయాలను చెబుతున్నారు. నిజానికి ఏ నీళ్లను ఇప్పుడు ఉపయోగిస్తామని వారు చెబుతున్నారో, అలా చేయచ్చు"

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సింధు ప్రాజెక్ట్

ఉప నదుల జలాలు

పాకిస్తాన్‌ వైపు ప్రవహించే నీళ్లలో నదులే కాకుండా, ఉఝ్, తరనా లాంటి ఉప నదుల నీళ్లు కూడా ఉన్నాయి.

ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లోకి ఉఝ్, తరనా లాంటి ఉప నదుల జలాలు వస్తే, వాటిని ఉఫయోగించుకోవచ్చు. కానీ రాకపోతే పాకిస్తాన్ ఆ జలాల కోసం కేసు వేయలేదు అని జమాత్ అలీ షా చెప్పారు.

"పాకిస్తాన్ తన భాగంలో వచ్చిన నదులపై నిర్మించబోయే ఆనకట్టల గురించి ఆందోళన చెందుతోంది. దానివల్ల తమ వైపు వచ్చే జలాలపై ప్రభావం పడుతుందేమోనని భావిస్తోంది" అని ఆయన చెప్పారు.

"ఇది వారి(భారత్) సొంత బలహీనత, వాటిని సరిదిద్దుకోవాలని వారు అనుకుంటే, అలా చేయవచ్చు" అని ఆయన చెప్పారు.

ట్వీట్స్ టైమింగ్

పుల్వామా దాడి తర్వాత ప్రతీకార చర్యలు చేపట్టాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చాలా ఒత్తిడి ఉన్న సమయంలో నితిన్ గడ్కరీ ఈ ట్వీట్ చేశారు.

ఇలాంటి సమయంలో పాత విషయాలను పునరావృతం చేయాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ది హిందూ సీనియర్ విలేఖరి సుహాసిని హైదర్ తన ట్విటర్‌లో ఉడీ దాడి తర్వాత ప్రభుత్వం మన భాగం జలాలను పాకిస్తాన్ వైపు వెళ్లనివ్వకూడదనే నిర్ణయం తీసుకుంది. దానిపై చర్యలెందుకు తీసుకోలేదు అన్నారు.

ఫొటో సోర్స్, Twitter

"ఉడీ దాడి(2016 సెప్టంబర్) జరిగినపుడు ప్రభుత్వం మూడు ప్రకటనలు చేసింది. భారత్ భాగానికి వచ్చే జలాలను ఉపయోగించుకోడానికి ఆనకట్టల పనులు వేగవంతం చేయడం, రెండోది ప్రాజెక్ట్స్ రివ్యూ, మూడోది ఇండస్ వాటర్ కమిషన్‌తో చర్చలు జరపడం ఆపేయడం. కానీ కొన్ని నెలల తర్వాత చర్చలు మళ్లీ మొదలయ్యాయి" అన్నారు.

"నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కానీ మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు వివేకంతో వ్యవహరించాలి. దానివల్ల రెండు దేశాల మధ్య విశ్వసనీయత మరింత దెబ్బతినకుండా ఉంటుంది" అని జమాత్ అలీ షా చెప్పారు.

"రావి, బియాస్ లింక్ కెనాల్ ద్వారా పంజాబ్, రాజస్థాన్‌కు నీళ్లు చేర్చడం అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అవుతుంది" అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌కు చెందిన డాక్టర్ ఉత్తమ్ కుమార్ సిన్హా తెలిపారు.

ఫొటో సోర్స్, EPA

పాకిస్తాన్ వెళ్లే జలాలను భారత్ ఆపగలదా

యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినపుడు వాణిజ్యం లాంటి వాటిని ఆయుధంలా ఉపయోగించవచ్చు, అలాంటప్పుడు నదీ జలాలను కూడా అదే విధంగా వాడచ్చని సిన్హా తెలిపారు.

"మనం అలా చేయగలం అని నాకు నిజంగా అనిపించడం లేదు. ఎందుకంటే నదులకు తమదైన ప్రవాహం ఉంటుంది. కానీ దీని గురించి సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒప్పందం ప్రకారం మనం ఉపయోగించకోని మన భాగం జలాలను వాడుకోవడం మాత్రమే చేయగలం" అన్నారు.

ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం, దీనిని పక్కనపెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా ప్రజలు పరస్పరం కలిసిపోవడం కోరుకుంటున్నప్పుడు, ఇలాంటి మాటలను ఎవరూ ఇష్టపడరు అని జమాత్ అలీ షా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)