లోక్‌సభ ఎన్నికలు 2019: ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ప్రభావవంతంగా నియంత్రించిందా? :BBC Reality Check

  • వినీత్ ఖరే
  • బీబీసీ రియాలిటీ చెక్
సచిన్ పైలట్ విమర్శ

క్లెయిమ్: ప్రతిపక్ష కాంగ్రెస్, ద్రవ్యోల్బణంపై బీజేపీ ప్రభుత్వ రికార్డును విమర్శించింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించింది.

తీర్పు: వస్తు, సేవల ధరల్లో పెరుగుదల రేటు అయిన ద్రవ్యోల్బణం, గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో తక్కువగా ఉంది. 2014 తరువాత అంతర్జాతీయంగా ఆయిల్ ధర పడిపోవడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు తగ్గడం కూడా అందుకు దోహదపడింది.

''ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామనే వాగ్దానంతో బిజెపి అధికారంలోకి వచ్చింది. అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం చేసింది ఏమీ లేదు'' అని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సచిన్ పైలెట్ గత ఏడాది అన్నారు.

2017లో ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు, ధరలను నియంత్రించండి లేదా ''గద్దె దిగండి'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండు చేశారు.

అయితే, మోదీ మాత్రం తమ ప్రభుత్వం ఈ విషయంలో విజయం సాధించిందని సమర్థించుకున్నారు. గత కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం చాలా తక్కువ స్థాయిలో ఉందన్నారు.

2014 ఎన్నికల్లో బిజెపి చేసిన పెద్ద వాగ్దానాల్లో ‘ధరలు తగ్గింపు’ కూడా ఒకటి.

ఆ సంవత్సరంలో ప్రభుత్వ కమిటి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే రెండు శాతం పాయింట్లు అటు ఇటు ఉంచి, 4% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సిఫారసు చేసింది.

ద్రవ్యోల్బణం రికార్డు

మరి, ఎవరు రైట్?

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో, ద్రవ్యోల్బణం 2010లో దాదాపుగా 12 శాతానికి చేరుకుంది.

2014లో మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పాలనలో ద్రవ్యోల్బణం దశాబ్దం కిందటి కంటే తక్కువగా ఉంది.

2017లో, సగటు వార్షిక రేటు 3% కంటే తక్కువ.

ద్రవ్యోల్బణంను ఎలా లెక్కకడతారు?

భారతదేశం లాంటి అతిపెద్ద వైవిధ్యమైన దేశంలో, ద్రవ్యోల్బణాన్ని లెక్కకట్టడం సంక్లిష్టమైన పని. ద్రవ్యోల్బణాన్ని లెక్కకట్టేందుకు అధికారులు హోల్‌సేల్ ధరల్లో మార్పులను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ ఉండేవారు.

అయితే, 2014లో భారత రిజర్వ్ బ్యాంక్ ఇందుకు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ)ను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించింది.

కుటుంబం అవసరాల కోసం నేరుగా ఉపయోగించిన సరకుల మరియు సర్వీసుల ధరలను సిపిఐ పరిశీలిస్తుంది లేదా సింపుల్‌గా రిటైల్ ధరలను తీసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

వస్తు సేవలపై సమాచారం తీసుకునే సర్వేపై ఇది ఆధారపడింది.

సర్వేను ఆహార మరియు ఆహారేతర వస్తువులు అనే రెండు విభాగాలుగా విభజించారు.

ఆహారేతర వస్తువుల్లో విద్య మరియు ఆరోగ్యం లాంటి సేవలు, వైట్ గూడ్స్, ఇతర వినియోగ వస్తువులు ఉన్నాయి.

వస్తువుల సంఖ్య మరియు ఆహార మరియు ఆహారేతర వస్తువులకు ఇవ్వబడే సంబంధిత విలువలు మారిపోనున్నప్పటికీ, అనేక దేశాల్లో ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నారు.

ద్రవ్యోల్బణం ఎందుకు దిగి వచ్చింది?

మోదీ పాలనలోని తొలినాళ్ళలో ఆయిల్ ధర స్థిరంగా తగ్గుతూ పోవడం అతిపెద్ద కారణాల్లో ఒకటి అని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు.

భారతదేశం తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరల్లో ఉండే హెచ్చు తగ్గులు సహజంగానే ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిస్తాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, 2011లో భారతదేశ క్రూడ్ ఆయిల్ దిగుమతుల ఖర్చు బ్యారెల్‌కు దాదాపు 120 డాలర్లు.

2016 ఏప్రిల్ నాటికి ఇది ప్రతి బ్యారెల్‌కు 40 డాలర్ల కంటే దిగువకు వచ్చింది, అయితే, తదుపరి రెండేళ్ళలో ధర మళ్ళీ పెరిగింది.

కానీ, ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న ఇతర అంశాలు కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి.

ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆహార ధరలు తగ్గుతుండటం. అదికూడా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో.

దేశ జనాభాలో 60% మందికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నది గుర్తుంచుకోవలసిన అంశం.

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయ ఆదాయాలు తగ్గడం వల్ల ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం తగ్గిందని భారత గణాంకాల విభాగం మాజీ ప్రధానాధికారి ప్రణబ్ సేన్ అంటున్నారు.

ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని ఆయన భావిస్తున్నారు:

  • గ్రామీణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమలు చేస్తున్న ఆదాయ హామీ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని బాగా తగ్గించింది.
  • రైతుల పంటలకు ప్రభుత్వం హామీ ఇచ్చే ధరల్లో పెరుగుదల స్వల్పంగా ఉండడం.

''గత 10 సంవత్సరాల్లో (అంటే క్రాంగ్రెస్ పాలనలో), గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీతాలు పెరిగాయి, దీంతో ఆహారంపై పెట్టే ఖర్చు పెరిగింది'' అని ప్రణబ్ సేన్ అన్నారు.

కానీ, ఇప్పుడు ఈ ఆదాయాల పెరుగుదల తగ్గిందని ఆయన చెప్పారు.

ఫలితంగా డిమాండ్ తగ్గింది, దానితో పాటే ద్రవ్యోల్బణం కూడా.

భారతదేశ కేంద్ర బ్యాంకు

డిమాండును అదుపులో ఉంచేందుకు మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు సహాయపడిన ఇతర పాలసీ నిర్ణయాలు కూడా ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ సత్వరం వడ్డీ రేట్లను తగ్గించే స్థితిలో లేదు, వడ్డీ రేట్లు తగ్గితే వినియోగదారులు అప్పు తీసుకోవడానికి, ఎక్కువ ఖర్చుపెట్టడానికి వీలు కలుగుతుంది.

ఫిబ్రవరి ఆరంభంలో వడ్డీ రేట్లు తగ్గించడం గత 18 నెలల్లో ఇదే మొదటిసారి.

తన ఆర్థిక లోటును నియంత్రణలో ఉంచాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయవ్యయాల మధ్య ఉండే వ్యత్యాసం.

తక్కువ ఆర్థిక లోటు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అప్పులు మరియు వ్యయాలు తక్కువగా ఉంటాయి.

అయితే, ఎన్నికలు సమీపిస్తుండటంతో, వ్యయాన్ని పెంచే విషయంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)