ఆస్కార్ 2019: శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే భారతీయ యువతి కథ... 'పీరియడ్... ఎండ్ ఆఫ్ సెంటెన్స్'కు అవార్డు

  • గీతా పాండే
  • బీబీసీ ప్రతినిధి
డాక్యుమెంటరీ నిర్మాత, దర్శకులైన మెలిస్సా బెర్టన్, రేకా జెహతాబ్జీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డాక్యుమెంటరీ నిర్మాత మెలిస్సా బెర్టన్, దర్శకురాలు రేకా జెహతాబ్జీలు లాస్ ఏంజెలెస్‌లో ఆస్కార్ అవార్డు అందుకున్నారు

భారతదేశంలోని ఓ గ్రామంలో శానిటరీ ప్యాడ్లు తయారు చేసే ఒక యువతి మీద చిత్రీకరించిన డాక్యుమెంటరీ 'పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్' ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని కతికెరా గ్రామ నివాసి అయిన స్నేహ్ ఈ డాక్యుమెంటరీలో కథానాయకి.

ఆదివారం లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ డాక్యుమెంటరీగా 'పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్'ను ప్రకటించారు.

ఈ డాక్యుమెంటరీ నిర్మాత, దర్శకులైన మెలిస్సా బెర్టన్, రేకా జెహతాబ్జీలు అవార్డును అందుకున్నారు.

స్నేహ్‌ను బీబీసీ ప్రతినిధి గీతాపాండే కొద్ది రోజుల కిందట కలిశారు. ఆ వివరాలివీ...

''నేను పుష్పవతి అయినపుడు రక్తస్రావం చూసి, నాకేదో పెద్ద జబ్బు చేసిందని ఏడ్వడం మొదలుపెట్టాను. కానీ దీని గురించి అమ్మకు చెప్పడానికి నాకు ధైర్యం చాల్లేదు. అందుకే మా ఆంటీకి విషయం చెప్పాను. ఆమె.. 'భయపడకు. ఇదంతా మామూలే, ఇప్పుడు నువ్వు పెద్దమనిషివి అయ్యావు' అంటూ, మా అమ్మకు విషయం చెప్పింది'' అని 22 ఏళ్ల స్నేహ్ అన్నారు.

ఇప్పుడు స్నేహ్ వయసు 22. కతికెరా గ్రామంలో శానిటరీ ప్యాడ్స్ తయారుచేసే ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తున్నారు. అంతేకాదు, 'పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీలో ఈమె కథానాయకి కూడా.

దిల్లీకి సమీపంలోని కతికెరా గ్రామంలో స్నేహ్‌ను కలిసినపుడు, తన జీవితం గురించి, తమ గ్రామం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

నార్త్ హాలీవుడ్‌లోని కొందరు విద్యార్థులు చందాలు పోగు చేసి, ఒక శానిటరీ ప్యాడ్ తయారు చేసే యంత్రాన్ని, ఒక ఇరానియన్-అమెరికన్ దర్శకుడిని స్నేహ్ గ్రామానికి పంపారు.

దిల్లీకి 115 కి.మీ. దూరంలో, ధగధగమంటూ వెలిగిపోయే ఎలాంటి షాపింగ్ మాల్స్ లేని గ్రామం అది. హపూర్ జిల్లా కతికెరా గ్రామానికి చేరాలంటే దిల్లీ నుంచి 2.30 గంటల ప్రయాణం చేయాలి. కానీ హైవేలో మరమ్మతు పనుల వల్ల ప్రయాణానికి 4 గంటలు పట్టింది.

కతికెరా గ్రామ పంటపొలాల్లో, గ్రామ పాఠశాలలోని తరగతి గదుల్లో ఈ డాక్యుమెంటరీ తీశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఈ గ్రామంలో కూడా, మహిళల నెలసరి గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తున్నారు.

నెలసరి సమయాల్లో, మహిళలు అపవిత్రం అని భావించి, వారిని గుళ్లుగోపురాలకు, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు.

ఇలాంటి అపోహల మధ్య పెరిగిన స్నేహ్.. తను పుష్పవతి అయ్యేవరకూ మహిళల నెలసరి గురించి వినకపోవడంలో ఆశ్చర్యం లేదు.

కానీ.. పునరుత్పత్తికి చెందిన ఆరోగ్య సమస్యల గురించి పనిచేస్తున్న 'యాక్షన్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ, స్నేహ్ గ్రామంలో శానిటరీ ప్యాడ్ల తయారీ కేంద్రం స్థాపించాక పరిస్థితులు మారాయి.

నువ్వు కూడా శానిటరీ ప్యాడ్స్ ఫ్యాక్టరీలో పని చేస్తావా? అని యాక్షన్ ఇండియాతో కలిసి పనిచేసే సుమన్ ఓరోజు స్నేహ్‌ను అడిగారు.

'ఫ్యాక్టరీలో పని చేస్తావా అని సుమన్ నన్ను అడగ్గానే చాలా సంతోషమేసింది' అని.. డిగ్రీ పూర్తిచేసి, దిల్లీలో పోలీసుగా పని చేయాలని కలలుగనే స్నేహ్ చెప్పుకొచ్చారు.

''ఫ్యాక్టరీలో పని చేయడానికి మా అమ్మ అనుమతి కోరాను. ఆమె మా నాన్నను అడగమంది. మా ఇంట్లో అన్ని నిర్ణయాలూ మా నాన్నే తీసుకుంటారు. కానీ, ఫ్యాక్టరీకి వెళ్లి శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తానని మా నాన్నతో చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. అందుకే చిన్నపిల్లల డైపర్లు తయారుచేసేందుకు వెళ్తానని చెప్పాను.''

‘ఏదైనా పని పనేగా!’

''పనిలోకి చేరిన రెండు నెలల తర్వాత మా అమ్మ, నాన్నకు అసలు విషయం చెప్పింది. ఆయన 'పర్వాలేదులే.. ఏదైనా పనే కదా!' అన్నారు.

ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో 18 నుంచి 31సంవత్సరాల మధ్య వయసున్న ఆడవాళ్లు 8మంది పని చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారానికి 6రోజులు పని చేస్తారు.

వీరు నెలకు 2,500 రూపాయలు సంపాదిస్తారు. ఈ ఫ్యాక్టరీలో రోజుకు 600శానిటరీ ప్యాడ్లు తయారవుతాయి. వీటిని 'ఫ్లై' అనే పేరుతో మార్కెట్లో అమ్ముతారు.

''మేం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరెంటు కోత. ఈ సమస్య అధికంగా ఉన్నపుడు, మా లక్ష్యాలను చేరుకోవడానికి కొన్నిసార్లు రాత్రిళ్లు కూడా వచ్చి పని చేయాల్సి వస్తుంది'' అని స్నేహ్ అన్నారు.

రెండు గదుల్లో నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టరీ వల్ల ఇప్పుడు ఆ గ్రామ మహిళలకు ‘నెలసరి’ లాంటి అంశాల పట్ల అవగాహన పెరిగింది.

ఒకప్పుడు నెలసరి సమయాల్లో పాత గుడ్డలు, పాత చీరల గుడ్డముక్కలు వాడేవారు. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో 70%మహిళలు శానిటరీ ప్యాడ్లు వాడుతున్నారు.

అంతేకాకుండా, కొన్నేళ్ల క్రితం వరకూ మహిళల నెలసరి గురించి ఉన్న గ్రామస్తుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది.

నెలసరి గురించి గ్రామ మహిళలు ఇప్పుడు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని స్నేహ్ చెబుతున్నారు.

''మొదట్లో చాలా కష్టంగా ఉండేది. ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేస్తూ, చదువు కొనసాగిస్తూనే ఫ్యాక్టరీలో పనికి వెళ్లేదాన్ని. పరీక్షలప్పుడు చాలా ఒత్తిడి ఉండేది. అప్పుడు నాకు బదులుగా మా అమ్మ పనికి వెళ్లేది'' అని స్నేహ్ అన్నారు.

స్నేహ్‌ను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందని ఆమె తండ్రి రాజేంద్ర సింగ్ తన్వార్ అంటున్నారు.

''నా కూతుర్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. తను చేస్తున్నది సమాజానికి, ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తుందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది'' అని ఆయన అన్నారు.

మొదట్లో.. ఆ ఫ్యాక్టరీలో ఏదో జరుగుతోందని అనుమానించే కొందరు గ్రామస్తుల నుంచి వీరు అడ్డంకులు ఎదుర్కొన్నారు. సినిమా బృందం ఆ గ్రామంలో అడుగుపెట్టాక, గ్రామస్తుల్లో.. వీరెందుకొచ్చారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

31సంవత్సరాల సుష్మాదేవి పనికి రావడానికి ఇప్పటికీ రోజూ ఇంట్లో గొడవలు పడుతున్నారు. సుష్మకు ఇద్దరు పిల్లలు. తన భర్తతో స్నేహ్ తల్లి మాట్లాడిన తర్వాతే, తనను పనికి పంపడానికి ఒప్పుకున్నాడని సుష్మ చెప్పారు. అదికూడా.. ఇంటిపనులన్నీ పూర్తి చేశాకే పనికి వెళ్లమంటాడని సుష్మ అన్నారు.

''ఉదయం 5గంటలకు నిద్ర లేస్తాను. ఇల్లు శుభ్రం చేసి, పశువులకు మేత వేసి, వంట చేయడానికి పొయ్యిలోకి అవసరమైన పిడకలు చేయాలి. తర్వాత స్నానం చేసి, ఉదయం-మధ్యాహ్నానికి వంట చేసి పనికి వెళ్లాలి. సాయంకాలం ఇంటికొచ్చాక భోజనం వండాలి. ఇన్ని చేసినా నా భర్తకు తృప్తి లేదు. అప్పుడప్పుడూ కోప్పడతాడు. ఇంట్లో అంత పని పెట్టుకుని ఫ్యాక్టరీకి ఎందుకు వెళుతున్నావ్? అని అరుస్తాడు. మా ఇరుగుపొరుగు కూడా, అక్కడ పని చేయడం మంచిది కాదని, జీతం కూడా చాలా తక్కువేనని అంటున్నారు'' అని సుష్మ తన కథను చెప్పారు.

సుష్మ పొరిగింటివారు కూడా ఫ్యాక్టరీలో పని చేసేవాళ్లు. కానీ కొన్ని నెలల తర్వాత పని మానేశారు. కానీ వాళ్లలా ఫ్యాక్టరీలో పని మానేయడం తనకు ఇష్టం లేదని సుష్మ చెబుతున్నారు.

''నా భర్త కొట్టినాసరే.. ఫ్యాక్టరీలో పని మానేయను. అక్కడ పని చేయడం నాకు చాలా ఇష్టం'' అని సుష్మ చెబుతున్నారు.

తన సంపాదనతో తన తమ్ముడికి బట్టలు కొన్నానంటూ డాక్యుమెంటరీలో సుష్మ చెబుతారు. ''ఇది ఆస్కార్‌ వరకు వెళుతుందంటే, నేనింకా తెలివిగా మాట్లాడేదాన్ని..'' అంటూ సుష్మ నవ్వేశారు.

సుష్మ, స్నేహ్, ఇంకా తమ తోటి మహిళలకు, ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం మరింత ఉత్సాహం ఇచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ డాక్యుమెంటరీ.. 'బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ' విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న స్నేహ్‌ను చూసి, ఊరికి మంచి పేరు తెచ్చిందని ఆమె ఇరుగుపొరుగు గర్వపడుతున్నారు.

''ఇంతవరకూ మా ఊరి నుంచి ఎవ్వరూ విదేశాలకు వెళ్లలేదు. నేనే మొదటి వ్యక్తిని. ఊర్లో అందరూ నన్ను గౌరవిస్తున్నారు. నన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని చెబుతున్నారు'' అని స్నేహ్ అన్నారు.

ఆస్కార్ అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన సినిమా అవార్డ్స్ అని తనకు తెలుసని స్నేహ్ చెబుతున్నారు. కానీ తానెప్పుడూ ఆస్కార్ వేడుకలను కనీసం చూడనుకూడా చూడలేదని, అలాంటిది ఆస్కార్ వేడుకల్లో భాగంగా రెడ్ కార్పెట్‌పై నడుస్తానని అస్సలు ఊహించలేదని ఆమె చెబుతున్నారు.

''అమెరికా వెళతానని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఏం జరుగుతోందో నాకింకా పూర్తిగా అర్థం కావడంలేదు. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడమే నాకో పెద్ద అవార్డు. నేను కళ్లు తెరుచుకునే కల కంటున్నాను'' అని స్నేహ్ తన ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)