భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? -అభిప్రాయం

  • చిత్రపు ఉదయ భాస్కర్
  • బీబీసీ కోసం
పోఖ్రాన్లో పరీక్షలు జరుపుతున్న ఇండియన్ ఆర్మీ (పాత ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పోఖ్రాన్లో పరీక్షలు జరుపుతున్న ఇండియన్ ఆర్మీ (పాత ఫొటో)

(చిత్రపు ఉదయ భాస్కర్.. రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇండియన్ నేవీలో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. సెక్యూరిటీ ఫర్ పాలసీ స్టడీస్ అనే మేథోసంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లక్ష్మి ఆయన చెల్లెలు. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు.)

డియర్ లక్ష్మి,

పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి నువ్వు వినే ఉంటావు. నిజమే, దిల్లీలోని మోదీ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపుతుందనే సూచనలు కనిపించాయి. ఒక వేళ నువ్వు టీవీ చర్చలను నమ్మితే ఆ యుద్ధం ఇప్పుడే జరగాలి, ‘జాతీయవాదులు’ అయితే ఇది నిన్నే జరిగి ఉండాల్సిందని కోరుకుంటున్నారు.

ఇటీవల నువ్వు సుదూరంలోని కాలిఫోర్నియా నుంచి ఫోన్‌లో మాట్లాడినప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగావు. దేశం మొత్తంగా కాకపోయినా.. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో నీకు వివరించే ప్రయత్నం చేస్తా.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన భయంకరమైనది. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ముక్కలు ముక్కలైతే.. జవాన్ల శరీర భాగాలు ఘటనాస్థలం నుంచి వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఇవన్నీ మనం టీవీలో చూశాం. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తామే దాడి చేశామని జైష్ ఎ మొహమ్మద్ సంస్థ ప్రకటించుకుంది. భారతీయ మీడియా.. ముఖ్యంగా టీవీ చానెళ్లు, సోషల్ మీడియా ఈ దాడి గురించి ఇచ్చిన కథనాలు దేశ ప్రజల్లో కోపాన్ని, ఆవేదనను తారా స్థాయికి చేర్చాయి.

దిల్లీలో జవాన్ల శవపేటికల వద్ద ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించిన చిత్రాలు చూసిన తర్వాత ప్రజల ఆగ్రహావేశాలు ఇంకా ఎక్కువయ్యాయి. దిల్లీలో అయితే.. ‘మూతి పగలగొట్టేలా సమాధానం ఉండాలి’ అని కొందరు అంటుంటే.. ‘కన్నుకు కన్ను.. ప్రాణానికి ప్రాణం’ అని మరికొందరు అంటున్నారు. ఇక ఒక టీవీ చానెల్ చర్చల్లోనైతే.. వాళ్లు 40 మందిని పొట్టనపెట్టుకుంటే మనం ఒకరికి 100 మంది చొప్పున 4000 వేల మందిని చంపాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్, పాక్‌ల మధ్య యుద్ధం తప్పనిసరా?

భారత్, పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధం తప్పనిసరా? పుల్వామా దాడి తర్వాత దేశంలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం జరగాల్సిందేనా? ఈ యుద్ధం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనే సంక్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తుందా? అని అడిగితే.. భారతదేశం ఏదో ఒక సైనిక చర్య రూపంలో ప్రతిస్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఎప్పుడు, ఎలా జరుగుతుందనేది.. ప్రతి రాత్రి కొన్ని టీవీ ఛానెళ్లు చేసే ఊహాగానాల్లాగే ఉంటుంది.

అయితే, పుల్వామా దాడికి పురికొల్పిన కారణాలను ఈ చర్య మార్చగలదా? నాకేతే అలా అనిపించట్లేదు.. ఎందుకంటే భారతదేశం ఎలాంటి సైనిక చర్యకు దిగినా.. పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండి నుంచి ప్రతిస్పందన ఉంటుంది. ఆ పరిణామాలు ఎలా పెరుగుతాయో ఊహించొచ్చు. ఇరు దేశాలూ అణ్వాయుధాలను కలిగి ఉన్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాల మధ్యవర్తిత్వాలకు ప్రయత్నాలు జరుగుతాయి.

కానీ, సైనిక చర్య అసలు సమస్యను పరిష్కరించలేదు. ఆ అసలు సమస్య.. జైష్ ఎ మొహమ్మద్‌కు పాకిస్తాన్ అండదండలు.. అంతకు మించి, భారతీయుడైన ఒక కాశ్మీరీ యువకుడు కారులో ఆత్మాహుతి దాడికి దిగడం.. రక్తం చిందించే, ప్రాణాలు తీసుకునే చర్యకు అతన్ని ఒప్పించడం.

వాస్తవం ఏంటంటే.. పాకిస్తాన్ ప్రకటించిన ఈ పరోక్ష యుద్దాన్ని భారతదేశం 1990 నుంచి ఎదుర్కొంటూనే ఉంది. ఈ పరోక్ష యుద్ధం జీహాదీ ఉగ్రవాదం రూపంలో అమలవుతోంది. గత 25 ఏళ్లలో జరిగిన వివిధ ఉగ్రవాద దాడులను నువ్వు గుర్తుచేసుకో.. వాటిలో ముఖ్యమైనవి.. 2001 డిసెంబర్‌లో భారత పార్లమెంట్‌పై దాడి - అప్పుడు ప్రధానమంత్రిగా వాజ్‌పేయి ఉన్నారు. తర్వాత 2008లో ముంబయి దాడి - అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి.

లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మొహమ్మద్ లాంటి ఉగ్రసంస్థలను పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐలు పెంచిపోషిస్తున్నాయి. జైష్ ఎ మొహమ్మద్ సంస్థ జమ్మూ కశ్మీర్‌లో మొదటి ఆత్మాహుతి దాడిని 2000 ఏప్రిల్‌లో జరిపింది. అప్పుడు శ్రీనగర్‌లోని ఇండియన్ ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే.. పుల్వామా దాడి అత్యంత భయానకమైనది, ఎక్కువ మంది చనిపోయినది అయినప్పటికీ ఇదే మొదటిది కాదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదే చివరి దాడి అని కూడా చెప్పలేం.

యుద్ధం జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి?

ఇదే చివరిది కాదు అని నేను చెప్పడానికి కారణం.. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న అంతర్గత సామాజిక, రాజకీయ పరిస్థితులే.

కశ్మీరీ యువతలో విద్వేషం గురించి నువ్వు చదివే ఉంటావు. సరిహద్దు ఆవల నుంచి వస్తున్న మద్దతును, ఈ విద్వేషాన్ని కొందరు వేర్పాటువాద నాయకులు వాడుకుంటున్నారు. బుర్హాన్ వాని (గన్ను పట్టి ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ యువకుడు) ఘటన తర్వాత కశ్మీర్‌ లోయలో పరిస్థితి క్షీణించింది. భద్రతా దళాలపై స్థానిక కశ్మీర్ యువత రాళ్ల దాడి చేయడం, సెలవులపై వచ్చిన కశ్మీరీ జవాన్లను చంపడం వంటివి లోయలోని అసంతృప్తికి సంకేతాలు.

జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని నడిపేందుకు బీజేపీ, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ పార్టీల మధ్య కుదిరిన భాగస్వామ్యం సానుకూల పరిణామమే కానీ, దురదృష్టవశాత్తూ మోదీ ప్రభుత్వం కోరుకున్న ఫలితాలను అది ఇవ్వలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో గవర్నర్ పాలన నడుస్తోంది. ఇది కానీ.. స్థానికంగా ఉన్న రెండు పార్టీలు... పీడీపీ, ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీలు కానీ.. స్థానికంగా ఉన్న అసంతృప్తిని శాంతింపచేయలేకపోయాయి.

ఒకవేళ యుద్ధం జరిగితే..

జమ్మూ కశ్మీర్‌లో నాకు కనిపిస్తున్న ఈ పరిస్థితులు మరింత దిగజారుతాయి.

ఆర్మీ లేదా వైమానిక దాడులు జవాన్లు, పౌరుల ప్రాణాలను బలికొంటాయి.

యుద్ధం మొదలైన వెంటనే పాకిస్తాన్ ఈ ఘర్షణను భారత ఆర్థిక వ్యవస్థపైకి మళ్లించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

భారతదేశ సహజవాయువు నిక్షేపాలు, నిల్వలు అధికంగా గుజరాత్ తీరంలోనే ఉన్నాయి. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. ఈ ఆస్తులకు శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదాలను తోసిపుచ్చలేం.

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌ను దారికి తెచ్చేదెలా?

రెండు ముక్కల్లో చెప్పాలంటే.. నిజమైన యుద్ధం.. రక్తపాతాన్ని సృష్టిస్తుంది. మానవ-ఆర్థిక వనరులకు తీరని నష్టం చేకూరుస్తుంది.

పాకిస్తాన్‌తో యుద్ధం.. భారతదేశం గెలుపొందినప్పటికీ.. కశ్మీర్ సమస్యను మాత్రం పరిష్కరించదు. దీనివల్ల ఏదైనా సాధ్యమవుతుందంటే.. నా ఉద్దేశ్యం ప్రకారం.. సైన్యం శక్తి మరింత పెరుగుతుంది. అలాగే, పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక వర్గాలు కూడా ఏకమవుతాయి.

అయితే, వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులకు భారతదేశం సమాధానం చెప్పేందుకు ఏ మార్గాలూ లేవని కాదు.

దౌత్యపరంగాను, ఆర్థికంగానూ అంతర్జాతీయ సమాజం కొన్ని చర్యలు చేపట్టేలా చేయొచ్చు.

మనీ లాండరింగ్‌, ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజా సమావేశం పారిస్‌లో జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టారు. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు పొందటం పాకిస్తాన్‌కు కష్టం అవుతుంది. ఇలాంటి మార్గాలను ఇప్పుడు ఎంచుకుని, ఉపయోగించుకోవాలి.

ఇక సైనిక సామర్థ్యానికి వస్తే.. భారతదేశం కచ్చితంగా తన నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పటి నుంచి నిపుణులు ఈ నిఘా లోపాలను ఎత్తి చూపుతూనే ఉన్నారు. ఆ మేరకు దీనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అదేవిధగా.. కొన్ని కోవర్టు ఆపరేషన్లను కూడా పరిశీలించాలి. ఇలాంటి వాటిని బహిరంగంగా చర్చించలేం.

నేను ఇక్కడితో ముగించేద్దాం అనుకుంటున్నా. రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనం చూడగలం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసం దేశం యుద్ధానికి వెళ్లరాదనే ఎవరైనా కోరుకుంటారు. కానీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సహజం.

2003లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ తప్పుడు సలహాతో ఇరాక్‌పై యుద్ధానికి దిగారు. కానీ, చివరికి అది ఎంత దుస్థితికి దారి తీసిందో ఒకసారి గుర్తు చేసుకో.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)