అనిల్ అంబానీ సంపద 45 బిలియన్ డాలర్ల నుంచి 2.5 బిలయన్ డాలర్లకు ఎలా తరిగిపోయింది?

  • ఆలం శ్రీనివాస్
  • సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
అనిల్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

2007లో అంబానీ సోదరులు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో అగ్రభాగంలో నిలిచారు. ముఖేశ్ అంబానీ 49 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో ముందువరసలో నిలిస్తే ఆయన తర్వాతి స్థానంలో 45 బిలియన్ డాలర్లతో అనిల్ అంబానీ ఉన్నారు.

2008 నాటికి అనిల్ తన సోదరుడిని మించిపోతారని చాలా మంది భావించారు. రిలయన్స్ పవర్‌ను పబ్లిక్ ఇష్యూకు తీసుకరావడంతో అందరూ అలానే అంచనా వేశారు.

అనిల్ అంబానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టులో ఒక్క షేరు ధర భవిష్యత్తులో రూ.వెయ్యికి చేరుతుందని చాలా మంది నమ్మారు. అది జరిగి ఉంటే, అనిల్ అంబానీ చాలా త్వరగానే ముఖేశ్ అంబానీని దాటిపోయేవారు. కానీ, అలా జరగలేదు.

మరోసారి 2018 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాకు వస్తే ముఖేశ్ అంబానీ సంపద కాస్తంత తరిగింది. ప్రస్తుతం ఆయన సంపద 47 బిలియన్ డాలర్లగా ఉంది. కానీ, 12 ఏళ్ల కిందట 45 బిలియన్ డాలర్ల సంపద ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు బాగా వెనుకబడి పోయారు. ప్రస్తుతం ఆయన సంపద 2.5 బిలయన్ డాలర్లకు పడిపోయింది. బ్లూంబర్గ్ ఇండెక్స్ ఆయన ప్రస్తుత సంపదను 1.5 బిలియన్ డాలర్లగా లెక్కగట్టింది.

ధీరూభాయి అంబానీ వారసులు ఒకేలా ఉన్నారని నిరూపించడానికి ఇద్దరు సోదరులు మొదట్లో పోటీ పడ్డారు. కానీ, ఇప్పుడు రేసు ముగిసింది. అనిల్ అంబానీ పోటీ నుంచి వైదొలగారు.

ఫొటో సోర్స్, Getty Images

అంచనాలు తారుమారు...

దశాబ్దం కిందట దేశంలోని అత్యధిక ధనవంతుల్లో అనిల్ ఒకరు. దూరదృష్టి, దూకుడుతో ఉండే ఆయన 21వ శతాబ్దపు వ్యాపారవేత్తగా ఎదుగుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఆయన సారథ్యంలో దేశంలో ఒక మల్టీ నేషనల్ కంపెనీ ఎదుగుతుందని అనుకున్నారు. ప్రపంచమంతా ఆయన వెంటే నడిచింది. మరికొన్ని మెట్లు ఎక్కితే ఆయన అత్యధిక ధనవంతులయ్యేవారు. కానీ, అది నెరవేరలేదు.

పదేళ్ల వ్యవధిలోనే దేశంలో విఫలమైన భారతీయ వ్యాపారవేత్తల చరిత్రలో ఆయన ఒకరిగా చోటు సంపాదించుకున్నారు. 45 బిలియన్ డాలర్ల సంపద పదేళ్లలో కరిగిపోవడం చిన్న విషయం కాదు. ఆయన కంపెనీలో షేర్లు కొన్న వారికి పూడ్చుకోలేని నష్టం అది.

ప్రస్తుతం అనిల్ అప్పుల్లో కూరుకపోయారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి కూడా ఆయనకు లేదు. ధీరూభాయి అంబానీ 2002లో చనిపోయారు. ఆయన హయాంలో నాలుగు ముఖ్యమైన అంశాలను వేదికగా చేసుకొని కంపెనీ ఎదిగింది.

అవి భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడం, ప్రభుత్వంతో చక్కటి సమన్వయం ఉండటం, మీడియాను మేనేజ్ చేయడం, మదుపుదారుల నమ్మకాలను నిలబెట్టుకోవడం. ఈ నాలుగు అంశాలతో అంబానీ వ్యాపార సామ్రాజ్యం ఎదిగింది. ధీరూభాయి పెద్దకొడుకు ముఖేశ్ అంబానీ అవే సూత్రాలను పాటిస్తూ ముందుకుసాగారు. ఈ విషయంలో అనిల్ విఫలమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

అంతా అయిపోయింది

‘ఎకనామిక్ వేవ్’(ఆర్థిక తరంగం) మీద తాము సవారీ చేస్తున్నామని ధీరూభాయి అంబానీ ఎప్పుడూ నమ్మేవారు. ఆ తరంగాన్ని ఆయన ఒడుపుగా పట్టుకోగలిగారు. దాని నుంచి ఎప్పుడూ పడిపోలేదు. దీనిర్థం ఏమిటంటే మిగిలిన వ్యాపారుల నుంచి పోటీని తట్టుకుంటూ నిలబడాలంటే అవసరమైన మరింత డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే పోటీని తట్టుకోగలం. ఇదే అంబానీ సూత్రం. అందువల్లే రిలయన్స్ ఎప్పుడూ ఉన్నత స్థితిలో నిలిచింది. మదుపుదారులు అంచనాలను అందుకోగలిగింది.

2007-2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల ముఖేశ్ వెనుకబడ్డారు. ఆయన సంపద 60 శాతం పడిపోయింది. కానీ, ఆ చీకటి సమయం నుంచి ఆయన బయటపడ్డారు. తిరిగి ముందుకు సాగారు. అదే పరిస్థితిని చవిచూసిన అనిల్ ఇప్పటికీ తడబడుతూనే ఉన్నారు. దీనికంతటికి ప్రధాన కారణం ఆయన దగ్గర పాలిచ్చే ఆవు లేకపోవడమే.

2005లో ఇద్దరు సోదరుల మధ్య ఆస్తుల పంపకాలు జరిగాయి. అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేశ్ అంబానీకి చెందితే, భవిష్యత్తులో ఎక్కువ అభివృద్ధికి ఆస్కారం ఉన్న టెలికాం ఇండస్ట్రీ అనిల్ వశం అయింది. కానీ, టెలికాం అభివృద్ధికి భారీగా నిధులు కావాలి. ఇక అనిల్ కు వచ్చిన రిలయన్స్ పవర్ పరిస్థితి అలాంటిదే. అదేమీ పెద్ద కంపెనీ కాదు. దాన్ని నడపాలంటే భారీగా పెట్టుబడి కావాలి. రిలయన్స్ ఫైనాన్ సర్వీస్ వ్యాపార విషయాలకు సంబంధించినది మాత్రమే. ఇవన్నీ కలిపినా కూడా ఆయన సోదరుడికి వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సమానం కావు.

ముఖేశ్ అంబానీ వ్యాపారాలు సందను సృష్టిస్తుంటే, అదే సమయంలో అనిల్ అంబానీ సంస్థలు నడపడానికి సంపద కావాల్సిన పరిస్థితి వచ్చింది.

అనిల్ అంబానీ వ్యాపార క్రీడలో గుడ్డి ఆటగాడేమీ కాదు. తన కంపెనీకీ ముకేశ్‌కు వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీ నుంచే తక్కువ ధరకు గ్యాస్ సరఫరా చేయాలని పంపకాల సమయంలో షరతు విధించారు. తన పవర్ ప్లాంట్‌కు ఆ గ్యాస్ ఉపయోగించి ఎక్కువ లాభం పొందవచ్చని ఆయన ఆలోచన. కానీ, రాజకీయాలు, కోర్టు తీర్పుల కారణంగా ఆయన ప్రణాళిక ముందుకుసాగలేదు.

కేంద్రప్రభుత్వం, ముఖేశ్ కోర్టుకు వెళ్లారు. చమురు, గ్యాస్ దేశ సంపద అని 2010లో కోర్టు తీర్పునిచ్చింది. వాటిని ఎవరికి, ఏ ధరల్లో అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొంది. ఈ తీర్పుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని పవర్ ప్లాంట్‌లకు గ్యాస్‌ను అమ్మేందుకు మార్గం సుగమమైంది.

ఈ తీర్పు అనిల్‌ను దెబ్బతీసింది. ఎక్కువ ధరకు మార్కెట్‌లో చమురును కొనే పరిస్థితి వచ్చింది. ఆయన పెట్టుబడి ప్రణాళికలన్నీ విఫలమయ్యాయి. ఆ తర్వాత రిలయన్స్ పవర్‌ను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చారు. కానీ, ఆ షేర్లు మొదట బాగానే ఉన్నా తర్వాత దారుణంగా పడిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమైన అప్పులు..

1980 నుంచి 1990 మధ్యలో ధీరూభాయి అంబానీ ఆర్‌ఐఎల్ గ్రూప్ పేరుతో మార్కెట్‌లో వ్యాపారం చేసేవారు. అప్పుడు వారి షేర్ల ధరలు కూడా బాగుండేవి. మదుపుదారులు కూడా స్థిరంగా ఉండేవారు.

వ్యాపారాలు తన చేతికి వచ్చాక ముఖేశ్ అంబానీ వాటిని భారీగా విస్తరించారు. మరోవైపు కోర్టు నుంచి అనుకూల తీర్పులు రాకపోవడం, తన కంపెనీ షేర్లు పడిపోవడంతో అనిల్ ముందుకు వెళ్లడమే గగనమైంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే అనిల్ అంబానీ విదేశీ బ్యాంకులు, కంపెనీల నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ, సమర్థవంతంగా తన వ్యాపారాన్ని నడిపించలేకపోయారు.

నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ చట్టాల ప్రకారం రుణదాత తనకు అప్పు చెల్లించని వ్యక్తి కంపెనీల ఆస్తులపై కోర్టుకు వెళ్లవచ్చు. అందువల్లే అనిల్ అంబానీకి ఇప్పుడు వేరే మార్గం లేకుండా పోయింది. తన కంపెనీలు అమ్మడమో, దివాళా తీసినట్లు ప్రకటించడమో చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images

ఇద్దరు సోదరుల మధ్య ప్రత్యేకత

ధీరూభాయి అంబానీ బతికి ఉన్నప్పుడు ఫైనాన్స్ మార్కెట్‌లో అనిల్ అంబానీని స్మార్ట్ ప్లేయర్‌గా అభివర్ణించేవారు. అప్పట్లో అన్న కంటే అనిల్‌కే ఎక్కువ పేరు ఉండేది.

అయితే, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మీద దృష్టి పెట్టిన అనిల్... సోదరుడు ముఖేశ్ మాదిరిగా భారీ ప్రాజెక్టులను చేపట్టలేదని కొందరు విమర్శిస్తుంటారు.

రిలయన్స్ పవర్, టెలికాం రంగంలో అనిల్ చాలా సంపదను పోగొట్టుకున్నారు. కానీ, ఆయన దగ్గర ఉన్న రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇప్పటికీ మంచి స్థితిలోనే ఉన్నాయి. వాటి షేర్లు కూడా మంచి ధరల్లో ఉన్నాయి. దీన్ని బట్టి అనిల్ అంబానీ పని అయిపోయిందని భావించడం సరికాదని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆయన రేసులో ఉన్నారు.

ఆస్తి పంపకాల తగాదా సమయంలో ఇద్దరు సోదరులు ఒకరిపై ఒకరు బాగానే దాడి చేసుకున్నారు. ప్రభుత్వం, మీడియా కూడా చెరో వైపు ఉండేది. కానీ, నెమ్మదిగా మీడియాను ముఖేశ్ అంబానీ తనవైపు తిప్పుకున్నారు.

ఈ కొత్త యుద్ధంలో అనిల్ అంబానీ కొంతమంది కొత్త స్నేహితులను, కొత్త శత్రువులను సృష్టించుకున్నారు. కానీ, కీలకమైన రాజకీయ నేతలు, అధికారులు, పత్రికాధిపతులు ముకేశ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అనిల్ అంబానీ వైఫల్యానికి పరిస్థితులు, సొంత తప్పిదాలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)