‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’: Fact Check

భారత సైన్యం

ఫొటో సోర్స్, AFP

"పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్లు వీరు" అంటూ పాతిక మందికి పైగా మృతదేహాలతో ఉన్న ఓ గ్రాఫిక్ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

నిజమే, కశ్మీర్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగి 40కి పైగా జవాన్లు చనిపోయిన తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు.

ఆ గ్రాఫిక్ ఫొటోను చాలా మితవాద ఫేస్‌బుక్ గ్రూపులు షేర్ చేస్తూ, భారత సైన్యం ఈ పని చేసిందంటూ రాశాయి. కానీ ఆ చిత్రం చాలా పాతది. ఆ చిత్రానికి, పుల్వామా దాడికి ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, ఆ ఫొటో పాకిస్థాన్‌కు చెందినది, భారత్‌ది కాదు.

సందర్భంతో సంబంధం లేకుండా ఆ ఫొటోను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ అయింది.

అది ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు చెందిన బాసిత్ షా 2014 డిసెంబరు 19న తీసిన ఫొటో అని మా పరిశీలనలో గుర్తించాం.

ఆ చిత్రంలో ఉన్న మృతదేహాలు తాలిబన్లవిగా భావిస్తున్నారు. 2014 డిసెంబరు 16న పాకిస్థాన్‌లోని ఓ స్కూలుపై తాలిబన్ మిలిటెంట్లు చేసిన దాడిలో 132 మంది విద్యార్థులతో పాటు మొత్తం 141 మంది మరణించారు. దీంతో పాకిస్థాన్ సైన్యం వాయవ్య హంగు ప్రాంతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మృతిచెందినవారి దేహాలే ఆ చిత్రంలో ఉన్నాయని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మెరుపు దాడులకూ అదే చిత్రం

2016లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేపట్టినట్లుగా చెబుతున్న మెరుపు దాడుల సమయంలో కూడా ఆ చిత్రాన్ని ఉపయోగించారు. కశ్మీర్లోని సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ పెష్‌మెగ్రా సైన్యం ఆరు గంటల వ్యవధిలో 120 మంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లను హతమార్చిందంటూ ఓ బ్లాగులో కూడా అదే చిత్రాన్ని ఉపయోగించారు. పెష్‌మెగ్రా దళాలపై బీబీసీ కూడా సమగ్ర కథనం ప్రచురించింది.

ఈజిప్టుకు చెందిన 21 మంది క్రైస్తవులను తలలు నరికి హత్యచేయడానికి ప్రతీకారంగా 2015 ఫిబ్రవరిలో లిబియాపై ఈజిప్టు చేసిన వైమానిక దాడుల సమయంలోనూ అదే ఫొటోను వాడారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం వారంరోజులుగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ప్రకటించుకుంది.

ఈ దాడి అనంతరం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు పాకిస్థాన్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచడం వంటి ఇతర చర్యలనూ చేపట్టింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)