భారత్‌లో 10 లక్షల గిరిజన కుటుంబాలను అడవుల నుంచి పంపించేస్తున్నారు.. ఎందుకు?
- సౌతిక్ బిశ్వాస్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
భారత్ 10 కోట్ల మంది గిరిజనులకు ఆవాసం.. ఓ చరిత్రకారుడి మాటల్లో చెప్పాలంటే వారు అణగారిన అల్పసంఖ్యాకులు.
ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో వీరు మనుగడ కోసం పోరాడుతూ దుర్భర జీవనం గడుపుతున్నారు.
దేశంలోని మొత్తం గిరిజన జనాభాలో 40 లక్షల మంది రక్షిత అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో సుమారు 500 వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీలు, 90 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇది భారతదేశ మొత్తం విస్తీర్ణంలో సుమారు 5 శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబర్ 13కి పూర్వం నుంచి అడవిలో నివిసిస్తున్న గిరిజనులకు వారి అనుభవంలో ఉన్న భూమిలో నివసించే హక్కుఉంటుంది. అడవుల్లోని ఇతర సంప్రదాయ తెగలు ఎవరైనా నివాసం ఉంటే వారు 2005 డిసెంబరు 13కి పూర్వం నుంచి మూడు తరాలు అక్కడ నివసిస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. అప్పుడే వారి ఆక్రమణలో ఉన్న అటవీ భూమిపై వారికి హక్కు ఉంటుంది. ఇక్కడ తరం అంటే చట్టంలో 25 ఏళ్లుగా తీసుకున్నారు. అంటే.. 2005 డిసెంబరు 13కి ముందు 75 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నవారై ఉండాలి.
ఫొటో సోర్స్, AFP
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10 లక్షల కుటుంబాలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది.
అటవీ హక్కుల కోసం వచ్చిన 40 లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17 రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీచేసింది.
మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈ రాష్ట్రాల్లో సుమారు 18 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు.
ఇదే సమయంలో 10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశించింది.
స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని ఎన్విరానమెంటల్ జర్నలిస్ట్ నితిన్ శేఠీ అన్నారు.
ఫొటో సోర్స్, AFP
10 లక్షలకు పైగా గిరిజన కుటుంబాలు జులై నెలాఖరు నాటికి అడవుల నుంచి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది.
అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని.. అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషనర్లలో ఒకరైన వైల్డ్ లైఫ్ ట్రస్ట్‌కు చెందిన ప్రవీణ్ భార్గవ్ అన్నారు.
గిరిజనానికి మద్దతుగా మాట్లాడుతున్నవారు మాత్రం ఈ చట్టం అమలు లోపభూయిష్ఠంగా ఉందంటున్నారు.
తాజా పరిణామాలన్నీ కొందరు పర్యావరణవేత్తలు, వైల్డ్ లైఫ్ యాక్టివిస్టుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడినవేనంటున్నారు వారు.
'క్యాంపెయిన్ ఫర్ సర్వైవల్ అండ్ డిగ్నిటీ' అనే న్యాయసేవల సంస్థ చెబుతున్న ప్రకారం చాలామంది దరఖాస్తులను అర్హత ఉన్నా తిరస్కరించారు. దీనికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టాన్ని కాపాడలేకపోవడమేనని వారు ఆరోపిస్తున్నారు.
కోర్టు ఆదేశాల కారణంగా ఇప్పుడు గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు మితిమీరుతాయన్న ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కోర్టు జులై 27 నాటికి అక్రమ నివాసులు అడవులను ఖాళీ చేయాలని ఆదేశించడంతో షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా ఉన్న, అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది.
గతంలో 2002, 2004 మధ్య అటవీ ఆక్రమణలను నిరోధించేందుకుగాను సుమారు 3 లక్షల మందిని అడవుల నుంచి ఖాళీ చేయించారని ఈ వ్యవహారాలపై అధ్యయనం చేసే సీఆర్ బిజోయ్ చెబుతున్నారు.
ఆ సమయంలో అకృత్యాలు జరిగాయని.. ఇళ్లను తగలబెట్టారని, పంటలను ధ్వంసం చేశారని, పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది మరణించారని బిజోయ్ వెల్లడించారు.
అడవుల్లో నివసించేవారికి మొదటి నుంచి యాజమాన్య హక్కులు పత్రసహితంగా లేకపోవడం, చట్టప్రకారం కల్పించాలన్నా కూడా అది అధికారులపై ఆధారపడి ఉండడంతో చాలామంది అనాదిగా అరణ్యాల్లోనే నివసిస్తున్నా కూడా ఆక్రమణదారులుగా మిగిలిపోతున్నారని బిజోయ్ ఒక డాక్యుమెంట్లో పేర్కొన్నారు.
అందుకే చరిత్రకారుడు రామచంద్రగుహ గిరిజనులు ఎంత దుర్బల జీవితం గడుపుతున్నారో చెప్పారు.
''దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు.. ఇనుము, బాక్సైట్ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి'' అంటారాయన.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్స్ 2019: నామినేషన్ పొందిన సినిమాలు, దర్శకులు, నటులు
- తెలంగాణ బడ్జెట్: రూ.1,82,017 కోట్లతో బడ్జెట్
- బెజవాడ గోపాల్‌రెడ్డి.. నుంచి కేసీఆర్ దాకా బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమత్రులు వీరే
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- అధ్యక్షుడు ట్రంప్‌పై కోర్టుకెక్కిన 16 అమెరికా రాష్ట్రాలు
- క్రిస్ గేల్: ప్రపంచకప్ తరువాత రిటైర్మెంట్
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)