లోక్‌సభ ఎన్నికలు 2019: పారిశ్రామిక వృద్ధిపై మోదీ హామీలు నిజమవుతున్నాయా: BBC Reality Cehck

దేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. 2025 నాటికి తయారీ రంగాన్ని నాలుగో వంతు మేర పెంచుతానని ఆయన హామీనిచ్చారు.
మోదీ హామీపై తీర్పునివ్వడం తొందరపాటే అయినప్పటికీ, భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో, ఈ లక్ష్యం దిశగా సాధించిన వాస్తవ ప్రగతిని బీబీసీ పరిశీలన చేయాలనుకుంటోంది.
మేక్ ఇన్ ఇండియా
2014 సెప్టెంబరులో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ, 2025 నాటికి తయారీ రంగం వాటాను జీడీపీలో 25%కి పెంచుతామని వాగ్దానం చేశారు.
- నిర్దిష్ట రంగాలను లక్ష్యంగా చేసుకోవడం
- ప్రస్తుత కంపెనీలకు మద్దతు ఇవ్వడం
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం
ఈ మూడింటి ద్వారా వీటిని సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్నితీవ్రంగా విమర్శించారు. తయారీ రంగం 'దూసుకుపోవడం లేదు' అని, 'మేక్ ఇన్ ఇండియా' విధానంలోనే లోపాలున్నాయి అని ఆయన ఆరోపించారు.
ప్రపంచ బ్యాంక్ ప్రచురించిన డేటాను ఒకసారి చూస్తే, జీడీపీలో తయారీ రంగం వాటా 2017 వరకూ నిలకడగా, 15% కన్నా తక్కువగానే ఉంది. ఇది లక్ష్యానికి చాలా దూరంగా ఉండటమే కాకుండా, దీని సాధన దిశగా సంకేతాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్, రిటైల్, ఆర్థిక, వృత్తిపరమైన రంగాల వాటా జీడీపీలో దాదాపు 49% గా ఉంది.
ప్రోత్సాహక చిహ్నాలు
పారిశ్రామిక వృద్ధి మెరుగుపడుతున్నట్లుగా చూపిస్తున్న అత్యంత తాజా డేటాను ప్రభుత్వం హైలైట్ చేసింది.
2017-18 కాలంతో పోల్చుకుంటే 2018-19 తొలి త్రైమాసికంలో తయారీ రంగంలో వృద్ధి 13% ఉన్నట్లు 'మేక్ ఇన్ ఇండియా' ప్రాజెక్టు పురోగతిపై ఇటీవల వెల్లడించిన నివేదికలో ప్రభుత్వం చెబుతోంది.
2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక పెరిగింది.
అయితే ఇటీవలి కాలంలో, ఇది నెమ్మదించింది. ఈ విదేశీ పెట్టుబడుల్లో అత్యధిక భాగం తయారీ రంగంలోకి కాకుండా సేవారంగానికి వెళ్తున్నట్లుగా ప్రభుత్వ సమాచారం స్పష్టం చేస్తోంది.
'పథకాన్ని ప్రారంభించిన నాలుగేళ్లైనా సాధించిన ప్రగతి మాత్రం స్వల్పమే' అంటున్నారు దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లెక్చరర్ ప్రొఫెసర్ విశ్వజిత్ ధార్.
ఇదేం కొత్త సమస్య కాదు
భారతదేశ ఆర్థిక వ్యవస్థను పారిశ్రామిక రంగం వైపు మరలించడానికి ప్రయత్నించింది ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఒక్కటే కాదు.
ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అంతకు ముందున్న ఇతర ప్రభుత్వాలు కూడా దీనికోసం కృషి చేసినప్పటికీ, జీడీపీలో తయారీ రంగం వాటా రెండు దశాబ్దాలుగా నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా తగ్గుతుండటమో జరుగుతోంది.
నిజానికి, అభివృద్ధిలో తయారీరంగం వాటాను 25%కి చేర్చడమనేది దశాబ్దాలుగా వింటూనే ఉన్నా ఎప్పుడూ దాని దరిదాపుల్లోకి కూడా ఎప్పుడూ చేరుకోలేదు.
అదే సమయంలో ఈ ప్రాంతంలోని చైనా, దక్షిణ కొరియా, జపాన్ లాంటి ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థికాభివృద్ధిలో తయారీ రంగం వాటాను పెంచడంలో విజయం సాధించాయి.
ప్రత్యేకించి చైనా 2002-09 మధ్య కాలంలో తయారీ రంగంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించింది.
అయితే, ఇలాంటి పోలికలతో పెద్దగా ఉపయోగం ఉండదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
''చైనా మరింత విస్తృ త, విద్యావంతులైన ఉద్యోగుల వ్యవస్థ కారణంగానే ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిందనే విషయం గుర్తించాలి'' అంటున్నారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన స్వాతి ధింగ్రా.
''కానీ, భారత్‌లో తయారీ రంగంలో వృద్ధి బాగున్న కాలంలో కూడా ఉద్యోగావకాశాలు పెద్దగా లేవు, ఆ రంగంలో ఉద్యోగాలకు భద్రత లేదు'' అని ఆమె అన్నారు.
ఇంకా ఫలితాలు ఇవ్వని కృషి
ప్రస్తుత ప్రభుత్వం నిర్దిష్ట రంగాల్లో సాధించిన పురోగతిని ప్రస్తావిస్తోంది..
- ఆయుధాల ఎగుమతుల్లో, రక్షణ ఉపకరణాల ఉత్పత్తిలో పెరుగుదల
- బయోటెక్నాలజీ పరిశ్రమలో గణనీయ పెట్టుబడులు
- తయారీ రంగానికి అవసరమైన నైపుణ్యాల్లో మరిన్ని విద్యావకాశాలు, శిక్షణ
- కొత్త రసాయన, ప్లాస్టిక్ ప్లాంట్లను నెలకొల్పడం
ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వార్షిక నివేదిక-2018లో భారతదేశ ర్యాంకు మెరుగవుతోందనే విషయాన్ని కూడా ప్రభుత్వం హైలైట్ చేస్తోంది.
ఇతర ప్రోత్సాహక చిహ్నాలు కూడా ఉన్నాయి- ఉదాహరణకు, ఆటోమొబైల్ పరిశ్రమలో భారత్ ప్రధాన పోటీదారుగా ఆవిర్భవిస్తోంది.
ఇతర తయారీ రంగాలను ఒకసారి పరిశీలిస్తే, విస్తరణ కార్యకలాపాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగానే కనిపిస్తాయి.
బయోటెక్నాలజీ, కెమికల్స్, మొబైల్ కమ్యూనికేషన్స్, టెక్స్టైల్స్ సహా అనేక రంగాలకు చెందిన సీనియర్ అధికారులతో బీబీసీ మాట్లాడింది.
ప్రభుత్వ విధానాలు కొంత వరకు ఉపయోగపడుతున్నా, తయారీ రంగాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని ముఖ్యమైన సమస్యలను వాళ్ళు ప్రస్తావించారు.
- ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేమి
- పన్నుల, నియంత్రణ నిబంధనల్లో సంక్లిష్టత
- వివిధ స్థాయుల్లో అవినీతి
- ఆంక్షలతో కూడిన కార్మిక చట్టాలు, మౌలిక సదుపాయాలు కొరత
- సరికొత్త ఆలోచనలు, నైపుణ్యాలు లేకపోవడం
తయారీరంగం వల్లే ఇదంతా సాధ్యమైందా?
"రానున్న 5-7 ఏళ్ళలో తయారీ రంగంలో అనూహ్య వృద్ధి జరిగే అవకాశం లేదు" అంటున్నారు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన అభిజిత్ ముఖోపాధ్యాయ్.
"ఆర్థికాభివృద్ధిని తయారీరంగం ముందుండి నడిపించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, దీనికి నిరంతర కృషి అవసరం" అని ఆయనన్నారు.
అయితే, తయారీ రంగం వృద్ధి చెందినా చెందకపోయినా భారత్ మాత్రం ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగానే ఉంటుంది.
భారత ఆర్థిక వ్యవస్థ 2019లో 7.6%, ఆ తరవాత సంవత్సరంలో 7.4% పెరిగి, ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే ముందుంటుందని తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఓ నివేదిక అంచనా వేసింది.
ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
- ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ప్రభావవంతంగా నియంత్రించిందా...
- జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే
- ఎన్నికల్లో మహిళల విజయ శాతమే ఎక్కువ
- భారత్‌లో కులం-మతం లేకుండా సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి మహిళ
- భారత్‌లో 10 లక్షల గిరిజన కుటుంబాలను అడవుల నుంచి పంపించేస్తున్నారు.. ఎందుకు?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)