క్రికెట్: భారత్ కొంప ముంచింది ఉమేశ్ యాదవ్ బౌలింగా? ధోనీ స్లో బ్యాటింగా?

ధోనీ బ్యాటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఆదివారం సాయంత్రం భారత్, ఆస్ట్రేలియా మధ్య విశాఖపట్టణంలో జరిగిన టీ20 మ్యాచ్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది.

రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆఖరి బంతికి కావల్సిన పరుగులు సాధించి మూడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది.

కానీ చివరి రెండు ఓవర్లు ఈ మ్యాచ్‌ను ఎన్ని మలుపులు తిప్పాయంటే.. స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోయారు.

చివరి రెండు ఓవర్ల కథ

విశాఖపట్టణంలోని స్లో పిచ్‌పై భారత్ ఇచ్చిన 127 పరుగుల లక్ష్యం అందుకునేందుకు ఆస్ట్రేలియా చాలా సులభంగా విజయం దిశగా పయనించింది.

చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియాకు కేవలం 16 పరుగులు కావాలి, వారి దగ్గర ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు.

మ్యాచ్ 19వ ఓవర్ వేయడానికి ప్రపంచంలో అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా వచ్చాడు.

బుమ్రా తన పేరుకు తగ్గట్టే బౌలింగ్ చేశాడు. యార్కర్‌తో కంగారూలకు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. దానితోపాటూ అదే ఓవర్లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images

19 ఓవర్ పూర్తయ్యేసరికి మ్యాచ్ భారత్‌వైపు మళ్లింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న ఇద్దరూ కొత్త బ్యాట్స్‌మెన్స్.

కానీ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన ఉమేష్ యాదవ్ పరుగులు కట్టడి చేయడంలో విఫలం అయ్యాడు. అతడి ఓవర్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ రెండు ఫోర్లు కూడా కొట్టారు. విజయం సాధించారు.

ఉమేష్ యాదవ్ ఈ ఓవర్ వేసిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చేశారు. అన్ని పోస్టుల్లో భారత్ ఓటమికి ఉమేష్ యాదవే బాధ్యుడని ఫైర్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

ఉమేష్ బౌలింగ్ గురించి బుమ్రా ఏమన్నాడు

చాలా పోస్టుల్లో జస్‌ప్రీత్ బుమ్రా కష్టాన్ని ఉమేష్ యాదవ్ వృథా చేశాడని రాశారు.

అలాంటప్పుడు ఈ ఓటమి తర్వాత అసలు బుమ్రా దీని గురించి ఏమనుకున్నాడు అనేది ఆసక్తిగా ఉంటుంది. ఉమేష్ యాదవ్ ఆఖరి ఓవర్ గురించి బుమ్రా ఎలా ఆలోచించాడు?

మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన బుమ్రా ఉమేష్ యాదవ్ ఆఖరి ఓవర్ గురించి కూడా ప్రస్తావించాడు.

"ఇలా పోటాపోటీ మ్యాచుల్లో ఆఖరి ఓవర్ వేయడం అంత సులభం కాదు. ఎందుకంటే మనకు ఆ ఓవర్ తర్వాత ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో తెలీదు. అవును. మేం మ్యాచ్ గెలవాలనే అనుకున్నాం. కానీ ఆఖరి ఓవర్ వేయడం అనేది ఏ బౌలర్‌కు అయినా చాలా సవాలుగా ఉంటుంది" అన్నాడు

ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 16 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లలో 35 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఫొటో సోర్స్, Twitter/icc

ఆస్ట్రేలియా శిబిరంలో పరిస్థితి

ఆఖరి ఓవర్ వేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల టెన్షన్ పీక్స్‌కు చేరింది. ఆ సమయంలో డగవుట్‌లో ఉన్న జేమ్స్ మాక్స్‌వెల్ ఏం అనుకున్నాడో తర్వాత చెప్పాడు.

"ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాల్సినప్పుడు నేను ఫించ్‌తో మన టీమ్‌లో ఇప్పుడు దీన్ని చేయగలిగిన మంచి ఆటగాడు పాట్ కమిన్స్ మాత్రమే అని చెప్పాను. తను చాలాసార్లు ఇలా గెలిపించాడు. ఇలాంటప్పుడు అతడి మెదడు చాలా కూల్‌గా ఉంటుంది" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

ధోనీ స్లో బ్యాటింగ్

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత బ్యాట్స్‌మెన్లు అద్భుతాలు చేయలేకపోయారు. టీమ్‌లోకి తిరిగొచ్చిన కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కొట్టినా, అది టీమ్‌ను భారీ స్కోరు వరకూ తీసుకెళ్లలేకపోయింది.

అటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేశాడు. కానీ అతడి స్ట్రైక్ రేట్ ఎంత మెల్లగా ఉందంటే దానిపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి.

మొత్తం 37 బంతులు ఫేస్ చేసిన ధోనీ 29 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు కేవలం ఒక సిక్స్ కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకూ నిలిచాడు.

ధోనీ బ్యాటింగ్‌పై మాట్లాడిన బుమ్రా అతడు ఎప్పుడైనా మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలనే భావిస్తాడని చెప్పాడు.

"మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితి సులభంగా లేదు. బంతి బ్యాట్ పైకి రావడం లేదు. ధోనీ ఇన్నింగ్స్ నిలపడానికి ప్రయత్నిస్తున్నాడు. తనెప్పుడూ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలనే భావిస్తాడు. అవును. జట్టు ఇంకో 15-20 పరుగులు ఎక్కువ చేసుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది" అన్నాడు.

ధోనీ తన స్టైల్లో రెచ్చిపోయి మరో 15-20 పరుగులు చేసుంటే.. ఈ మ్యాచ్ భారత్ వైపే నిలిచేదని కూడా చాలామంది అభిమానులు భావించారు.

భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఫిబ్రవరి 27న జరగనుంది. తర్వాత రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది.

ప్రపంచ కప్ ముందు భారత్‌కు ఇది ఆఖరి అంతర్జాతీయ సిరీస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)