బీబీసీ రియాలిటీ చెక్ సిరీస్: రాజకీయపార్టీలు చెబుతున్న మాటల్లో ఏది వాస్తవం?

రియాలిటీ ఛెక్ బ్రాండింగ్

2019 ఎన్నికల నేపథ్యంలో బీబీసీ న్యూస్.. 'రియాలిటీ చెక్' పేరుతో ప్రతిరోజూ ఓ కథనంతో మీముందుకు వస్తోంది. వారంలో శని, ఆదివారాలు మినహా, తక్కిన ఐదు రోజులూ రియాలిటీ చెక్ కథనాలను మీకు అందిస్తుంది.

ఇందులో ఏముంటుంది?

ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భాగంగా.. రాజకీయపార్టీలు, నాయకులు చెబుతున్న మాటల్లో ఏది వాస్తవం? అసలు వారు చెబుతున్న విషయాల వెనుక నిజం ఎంతవుంది? ఆ నిజాన్ని రుజువు చేయడానికి అవసరమైన డేటాతోపాటుగా ఆ వాస్తవాలను బీబీసీ మీ ముందు ఉంచుతుంది.

గతేడాది సెప్టెంబర్ నెలలో, బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ డైరెక్టర్ జేమీ యాంగస్ 'రియాలిటీ చెక్' సిరీస్‌ను '2019 ఎన్నికల ప్రత్యేకం'గా నిర్వహిస్తున్నామని అన్నారు.

ప్రజాజీవితంలోని వ్యక్తులు, ప్రజా సంస్థలు చెప్పిన మాటల గురించి దర్యాప్తు చేసి, నిజంగా సదరు వ్యక్తులు/సంస్థలు ఆ మాటలు చెప్పాయా లేదా? ఒకవేళ చెప్పివుంటే వాటిల్లో వాస్తవం ఎంత? అన్న విషయాలను బీబీసీ రియాలిటీ చెక్ నిర్ధరిస్తుంది.

''భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఎన్నికల చుట్టూ.. మా స్వేచ్ఛాయుత విశ్లేషణ ఉంటుంది. వాస్తవాలను వెలుగులోకి తేవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండటం, విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల 'ఫేక్ న్యూస్'కు తక్షణమే స్పందించగలుగుతాం'' అని జేమీ యాంగస్ అన్నారు.

గత నవంబర్‌ నెలలో బీబీసీ నిర్వహించిన 'బియాండ్ ఫేక్ న్యూస్' ద్వారా మేం తొలి అడుగు వేశాం. బియాండ్‌ ఫేక్ న్యూస్‌లో భాగంగా, దేశంలో విస్తరిస్తున్న అసత్య కథనాలు, డిజిటల్ అక్షరాస్యతపై వర్క్‌షాప్స్‌ను పాఠశాల, కాలేజీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించాం.

''రాజకీయ చర్చలకు కారణమవుతున్న అంశాల గురించి రియాలిటీ చెక్ ద్వారా మా పాఠకులకు వివరించగలుగుతామని, ఈ ఎన్నికల నేపథ్యంలో విశ్వసనీయ సమాచారానికి చిరునామా అవ్వగలమని ఆశిస్తున్నాం'' అని బీబీసీ భారతీయ భాషల హెడ్ రూపా ఝా అన్నారు.

వర్తమాన భారతీయ జీవితం, జీవికపై ప్రభావం చూపుతున్న అంశాలపై 'బీబీసీ రియాలిటీ చెక్' దృష్టి సారిస్తుంది.

ద్రవ్యోల్బణం నుంచి మొదలుకొని, పరిశుభ్రతా ప్రచారాలు, రవాణా, మౌలిక సదుపాయాల గురించి రాజకీయ పార్టీల వాదనలపై చేసే విశ్లేషణలు.. డేటా(వాస్తవ సమాచారం)పై ఆధారపడి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)