#IAF: బాలాకోట్‌లో వైమానిక దాడులతో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చాం- భారత్; బదులిచ్చే హక్కు మాకుంది- పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images
ఐఏఎఫ్ మిరాజ్ 2000 యుద్ధవిమానం
''బాలాకోట్ సమీపంలోని నిషేధిత జైషే మొహమ్మద్ స్థావరంపై ఈ రోజు తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపాం'' అని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం దిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు.
భారత దాడులపై స్పందించే హక్కు తమకుందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ చెప్పింది.
తమ దాడుల్లో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ బావమరిది మౌలానా యూసుఫ్ అజర్ (అలియాస్ ఉస్తాద్ ఘోరీ) ఆధ్వర్యంలోని అతిపెద్ద శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేశామని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని గోఖలే తెలిపారు. మృతుల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవారు, సీనియర్ కమాండర్లు, జిహాదీలు ఉన్నారని చెప్పారు.
పర్వతాల మీద ఉన్న ఈ శిబిరంపై సాధారణ పౌరుల ప్రాణాలకు హాని లేకుండా వైమానిక దాడులు జరిపామని గోఖలే తెలిపారు. ఇది సైనిక చర్య కాదని, ఉగ్రవాద నిరోధక దాడి అని చెప్పారు.
ఈ బాలాకోట్ పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తుంఖ్వా(కేపీకే) రాష్ట్రంలో ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే
30 నిమిషాల్లో ముగిసిన ఆపరేషన్
భారత యుద్ధవిమానాలు నియంత్రణ రేఖ(లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్వోసీ)ని దాటి బాంబు దాడులు జరిపినట్లు భారత వైమానిక దళంలోని విశ్వసనీయ వర్గాలు బీబీసీకి తెలిపాయి. ఈ యుద్ధవిమానాలు హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి బయల్దేరాయి. ఎల్వోసీని దాటి ఆవల ఉన్న నిర్దేశిత లక్ష్యాలపై బాంబులు వేశాయి.
భారత యుద్ధవిమానాలు ఎల్వోసీని దాటినప్పటికీ, అంతర్జాతీయ సరిహద్దును దాటలేదు.
ఈ ఆపరేషన్ 30 నిమిషాల్లో ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి మంగళవారం తెల్లవారుజామున దాటాక మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు కొనసాగింది. అన్ని యుద్ధవిమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న అన్ని సైనిక యూనిట్లు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని ఐఏఎఫ్ వర్గాలు బీబీసీతో చెప్పాయి. గగనతల రక్షణ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉందని తెలిపాయి.
పాక్ పాలిత కశ్మీర్లో వివిధ ప్రదేశాల్లోని ఉగ్రవాద స్థావరాలపై ఐఏఎఫ్ దాడులు జరిపిందని, అక్కడ జైషే మొహమ్మద్‌కు చెందిన నియంత్రణ కేంద్రాలు(కంట్రోల్ రూమ్‌లు), ఇతర మౌలిక వసతులు ధ్వంసం చేసిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
12 మిరాజ్ యుద్ధవిమానాలతో దాడులు
ఈ ఆపరేషన్‌లో పన్నెండు మిరాజ్-2000 యుద్ధవిమానాలు పాల్గొన్నాయని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మిలిటెంట్ శిబిరాలపై వెయ్యి కేజీల బరువున్న బాంబులు వేసినట్లు ఐఏఎఫ్‌కు చెందిన విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ చెప్పింది. బాలాకోట్, ఛకోటి, పాక్ పాలిత కశ్మీర్ రాజధాని అయిన ముజఫరాబాద్‌లోని మిలిటెంట్ శిబిరాలపై ఐఏఎఫ్ దాడి చేసిందని తెలిపింది. జైషే మొహమ్మద్ కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైందని వెల్లడించింది.
ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై ఒక కశ్మీరీ మిలిటెంట్ ఆత్మాహుతి దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ దాడికి పాకిస్తానే కారణమని భారత్ ఆరోపించింది. భారత్ ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది.
ఫొటో సోర్స్, TWITTER/MAJ GEN ASIF GHAFOOR
పాక్ సైన్యం అధికార ప్రతినిధి
ఐఏఎఫ్ చర్యపై పాకిస్తాన్ సైన్యం స్పందించింది.
నియంత్రణ రేఖను భారత వైమానిక దళం అతిక్రమించిందని, పాకిస్తాన్ వైమానిక దళం తక్షణం దీటుగా ప్రతిస్పందించిందని, దీంతో భారత యుద్ధవిమానాలు వెనుదిరిగాయని పాకిస్తాన్ సైనిక బలగాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మంగళవారం ట్విటర్లో చెప్పారు.
భారత యుద్ధవిమానాలు ముజఫరాబాద్ సెక్టార్లో ఎల్వోసీని అతిక్రమించాయని ఆయన ఆరోపించారు. పాక్ వైమానిక దళం నుంచి తక్షణ, సమర్థ ప్రతిస్పందన రావడంతో భారత యుద్ధవిమానాలు పేలుడు పదార్థాన్ని హడావిడిగా విడుదల చేసి వెనుదిరిగాయని, పేలుడు పదార్థం బాలాకోట్ సమీపాన పడిందని పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని పాక్ సైనిక బలగాల అధికార ప్రతినిధి చెప్పారు. తన వ్యాఖ్యకు మద్దతుగా కొన్ని ఫొటోలను ట్విటర్లో పెట్టారు.
ఫొటో సోర్స్, Twitter
భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం
ఫొటో సోర్స్, Twitter/OfficialDGISPR
భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం
ఫొటో సోర్స్, Twitter/Maj Gen Asif Ghafoor
భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం
ఫొటో సోర్స్, Twitter
భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం
కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోదీ
ఎల్వోసీ ఆవల వైమానిక దాడుల నేపథ్యంలో మంగళవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు.
రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫొటో సోర్స్, Twitter/DDNews
మంగళవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఐఏఎఫ్ పైలట్లకు రాహుల్ సెల్యూట్
భారత వైమానిక దళం చర్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ''ఐఏఎఫ్ పైలట్లకు నేను సెల్యూట్ చేస్తున్నా'' అని ఆయన చెప్పారు.
భారత వైమానిక దాడుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఫొటో సోర్స్, www.radio.gov.in
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
స్పందించే హక్కు మాకుంది: పాకిస్తాన్
పాకిస్తాన్ శాంతిని కోరుకొంటుందని, కానీ ప్రాంతీయంగా పరిస్థితిని భారత్ దిగజారుస్తోందని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ విమర్శించారు. శాంతికి భారత్ విఘాతం కలిగిస్తోందన్నారు. బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో మాజీ విదేశాంగ కార్యదర్శులు, సీనియర్ రాయబారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఒక బాధ్యతాయుత దేశంగా వ్యవహరిస్తూ, ముందుకెళ్తున్నామని చెప్పారు. దేశం మొత్తం పాకిస్తాన్ సైన్యానికి అండగా నిలుస్తోందని తెలిపారు.
భారత్ నియంత్రణ రేఖను ఉల్లంఘించిందని, పాకిస్తాన్ పట్ల దుస్సాహసానికి ఒడిగట్టిందని, భారత్ చర్యపై స్పందించే హక్కు తమకు ఉందని మంత్రి ఖురేషీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
భారత్, పాకిస్తాన్ల ఆధీనంలో ఉన్న కశ్మీర్ భూభాగాలను వేరుచేసే రేఖను నియంత్రణ రేఖగా పిలుస్తారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- ఇస్లామిక్ దేశాల ముఖ్య అతిథిగా భారత్ ఏం సాధిస్తుంది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)