ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు

  • 7 మార్చి 2019
ఓపియం పాపీ

''నాకు ఆరోగ్యం బాగలేదు.. మా ఆయన ఒక్కడే పొలం తిప్పలబడలేడు. ఊరక బీడు బెట్టుకోడమెందుకని గుత్తకడిగితే ఇచ్చినాము. వాళ్ళు పంటేసినారు.. తీరా కోతకొచ్చేటప్పుడు పోలీసొల్లు, ఆపీసర్లొచ్చి ఈ పంటేయగుడదు.. ఇది గసగసాల పంట.. మత్తుపదార్థం.. ఇదేచ్చే పెద్దకేసంటన్నారు’’ అంటూ వాపోయింది పెద్దింటి చిన్నక్క అనే మహిళ.

ఆమె కడపజిల్లా ఇడుపులపాయ మారుతీనగర్‌ నివాసి.

‘‘మాకేందెలుసు గుత్తకేసినోటోడు చెప్పలా. ఈ అథికార్లు ముందు చెప్పలా ఈ గసగసాలు పంటిట్టుంటాది.. ఇదేయగుడదు.. ఇదేచ్చే కేసైతాదని. ఈ పంటిట్టుంటాదని మా ఊళ్ళో ఎవురికి తెల్దు.. మాకు తెల్దు. ఇప్పుడు నిష్కార్ణంగా మావాళ్లను జెగిల్లో బెట్టినారు" అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.

రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాల్లో గసగసాల పంటను అక్రమంగా సాగు చేస్తున్నారంటూ ఇటీవల ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడప జిల్లా ఇడుపులపాయలో, అనంతపురం జిల్లా ముదిగుబ్బలో భూమిని కౌలుకుతీసుకొని గుట్టుగా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అతనితోపాటు భూ యజమాని అయిన చిన్నక్క భర్త శ్రీరాములును కూడా అరెస్టు చేసి ఎన్‌డీపీఎస్ - 1985 చట్టం కింద కేసులు నమోదు చేశారు.

కౌలుకుతీసుకొని గసగసాలు సాగుచేసిన నిందితులతో పాటు శ్రీరాములు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

గతంలోనూ ఉదంతాలు...

గతంలో (2015లో) చిత్తూరు జిల్లా మదనపల్లి, చౌడేపల్లి మండలాల్లో గసగసాలు సాగు చేశారని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు కొందరు భూయజమానులు, కౌలుదారులపై ఎన్‌డీపీఎస్ - 1985 చట్టం కింద కేసులు నమోదు చేశారు. అప్పట్లో కూడా భూయజమానులు తమకు గసగసాల మెుక్కనుండి నల్లమందు వస్తుందన్న విషయం కానీ.. ఈ పంట సాగు నిషేధమన్న విషయం కానీ తెలియదని వాపోయారు.

ఈ మెుక్కలు మెడిసినల్ ప్లాంట్ అని, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని, వీటి సాగువల్ల మంచి లాభాలు వస్తాయని, పంట తామే కొంటామని ఓ వ్యక్తి నమ్మబలకడంతో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి తాము మోసపోయామని రైతులు వాపోయారు.

ఇప్పుడు తాజాగా ఇడుపులపాయలోనూ ఇదే పునరావృతమైంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: స్థానిక రైతులు బీబీసీతో ఏమన్నారంటే..

గసగసాల సాగుపై నిషేధం ఉందని ఎందరికి తెలుసు?

అసలు సుగంధ ద్రవ్యాలలో ఒకటైన గసగసాల సాగుపై నిషేధం ఉందని ఎందరికి తెలుసు? గసగసాల కాయల నుండి నల్లమందు (ఓపియం) ఉత్పత్తి అవుతుందని, అది ప్రమాదకరమైనదని ఎంతమందికి తెలుసు?

మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అత్యంత కట్టుదిట్టమైన చట్టాలకు లోబడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ అధికారుల పర్యవేక్షణలో సాగు చేయాల్సిన నిషేధిత గసగసాల (ఓపియం పాపీ) పంటను రాయలసీమలో ఎలా సాగుచేశారు? అన్న అంశాలపై బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది.

భూ యజమానులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రైతులు, మండల, గ్రామ స్థాయిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను కలిసి వివరాలు సేకరించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తి రకమైన అంశాలు వెలుగు చూశాయి.

1985లో కేంద్ర ప్రభుత్వం చేసిన నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ చాలా కీలకమైనది. ఈ చట్టం గురించి, ఇందులో వివరించిన గసగసాల పంట సాగు గురించి అటు అధికారుల్లోనూ ఇటు రైతుల్లోనూ ఎలాంటి అవగాహన లేకపోటంతోనే అక్రమార్కులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.

గసగసాల పంటపై నిషేధం ఎందుకు?

సుగంధ ద్రవ్యాలలో ఒకటైన గసగసాల పంట సాగుపై అనేక దేశాలతో పాటు ఇండియాలోనూ నిషేధం ఉంది. గసగసాల కాయలనుండి మాదకద్రవ్యంగా ఉపయోగించే నల్లమందు మార్ఫిన్ ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం.

అయితే భారతదేశంలో మాత్రం వైద్య, శాస్త్రీయ అవసరాలకుగాను కేంద్ర ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది.

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రం దీని సాగుకు అధికారికంగా అనుమతిస్తోంది. ఈ పంట సాగు చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి.

ఎన్నో ఆంక్షలు, అధికారుల తనిఖీలు, పర్యవేక్షణలో దీనిని సాగు చేయవలసి ఉంటుంది. దిగుబడి మెుత్తాన్ని తప్పనిసరిగా సీబీఎన్ ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్మాలి.

దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపియం పాపీ సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా తీవ్రమైన నేరమవుతుంది.

నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే పది సంవత్సరాలకు పైగా జైలుశిక్ష, లక్షన్నర వరకు జరిమానా విధిస్తారు.

గసగసాల కాయలనుంచి నల్లమందు...

గసగసాల మెుక్కకు మెుదట ఆకర్షణీయమైన తెల్లటి లేదా లేత గులాబి రంగులో పూలు పూస్తాయి. పువ్వు మధ్యభాగంలో పిందె ఉంటుది. పిందె పెరిగి కాయగా మారుతున్న సమయంలో పువ్వు రేకులు రాలిపోయి కాయ మాత్రమే మిగులుతుంది.

గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో ఉండే ఈ కాయ లోపల గసగసాలు ఉంటాయి. కాయల పైభాగం మీద సున్నితంగా గాటు పెడితే చిక్కనైన తెల్లటి ద్రవం కారుతుంది. లేటెక్స్ వంటి ఈ ద్రవం బయటకు వచ్చిన వెంటనే బంకలాగా గట్టిపడి కాయలపైనే ఉండిపోతుంది.

ఆరిన తరువాత మరుసటి రోజుకు ఈ పదార్థం ముదురు గోధుమ రంగు లోనికి మారుతుంది. ఆలా రంగు మారిన తరువాత దీనిని చేతితో తయారు చేసిన ప్రత్యేక పరికరంతో కాయల పైభాగం నుండి అత్యంత జాగ్రత్తగా సేకరిస్తారు. దీనినే నల్లమందుగా పిలుస్తారు.

నల్లమందును దేనికి ఉపయోగిస్తారు?

ఈ నల్లమందు నేరుగా మనిషి కేంద్ర నాడీవ్యవస్థపై పనిచేస్తుంది. మత్తు కలిగించడం, నొప్పి తెలియకుండా చేయడం దీని ముఖ్య లక్షణం. మత్తుకు బానిసలైనవారు, శారీరక శ్రమచేసి తీవ్రమైన నొప్పులతో బాధపడేవారు.. ఆ నొప్పులు తెలియకుండా ఉండేందుకు దీనిని వాడుతారు.

కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలలో దీనిని ఉపయోగిస్తారు. వీటికి బానిసలై అనేకమంది జీవశ్ఛవాలుగా మారి చివరకు మ్రత్యువాత పడుతుండటంతో ప్రభుత్వం ఇందుకు కారకమైన గసగసాల సాగుపై నిషేధం విధించింది.

గసగసాల కాయల నుండి సేకరించే ఓపియంతో నష్టాలే కాకుండా లాభాలు కూడా ఉన్నాయి. నల్లమందును ఆరోగ్యకారకమైన కొన్ని రకాల ఔషధాల్లో కూడా వినియోగిస్తారు.

ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి మందుల్లో దీనిని వాడుతారు. దగ్గు మందులు, నొప్పితెలియకుండా చేయడానికి వాడే మందుల తయారీలోనూ వాడుతారు. ముఖ్యంగా తీవ్రమైన క్యాన్సర్ రోగులకు వాడే ఔషదాల్లో ఎక్కువగా వినియోగిస్తారు.

సాగుపై నిషేదం ఎత్తివేయాలన్న డిమాండ్

పంజాబ్, రాజస్థాన్‌లలో కొందరు నల్లమందుతో సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన తేనీటిని సేవిస్తారు.

ఈ నేపధ్యంలో గసగసాల సాగపై నిషేదం ఎత్తివేయాలన్న డిమాండ్ కూడా ఉంది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ లాంటి కొందరు ఎంపీలు దీనిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు.

కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలతో పోల్చితే ఇది అంత ప్రమాదకరమైనది కాదన్నది వారి వాదన. ప్రాణాపాయ స్థితిలో తీవ్రమైన బాధలు అనుభవిస్తున్న తన సమీప బంధువు ఒకరు రోజూ ఓపియం తీసుకోవటం మెుదలు పెట్టాక.. బాధలు తెలియకుండా అనేక సంవత్సరాలు జీవించాడని నవజ్యోత్ సింగ్ సిద్దూ గతంలో ప్రకటించాడు.

ఇదే విషయాన్ని అప్పట్లో కొన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

Image copyright Getty Images

నిషేధంపై రైతుల్లో ప్రభుత్వం అవగాహన కల్పించిందా?

దేశంలో గసగసాల పంట సాగును కేంద్ర ప్రభుత్వం 1985 లోనే నిషేధించినప్పటికీ దీనిపై రాయలసీమలోని అనేకమంది రైతుల్లో ఏమాత్రం అవగాహన లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.

ఇడుపులపాయకు చెందిన కోళ్ల భాస్కర్ బీబీసీతో మాట్లాడుతూ.. ''అనంతపురం జిల్లా నుంచి వచ్చామన్నారు. ఇక్కడ జిలకర బాగొచ్చాదని.. జిలకరేచ్చామని చెప్పి గుత్తకు అడిగినారు. ముసిలోల్లు కావడంతో సొంతగా చేసుకోల్యాక సరేనని గుత్తకిచ్చినారు. వాళ్లు జిలకరేచ్చామని తోటేసినారు. ఎక్సైజ్ వాల్లోచ్చి ఇది గసగసాల తోటని, డ్రగ్స్ అని, ఓపియమని చెప్పేంతవరకూ మాకెవరికి తెలియదు'' అని తెలిపారు.

''ఇక్కడ ఎప్పుడేగాని ఎవరేగాని జిలకర తోటలు, గసగసాల తోటలు ఎయ్యలేదు, చూడలేదు. కాబట్టి మేము జిలకరే అనుకున్యాం. గసగసాల పంట గురించి మండలంలోని అగ్రికల్చర్ ఆపీసర్లుగాని, రెవిన్యూ వాళ్లుగాని, ఎక్సైజ్ వాళ్లుగాని ఎవరు మాకు ముందే చెప్పల్యా. అవగాహన కల్పించల్యా. ముందే చెప్పింటే మోసపోయేవాల్లు కాదుగదా'' అని చెప్పారు.

Image copyright Getty Images

''మాకే తెలియదు.. రైతులకు ఎలా చెప్తాం?''

నిత్యం రైతులతో వారి సమస్యలతో మమేకమై సలహాలు, సూచనలు ఇస్తూ వారిని చైతన్యవంతులను చేయాల్సిన గ్రామ, మండలస్థాయి రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులను బీబీసీ కలిసింది.

అయితే.. గసగసాల పంట గురించి తనకేమీ తెలియదని గ్రామ రెవెన్యూ అధికారి నాగసుబ్బారెడ్డి చెప్పారు. ఈ పంట వేయకూడదని, వేస్తే కేసవుతుందన్న విషయం వ్యవసాయశాఖ అధికారులు కానీ, ఏఎస్‌ఓ కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ తనకు చెప్పలేదని.. శిక్షణ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అందుచేత తాను ఈ పంట గురించి ప్రజలకు చెప్పలేదని.. తనకే తెలియనపుడు తాను రైతులకెలా చెబుతానని ప్రశ్నించారు.

''వ్యవసాయ శాఖలో అధికారిక ఉత్తర్వులు లేవు''

పులివెందుల వ్యవసాయశాఖ ఉపసంచాలకుడు రమణారెడ్డిని వివరణ కోరగా.. తనకు తెలిసినంతవరకూ గసగసాల పంటను నిషేదించినట్లుగా కానీ, దానిపై రైతుల్లో అవగాహన కల్పించాలని కానీ వ్యవసాయశాఖలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని తెలిపారు.

జిల్లాలో ఈ పంట పండిచరు కాబట్టి దీనిపై అవగాహన లేదన్నారు. గసగసాలు వంటల్లో వాడుకొనే మసాలా దినుసుగా మాత్రమే తెలుసన్నారు.

క్షేత్రస్థాయకి వెళ్లే ఎంపీఈఓలకు జిల్లాలో పండించే పైర్లు వాటి సస్యరక్షణా చర్యలు, నీటియాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని.. గసగసాలు ఈ ప్రాంతంలో ఎప్పుడూ పండించరు కాబట్టి దానిపై శిక్షణ ఇవ్వటంలేదని రమణారెడ్డి తెలిపారు.

Image copyright Getty Images

‘‘పుస్తకాల్లో తప్ప ప్రత్యక్షంగా చూడలేదు’’

ఇదే విషయమై వేంపల్లి మండల ఉద్యానవన శాఖాధికారి రఘువేంద్రారెడ్డిని బీబీసీ ఫోన్‌లో సంప్రదించగా.. గసగసాల పంట గురించి కాలేజీ రోజుల్లో పుస్తకాలలో చదువుకున్నదేతప్ప ప్రత్యక్షంగా తానెప్పుడు ఆ పంటను చూడలేదని చెప్పారు.

పండగ రోజు భక్షాల్లో వేసుకుని తినటమే తప్ప పంట గురించి పెద్దగా అవగాహన లేదన్నారు.

ఉద్యానవనశాఖ తరపున గసగసాలపంట నిషేధం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలని ఎలాంటి ఆదేశాలూ లేవని పేర్కొన్నారు. ఆ బాధ్యత ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖదని రాఘవేంద్రారెడ్డి చెప్పారు.

''నిందితులు ఇడుపులపాయలో గసగసాలను మామిడిచెట్లలో అంతరపంటగా వేశారుకదా? మరి జియెట్యాగింగ్, ఈ-పంట కోసం మీ సిబ్బంది గాని మీరుగాని ఆ తోటకు వెళ్లివుంటారు కాబట్టి ఆ తోటను అందులోని అంతర పంటను ఏమని రికార్డు చేశారు?'' అని బీబీసీ ప్రశ్నించింది.

''ఈ - పంట ఇంకా పూర్తికాలేదు.. కొనసాగుతోంది. మీరు చెప్పిన ఆ భూమికి ఇంకా పోలేదు రికార్డు చేయలేదు'' అని ఆయన బదులిచ్చారు.

‘‘న్యాయాన్యాల గురించి కోర్టు చూసుకుంటుంది’’

ఇదిలావుంటే.. జిల్లాలో గసగసాల పంట వెలుగుచూడటం ఇదే మొదటిసారి అని అందుచేత గతంలో దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం రాలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

ఇడుపులపాయ ఘటనలో అరెస్టయిన భూయజమానులకు కూడా గసగసాల పంట గురించి తెలియదని, జిలకర పంటకని గుత్తకిచ్చి మెుసపోయినట్లుగా తమ ప్రాధమిక విచారణలో తేలిందని ఆయన వివరించారు.

''మరి గసగసాల పంట నిషేదం గురించికాని, ఎన్డీపీఎస్ యాక్టు గురించిగాని రైతుల్లో ముందుగా ఏమాత్రం అవగాహన కల్పించకుండా కౌలుకిచ్చిన భూయజమానులను అరెస్టు చేయటం ఎంతవరకు సమంజశం?'' అని బీబీసీ ప్రశ్నించింది.

దీనికి.. ''నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా గసగసాల పంట సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా తీవ్రమైన నేరమవుతుంది. చట్టంలో అలా ఉంది కాబట్టి చట్టప్రకారం అరెస్టు చేశాం. ఇక న్యాయాన్యాయాల గురించి కోర్టు నిర్ణయిస్తుంది'' అని ఇన్‌స్పెక్టర్ సమాధానం చెప్పారు.

''ప్రభుత్వం, అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించకపోవటం వల్లే అమాయక రైతులు మెుసపోయారుకదా. మరి దీనికెవరు బాధ్యత వహించాలి?'' అన్న మరో ప్రశ్నకు.. ''ఇప్పుడు దీన్ని గుర్తించాం కదా. ఇకపై గ్రామల్లో రైతులకు అవగాహన కల్పిస్తాం'' అని అంటూ ఆయన సమాధానం దాటవేశారు.

Image copyright Getty Images

''అవగాహన కల్పించకుండా అరెస్ట్ చేయటమేంటి?''

ప్రభుత్వ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గసగసాల పంట ఈ విధంగా ఉంటుందని, దీని సాగు నిషేధమని, దీనిని పండించడం నేరమని ఇప్పటివరకూ వ్యవసాయశాఖ గాని, ఉద్యానశాఖ గాని, రెవెన్యూశాఖ గాని, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గాని రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ప్రచారం చేసిన ధాఖలాలు లేవని ఆ సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు.

''సంబంధిత అధికారులకే తెలియని విషయాలు అమాయక రైతులకు ఎలా తెలుస్తాయి?'' అని ఆయన ప్రశ్నించారు. చట్టం చేయటంతోనే ప్రభుత్వ భాద్యత తీరిపోదని దానిపట్ల ప్రజలందరిలో అవగావాన కల్పించాల్సిన భాద్యత కూడా ఉంటుందని గుర్తుచేశారు.

రైతుల్లో అవగాహన కల్పించకుండానే చట్టం పేరుతో అమాయక భూయజమానులపై నేరాలు మోపి రిమాండుకు పంపటం సరికాదన్నారు. ఎవరైతే అన్నీ తెలిసి పథకం ప్రకారం అనేక ప్రాంతాల్లో కౌలుకుతీసుకొని గసగసాలు పండించారో అలాంటివారిని కఠినంగా శిక్షించడంలో తప్పులేదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు నిషేధిత పంటలపై గ్రామ, మండలస్థాయి అధికారులతో అవగాహన కల్పించాలని చంద్ర డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)