ఆర్టికల్ 370 అంటే ఏంటి? కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన ఈ ఆర్టికల్ రద్దు సాధ్యమేనా?
- కీర్తీ దూబే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 14న జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
ఈ దాడి గురించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 'ఆర్టికల్ 370' గురించి మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది.
సోమవారం (ఫిబ్రవరి 18) విదేశాంగ సహాయ మంత్రి, మాజీ సైనిక చీఫ్ జనరల్ వీకే సింగ్ "జమ్ము-కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించడంపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాలి" అన్నారు.
కానీ దానికి ముందు మనం అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఎందుకు?, అది ఇంత వివాదాస్పదం ఎందుకవుతోంది?. జమ్ము-కశ్మీర్ కోసం రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370 ఎలా ఉనికిలోకి వచ్చింది
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదాను ఇస్తుంది.
1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్ము-కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు.
ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
జమ్ము-కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్ వచ్చింది.
1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. 1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370 అంటే ఏంటి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అనేది నిజానికి కేంద్రంతో జమ్ము-కశ్మీర్‌కు ఉన్న బంధం గురించి చెబుతుంది. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చలు జరిపిన తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని జోడించారు.
ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్ము-కశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370లోని నిబంధనలు
జమ్ము-కశ్మీర్ రాజ్యాంగంలో సెక్షన్ 35ఎ ఉంది. అది శాశ్వత నివాసి నిబంధనలను ప్రస్తావిస్తుంది. ఇది ఆర్టికల్ 370లో భాగం కూడా. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్లో భారత్‌కు చెందిన ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారెవరూ భూములు, ఎలాంటి ప్రాపర్టీలూ కొనలేరు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేసే నిబంధన ఉంది. కానీ అది జమ్ము-కశ్మీర్లో పనిచేయదు.
దీనితోపాటు 370 కింద దేశ రాష్ట్రపతి జమ్ము-కశ్మీర్లో ఆర్థిక అత్యవసర స్థితి అమలు చేయలేరు. ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో అత్యవసర స్థితిని అమలు చేయవచ్చు.
అందుకే రాష్ట్రంలో అశాంతి, హింస లాంటివి జరిగినప్పుడు రాష్ట్రపతి స్వయంగా అక్కడ అత్యవసర స్థితి విధించలేరు. రాష్ట్రం నుంచి దానికి సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఆయన అలా చేయాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370ని రాజ్యాంగం నుంచి తొలగించడం సాధ్యమేనా
ఆర్టికల్ 370ని తొలగించడానికి సంబంధించి 2015 డిసెంబర్లో సుప్రీంకోర్ట్‌లో ఒక పిటిషన్‌పై విచారణ జరిగింది. అప్పుడు "దీనిని రాజ్యాంగం నుంచి తొలగించే నిర్ణయం పార్లమెంటు మాత్రమే తీసుకోగలదని" కోర్టు స్పష్టం చేసింది.
అప్పటి చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ధర్మాసనం "అది కోర్టు పనా, ఈ ఆర్టికల్ తొలగించడం, లేదా ఉంచడంపై నిర్ణయం తీసుకోవాలని మీరు పార్లమెంటుకు చెప్పగలరా. అది చేయడం ఈ కోర్టు పని కాదు" అని వ్యాఖ్యానించింది.
రాజ్యాంగంలోని పార్ట్ 21లో 'తాత్కాలిక నిబంధన' అనే శీర్షిక ఉన్నప్పటికీ, ఆర్టికల్ 370 ఒక 'శాశ్వత నిబంధన' అని జమ్ము-కశ్మీర్ హైకోర్ట్ 2015లోనే చెప్పింది.
ఆర్టికల్ 370 మూడో విభాగం ప్రకారం దానిని ఉపసంహరించడంగానీ, సవరించడంగానీ కుదరదని కోర్టు తెలిపింది.
"రాష్ట్ర చట్టం 35ఎను అది సంరక్షిస్తుంది. జమ్ము-కశ్మీర్ మిగతా రాష్ట్రాల్లా భారత్‌లో కలిసి లేదు. అది భారత్‌తో ఒప్పంద పత్రంపై సంతకం చేసేటప్పుడే, ఒక పరిధి వరకూ తన సౌర్వభౌమాధికారాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకుంది" అని హైకోర్ట్ వివరించింది.
భారత రాజ్యాంగం ఉన్నా జమ్ము-కశ్మీర్‌కు తనకంటూ ప్రత్యేక రాజ్యాంగం ఉంది. అందులోని సెక్షన్ 35ఎ గురించి చాలాసార్లు చర్చ జరిగింది. ఆ చట్టం ప్రకారం ఈ రాష్ట్రంలో బయటి రాష్ట్రాలకు చెందిన ఎవరూ భూములు-ఆస్తులు కొనలేరు.
ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి
2014లో లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన మ్యానిఫెస్టోలో ఆర్టికల్ 370ని తొలగిస్తామని చెప్పింది.
బీజేపీ ఈ ఆర్టికల్‌ను చాలా కాలం నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ తర్వాత ప్రభుత్వం దానిపై మౌనం పాటించింది.
బీజేపీ ఆర్టికల్ 370ని "రాజ్యాంగ నిర్మాతలు చేసిన పొరపాటు"గా చెబుతుంది.
జమ్ము-కశ్మీర్‌లోని ప్రముఖ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ వైఖరి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది.
ఫొటో సోర్స్, AFP
2014లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా "370 భారత్, జమ్ము-కశ్మీర్ మధ్య బంధానికి ఒక లింకు లాంటిది. ఉంటే ఆర్టికల్ 370 అయినా ఉండాలి లేదంటే భారత్‌లో కశ్మీర్ భాగం కాకుండా అయినా ఉండాలి" అన్నారు.
370ని వ్యతిరేకించేవారిని ఉద్దేశించి మాట్లాడిన పీడీపీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ "ఆర్టికల్ 370 అనేది జమ్ము-కశ్మీర్‌కు దేశం ఇచ్చిన ఒక మాట లాంటిది. అందుకే, జమ్ము-కశ్మీర్ ప్రజలకు ఇచ్చిన ఆ మాటను గౌరవించాల్సి ఉంటుంది" అన్నారు.
అంటే "ఆర్టికల్ 370 మాత్రమే జమ్ము-కశ్మీర్‌ను భారత్‌కు కలుపుతోందని" ఆమె భావించారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 రద్దు: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- కశ్మీర్ LIVE: జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు.. రాజ్యసభలో బిల్లు, తీర్మానం ప్రవేశపెట్టిన హోం మంత్రి అమిత్ షా
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- జైష్-ఎ-మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ ఎవరు?
- #BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?
- ‘నేను ఇస్లాం మతాన్ని వదిలేశా.. నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటోంది’
- కశ్మీర్: ప్రజాభిప్రాయ సేకరణను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- అంతర్జాతీయ న్యాయస్థానం: దేశాల మధ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తుంది?
- పుల్వామా దాడి: ఈ స్థాయిలో పేలుడు పదార్థాలు పాక్ నుంచి భారత్‌లోకి తేవడం సాధ్యమేనా
- గూగుల్: ‘టాయిలెట్ పేపర్’ అని వెదికితే పాక్ జెండా ప్రత్యక్షం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)