రాహుల్‌గాంధీ: ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’

రాహుల్ గాంధీ తిరుపతి సభ

ఫొటో సోర్స్, Inc/fb

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది కేవలం ఒక ప్రధాని ఇచ్చిన వాగ్దానంగా తాను భావించట్లేదని, దేశంలోని ప్రతి పౌరుడు ఇచ్చిన వాగ్దానంగా భావిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ భరోసాయాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏశక్తి అడ్డుకోలేదని అన్నారు.

‘‘సాక్షాత్తు భారత ప్రధాని హామీ ఇచ్చారంటే దేశంలోని ప్రజలందరూ ఇచ్చినట్లే, ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని మోదీ నెరవేర్చకపోయినప్పటికీ మేం నెరవేరుస్తాం. ఏపీకి ప్రధాని ఇచ్చిన అన్ని హామీలను తమ పార్టీ అధికారంలోకి రాగానే నేరవేరుస్తుంది.’’ అని తెలిపారు.

‘‘ఐదేళ్ల కిందట ఇదే తిరుపతి వేదిక మీద మోదీ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు 10 ఏళ్లు కావాలన్నారు. ప్రతిపేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని, ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని ఇదే తిరుపతి వేదిక మీద చెప్పారు. కానీ, ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదు.’’ అని విమర్శించారు.

ఫొటో సోర్స్, Inc/fb

అచ్చేదిన్‌ ఎక్కడ?

హమీలు నెరవేర్చకుండా మోదీ అబద్దాలు ఆడుతున్నారని రాహుల్ విమర్శించారు. ఎన్నికల వేళ తమ ప్రభుత్వం వస్తే అచ్చే దిన్‌‌లు వస్తాయన్న మోదీ తన ఆత్మీయులకే దేశ సంపద దోచిపెడుతున్నారని అన్నారు. రాజకీయాల్లో మనం ఎటుపోతున్నామో యువత ఆలోచించాలి అని సూచించారు.

‘‘అవినీతి అంతానికి ప్రధానిగా కాకుండా కాపలాదారుగా కృషి చేస్తానని మోదీ అన్నారు. కానీ, రఫేల్‌ కుంభకోణంలో అనిల్‌ అంబానీకి కోట్లు దోచిపెట్టారు'' అని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఏం చెపుతుందో అది చేసి చూపిస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం, భూసేకరణ చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు.

బడా పారిశ్రామిక వేత్తలకు మూడున్నర లక్షల రూపాయిల రుణ మాఫీ చేసిన మోదీ సర్కార్ రైతుల రుణాన్ని మాత్రం మాఫీ చేయడం లేదని విమర్శించారు.

ఫొటో సోర్స్, Inc/fb

‘రాష్ట్రానికి రాహుల్ ఇచ్చే ఏకైక హమీ అదొక్కటే’

రాష్ట్రానికి సంబంధించి రాహుల్ గాంధీ చేయగలిగిన ఏకైక హామీ ప్రత్యేక హోదా ఒక్కటేనని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు జింకా నాగరాజు విశ్లేషించారు.

‘‘మిగతా ఏ హామీ ఇచ్చినా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేఅవకాశం లేదు కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు కలిగించే హమీలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిది. కాబట్టి అధికారంలోకి వస్తే మొదటి సంతకంచేస్తామనో రెండో సంతకమో చేస్తామని హమీ ఇవ్వవచ్చు. ఈ విషయం మీద రాహుల్ ఎంత గట్టిగానైనా మాట్లాడతారు. దీని వల్ల ఒక ప్రయోజనం ఉంది, ప్రత్యేక హోదా మీద మొండిచేయి చూపిన మోదీని ఆంధ్రుల మధ్య అపకీర్తి పాలు చేయవచ్చు అనేది ఆయన వ్యూహం.’’ అని ఆయన తెలిపారు.

‘‘చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఉద్యమంలాగా క్యాంపెయిన్ చేయడం వెనక ఉండే లక్ష్యం కూడా రాష్ట్రానికి మోదీ ద్రోహం చేశాడని ప్రజలలో అపకీర్తి పాలుచేయమే. దీనితో టీడీపీకి రెండు ప్రయోజనాలు నెరవేరతాయి. ఒకటి తెలుగువారిని మోసం చేశాడని మోదీని అపకీర్తిపాలు చేయవచ్చు. రెండు అలాంటి అన్ పాపులర్ మోదీతో చేతులు కలిపేందుకు వైసీపీ కూడా వెనకాడేలా చేయడం. ఈ విషయంలో కాంగ్రెస్ కు, టీడీపీకి చాలా సారూప్యం ఉంది. అందుకే వారు గతం మరచిపోయి బాగా దగ్గరవుతున్నారు.’’ అని జింకా నాగరాజు విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)