పవన్ కల్యాణ్: ‘జగన్‌లా 30 ఏళ్లు పదవి కోరను... చంద్రబాబులా నా కుమారుడు సీఎం కావాలనుకోను’: ప్రెస్‌రివ్యూ

జనసేన

ఫొటో సోర్స్, janasena/fb

''వైసీపీ అధినేత జగన్‌లాగా 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి కావాలని అనడం లేదు. సీఎం చంద్రబాబులాగా మా అబ్బాయి సీఎం కావాలనే కోరిక లేదు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి పదవి ఇస్తారా.. ప్రతిపక్షంలో కూర్చోబెడతారా? మీ ఇష్టం. మీ జీవితాల్లో మార్పు తెచ్చేవరకు నా పోరాటం ఆగదు'' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కర్నూలు నగరానికి చేరుకున్నారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్‌కు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కర్నూలు నగరానికి వచ్చారు. సి.క్యాంప్‌ సెంటర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్‌షో నిర్వహించారు.

కొండారెడ్డి బురుజు దగ్గర ఏర్పాటు చేసిన సభలో పవన్‌ ప్రసంగించారు. ''కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నా. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవు. ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే సంకీర్ణ ప్రభుత్వాల వైపు దృష్టి పెట్టాలి'' అని సూచించారు. అధికార, ప్రతిపక్షాల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని, రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లు కాగా, ఇస్తున్న హామీలు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌లాగా దిగుజారి అబద్ధాలు చెప్పనని తెలిపారు.

సీఎం చంద్రబాబు రైతులకు, డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్నారని, ఆ డబ్బులేమన్నా ఆయన, ఆయన పార్టీ నేతల జేబుల్లో నుంచి ఇస్తున్నారా? అని పవన్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ సొమ్ము ఇస్తున్నారని, ఆ డబ్బుతోనే ఓట్లు కొంటున్నారని విమర్శించారు.

తన దగ్గర వేల కోట్ల డబ్బు లేదని, న్యూస్‌ చానళ్లు, న్యూస్‌ పేపర్లు లేవని, తనకున్నది జనసైనికులేనని పవన్‌ చెప్పారు.

''ఒకరేమో నన్ను టీడీపీ మనిషి అంటారు. మరొకరు వైసీపీ మనిషి అంటారు. ఇంకో రోజు టీఆర్‌ఎస్‌ మనిషి అంటారు. మరో రోజు బీజేపీ మనిషి అంటారు. ఎవరు ఏం చెప్పినా నేను ప్రజల మనిషిని, మీ మనిషిని'' అని పవన్‌ అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Yolt

కాల్‌ చేస్తే... మీ బ్యాంక్ ఖాతా ఖాళీ

గూగుల్‌లో బ్యాంకుల పేరిట నకిలీ కాల్‌ సెంటర్ల నంబర్లు సృష్టించి ఫోన్ చేసిన వారి ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు మాయం చేస్తున్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు డబ్బు డ్రా చేసుకోవడానికి బషీర్‌బాగ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. అక్కడ చేయాల్సిన తతంగం మొత్తం పూర్తయ్యాక ఆయన ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినట్లు డిస్‌ప్లే, మెసేజ్‌ వచ్చాయి. అయితే ఏటీఎం నుంచి డబ్బు బయటకు రాకపోవడంతో ఆందోళనకులోనై సదరు బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అక్కడ టాప్‌లో కనిపించిన 76+++++219 నంబర్‌కు కాల్‌ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లు చేసి తన ఖాతా నుంచి మరో రూ.80 వేలు పోగొట్టుకున్నారు. చివరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది.

ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్‌ నేరగాళ్లు ఇటీవల కాలంలో ఇలా టోకరా వేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టించే ఈ క్రైమ్‌ ఎలా సాగుతుందో 'సాక్షి'కి వివరించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.

ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్‌ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్‌ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రో నగరాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్‌ ఆశ చూపి సైబర్‌ నేరగాళ్లు వారిని తమ వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందిన మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్, బ్యాంక్‌ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ 5 శాతం చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. సిమ్‌కార్డులు, బేసిక్‌ మోడల్‌ సెల్‌ఫోన్లతోపాటు బ్యాంకు ఖాతాలు, యాప్స్‌ సిద్ధమయ్యాక ఈ సైబర్‌ నేరగాళ్లు దందా మొదలుపెడుతున్నారు.

ఈ సైబర్‌ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్‌లోకి ఎంటర్‌ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా తమ నంబర్లను ఆయా బ్యాంకులకు చెందిన కాల్‌ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు.

ట్రూ కాలర్‌లో సైతం వీటిని 'బ్యాంక్‌', 'బ్యాంక్‌ మేనేజర్‌'పేర్లతోనే రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే గూగుల్‌ సెర్చ్‌లో పొందుపరిచిన వాటిలో వేటికి వ్యూస్‌ ఎక్కువగా ఉంటే అది పైభాగానికి వస్తుంది. దీంతో సదరు సైబర్‌ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నంబర్లకు వ్యూస్‌ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచిన తప్పుడు కాల్‌ సెంటర్ల నంబర్లే పైభాగంలో కనిపిస్తుంటాయి. ఇలా కనిపించిన కాల్‌ సెంటర్‌ నంబర్‌కు ఖాతాదారుడు కాల్‌ చేసిన వెంటనే అది సదరు సైబర్‌ నేరగాడికి వెళ్తుంది. తాను బ్యాంక్‌ మేనేజర్‌ని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నంబర్‌ నుంచి ఓ ఎస్సెమ్మెస్‌ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నంబర్‌కు పంపించాలని సూచిస్తుంటారు.

ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్‌కు అనుసంధానం చేయాలంటే యూపీఐగా పిలిచే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్‌ అయిన సెల్‌ఫోన్‌ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్‌ నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే ఈ సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

‘వారిది రూ.వెయ్యి కోట్ల కుట్ర’

‘జగన్‌ ఏపీ సీఎం అవుతారని కేటీఆర్‌ అంటున్నారు. తానొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేస్తానని తలసాని శ్రీనివాస్‌ చెబుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనేదే వారి ఆలోచన. నేనుంటే వాళ్ల ఆటలు సాగవు’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని ఈనాడు వెల్లడిచింది.

పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలిసి సీఎం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు 'ఆంధ్రప్రదేశ్‌ వర్తక, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య' ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు సీఎంని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి సంఘీభావం తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.

బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో అమలు చేసిన కుల రాజకీయాలను ఇక్కడ చొప్పించాలని జగన్‌ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్‌ కిశోర్‌ చూస్తున్నారని, వారి కుప్పిగంతులు ఇక్కడ సాగవని పేర్కొన్నారు. రౌడీయిజం, భూకబ్జాలు, నేరాలు ఎక్కడ జరిగినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

'అరాచక శక్తులు అధికారంలోకి వస్తే ఎక్కువ నష్టపోయేది వ్యాపారులే. ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండదు. గల్లీకి ఒక రౌడీ తయారవుతాడు. ప్రతి దానికీ వాటా కట్టాలి. రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉంటే వ్యాపారాలు అంత సజావుగా సాగుతాయి. వ్యాపారులంతా వీటిపై బహిరంగంగా మాట్లాడాలి' అని సూచించారు.

''గతంలో నేనిచ్చిన పిలుపునకు స్పందించి హైదరాబాద్‌లో ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు. కేసీఆర్‌ ఇప్పుడు వారందరికీ అడ్డదారిన నోటీసులు ఇస్తున్నారు. కేసులు పెడుతున్నారు. 'మీరంతా ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి జగన్‌కు అనుకూలంగా పనిచేయండి, ఎన్నికల్లో పోటీ చేయండి' అని వారిని ఒత్తిడి చేస్తున్నారు. శాసనసభ్యుడు చింతమనేనిపై మార్ఫింగ్‌ పద్ధతిలో వీడియో, ఫొటోలు సృష్టించారు. కొండవీడు రైతు విషయంలో నాపై రాజకీయాలకు దిగి, పోలీసులను లక్ష్యంగా చేశారు. జగన్‌ సోదరి షర్మిల మన పోలీసులపై నమ్మకం లేక తెలంగాణలో కేసు పెట్టారు. కోడి కత్తి కేసులోనూ ఏపీ పోలీసుల్ని వారు నమ్మలేదు. వారికి ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం లేదు. ఇక్కడి ప్రజల ఓట్లు మాత్రం కావాలి'' అని ముఖ్యమంత్రి విమర్శించారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, facebook/TelanganaCMO

‘ తెలంగాణలో నాలుగు స్తంభాలాట’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌ మలి విడత విస్తరణలో నాలుగు స్తంభాలాట తప్పేట్టు లేదంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది. ఖాళీలు పరిమితంగా ఉండడం.. ఆశావహులు భారీగా ఉండడమే ఇందుకు కారణం. లోక్‌సభ ఎన్నికల తర్వాతే కేబినెట్‌ విస్తరణ ఉండే అవకాశం ఉన్నా, ఈ ఇద్దరు ఎవరు.. ఆ నలుగురు ఎవరనే చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమైంది.

పాత మంత్రుల్లో ఇంకా ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో సీఎం సహా మంత్రుల సంఖ్య 18కి మించరాదు. తొలుత సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేయగా, ఈనెల 19న మరో పది మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. మిగిలిన ఖాళీలు ఆరు మాత్రమే. వాటిలోనూ రెండింటిని మహిళలతో భర్తీ చేస్తామని కేసీఆర్‌ ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలోనూ ఒక్క మహిళకూ కేబినెట్‌లో చోటు ఇవ్వకపోవడం, రెండోసారి అధికారంలోకి వచ్చాక 12 మంది కేబినెట్‌లోనూ మహిళలు ఎవరూ లేకపోవడంపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు.

తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి అప్పటికి ఐదుగురు (ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్‌ ఎన్నికతో కలిపి) ఉంటారు. వారిలో ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది. ఇక, పురుష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందుబాటులో ఉండే మంత్రి పదవులు కేవలం నాలుగే. కానీ, వాటికి ఆశావహులు దాదాపు 25 మంది ఉన్నారు.

తాజా కేబినెట్‌లో చోటు దక్కని టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిల్లో మళ్లీ ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ఇక, టీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కొత్తగా గెలిచిన చాలామంది ఈసారి కేబినెట్‌లో చోటుపై ఆశలు పెట్టుకున్నారు.

బీసీ కోటాలో దాస్యం వినయ్‌భాస్కర్‌, గంగుల కమలాకర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌, గంప గోవర్ధన్‌, నోముల నర్సింహయ్య, జైపాల్‌ యాదవ్‌, కేపీ వివేకానంద గౌడ్‌, ఓసీ కోటాలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సోలిపేట రామలింగా రెడ్డి, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, మర్రి జనార్దన్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎన్‌.దివాకర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, ఎస్సీ కోటాలో రసమయి బాలకిషన్‌, ఆరూరి రమేశ్‌, గువ్వల బాలరాజు, గ్యాదరి కిశోర్‌, బాల్క సుమన్‌, ఎస్టీ కోటాలో రెడ్యానాయక్‌, రాథోడ్‌ బాపూరావు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత కేబినెట్‌ పాత, కొత్త కలయికగా ఉండగా.. మలి దఫా విస్తరణ ఏ రీతిన ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. దాని ప్రకారమే, ఆశావహులకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. దీనిపై లోక్‌సభ ఎన్నికల తర్వాతే స్పష్టత రానుందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)