లోక్‌సభ ఎన్నికలు 2019 : మహిళా నేతలకు ఎందుకు ఓటెయ్యాలంటే..

  • అనఘా పాఠక్
  • బీబీసీ ప్రతినిధి
ఓటర్లు

ఫొటో సోర్స్, Hindustan Times

ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల్లో విజయం సాధించినవారి శాతం ఎక్కువగా ఉందని మీకు తెలుసా? 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల నుంచి, 16వ లోక్‌సభ ఎన్నికల వరకు గమనిస్తే, ప్రతిసారీ విజయం సాధించినవారి నిష్పత్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంది.

1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో మొత్తం 1874మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 1831మంది పురుషులు, 43మంది మహిళలు. మొత్తం 1831 మంది పురుష అభ్యర్థుల్లో 467మంది గెలుపొందగా, 43మంది మహిళా అభ్యర్థుల్లో 22మంది విజయం సాధించారు. ఈ లెక్కన, మహిళల్లో విజయ శాతం 51.16 ఉండగా, పురుష అభ్యర్థుల్లో 25.50% మాత్రమే ఉంది.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలిచిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా విజయశాతం ఉంటుంది. కానీ రానురానూ ఎన్నికల్లో విజయం సాధిస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.

రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి పనిచేస్తోన్న 'శక్తి' అనే సంస్థ గణాంకాల ప్రకారం, 2019లో 82%మంది ప్రజలు, 2019లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువమంది మహిళలను ఎన్నుకోవాలని భావిస్తున్నారు.

''దేశంలోని మహిళలు, పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో.. మాకు ఎదురైన ప్రత్యక్ష అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఈమధ్యనే సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటులోని 90%మంది పురుషులు, ఎంత ప్రయత్నించినా గర్భం దాల్చలేరు. అలాంటిది, మహిళల శరీరం ఆధారంగా 90%మంది పురుషులు.. నిబంధనలు విధిస్తూ సరోగసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. అందుకే మన చట్ట సభల్లో ఇంకా ఎక్కువమంది మహిళలు ఉండాలి'' అని శక్తి సంస్థ సహ వ్యవస్థాపకులు తారా కృష్ణస్వామి అన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times

పురుషుల కంటే మహిళా అభ్యర్థులే మెరుగా?

తారా కృష్ణస్వామి మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని ఓ గిరిజన గ్రామంలో ఉండే 18ఏళ్ల యశోద కూడా, మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఉంటేనే, చట్టసభల్లో మహిళా సమస్యలు చర్చకు వస్తాయని విశ్వసిస్తోంది. ఈమధ్యనే నేను యశోదను కలిశాను. కొన్ని తరాలుగా, యశోద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ మహిళలకు ఉపశమనం కలిగించడానికి ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎందుకు?

''ఎందుకంటే మా ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎవ్వరూ లేరు..'' అని యశోద సింపుల్‌గా చెప్పేసింది.

వాస్తవ జీవితం ఆధారంగా ఆమె రాజకీయాలను నిర్వచిస్తోంది. మహిళల సమస్యల పట్ల తమ ఊళ్లోని పురుషుల వైఖరిని చూసి, రాజకీయాల్లో కూడా పురుషులు అలాగే ఉంటారని ఆమె విశ్వాసం.

కానీ రాజకీయాలు పురుషులకు మాత్రమే సంబంధించినవి అయ్యాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి అనువుగా రాజకీయ పార్టీల నిర్మాణంలో ఇంతవరకూ మార్పులు రాలేదు అన్నారు.

శక్తి సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,

''పార్టీ జిల్లా సెక్రటరీలు కూడా.. తమ నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులకు టిక్కెట్ ఇవ్వద్దంటూ మా నాన్నకు చెప్పడం నేను చూశాను. ఇప్పటికీ, చాలామందికి మహిళల గురించి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇతర రంగాల్లో దూసుకుపోతున్నట్లే, రాజకీయాల్లో కూడా మహిళలు అడ్డుగోడలను బద్దలుకొట్టాలి'' అని కనిమొళి అన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్.సి. మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళలు కొన్ని పరిమితుల్లో, మరొకరి కంట్రోల్‌లో ఉండాల్సివస్తోందని అన్నారు.

''ఏ పార్టీనైనా చూడండి, ఆ పార్టీకి చెందిన మహిళా విభాగాన్ని మహిళా నేతలే చూస్తుంటారు'' అని షైనా అన్నారు.

తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మాత్రమే మహిళలను ఎన్నుకోవాలని అందరూ అనుకోరు.

''మహిళల పాలన అత్యుత్తమంగా ఉంటుందో లేదో నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నేను దాని గురించి ఆలోచించను. మహిళల సమస్యలను పరిష్కరిస్తారనో, పురుషుల కంటే తక్కువ అవినీతికి పాల్పడుతారనో, లేదంటే మహిళలకు రాజకీయాల్లో నైతిక విలువలు ఎక్కువగా ఉంటాయన్న కారణాలు, మహిళలను ఎన్నుకోవడానికి సిసలైన ప్రాతిపదిక కాదు! పరిపాలన చేయడానికి పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కు ఉంది'' అని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ విమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ, కమ్యూనిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్ అన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం - అభివృద్ధి

పురుష ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారి నియోజకవర్గాల్లో ఏడాదికి 1.8% ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది.

ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ-వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్(యు.ఎన్.యు-డబ్ల్యూ.ఐ.డి.ఇ.ఆర్) 1992 - 2012 మధ్యకాలంలో 4,265 అసెంబ్లీ నియోజకవర్గాలపై అధ్యయనం చేసింది.

ఈ అధ్యయనం జరిగిన 20ఏళ్ల కాలంలో, చాలా రాష్ట్రాల్లో నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. ఉపగ్రహ సమాచారం ద్వారా ఈ నియోజకవర్గాల్లో రాత్రిపూట వెలిగే విద్యుత్ కాంతుల ఆధారంగా ఆర్థిక పురోగతిని లెక్కగట్టారు.

మహిళా పాలకులు.. మహిళలు, పిల్లలకు సంబంధించి ఆసక్తి కనబరుస్తున్నారని, స్త్రీశిశు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది.

అంతేకాకుండా, రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయడంలో కూడా మహిళలు మెరుగ్గా పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. పురుషులతో కంటే మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 22శాతం ఎక్కువగా రోడ్డు పనులను పూర్తి చేశారు.

పురుషులతో పోలిస్తే మహిళా నేతలపై మూడోవంతు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

''2014 ఎలక్షన్ కమిషన్‌కు అందజేసిన అభ్యర్థుల అఫిడవిట్ వివరాలు మాదగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా చూస్తే, పురుషులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్లో సగం మాత్రమే మహిళా అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

మహిళా ఎంపీలు - భారత్ స్థానం ఎంత?

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం, పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం అంశంలో మొత్తం 193 దేశాల్లో భారత్ 153వ స్థానంలో నిలిచింది.

ప్రపంచంలోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 25% మాత్రమే. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో రువాండా 63%, క్యూబా 58%, బొలీవియా 53%తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

భారత్ పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం శాతం దగ్గరదగ్గరగా 11.8% ఉంది.

దేశాభివృద్ధికి, పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యానికి ప్రత్యక్ష సంబంధం లేదన్నది సుస్పష్టం.

పురుష అభ్యర్థుల కంటే మహిళా అభ్యర్థుల విజయ శాతం ఎప్పుడూ ఎక్కువగానే ఉందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. కానీ, పోటీ చేసే పురుష, మహిళా అభ్యర్థుల శాతం పెరిగినపుడు, ఇద్దరిలోనూ విజయ శాతం పడిపోవడం జరుగుతోంది.

''ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో విజయ శాతం ఎక్కువగా ఉంది. కానీ మహిళా ఓటర్ల శాతాన్ని కూడా మనం గమనించాలి. వారు కూడా పెరుగుతున్నారు. ఇది మంచి పరిణామం'' అని ఎన్నికలు, రాజకీయ సంస్కరణల కోసం పని చేస్తోన్న స్వచ్ఛందసంస్థకు చెందిన అనిల్ వర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)