IAF: భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది… బాలాకోట్ ఎక్కడుంది?

మిరాజ్ యుద్ద విమానం

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ భూభాగంలోని బాలకోట్ వద్ద అతిపెద్ద జైషే మొహమ్మద్ తీవ్రవాద శిబిరం మీద మంగళవారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో దాడి చేశామని భారత అధికారులు తెలిపారు.

మిరాజ్-2000 యుద్ధవిమానాలతో ఈ దాడి చేసినట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారత్, పాక్‌ల మధ్య ఉన్న నియంత్రణ రేఖ

ఎల్‌వోసీ అంటే ఏమిటి?

భారత్, పాకిస్తాన్‌ల ఆధీనంలో ఉన్న కశ్మీర్ భూభాగాలను విడదీసే రేఖను నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)గా పిలుస్తారు. అయితే ఎల్‌వోసీని అంతర్జాతీయ గుర్తింపు సరిహద్దు రేఖగా గుర్తించలేదు.

మొదట ఇరు దేశాల మధ్య ఇది సంధి రేఖగా ఉండేది. 1972లో భారత్, పాక్‌ల మధ్య జరిగిన యుద్ధం అనంతరం సిమ్లా ఒడంబడిక మేరకు ఈ సంధి రేఖను నియంత్రణ రేఖగా పిలుస్తున్నారు.

అలాగే, కశ్మీర్‌ ప్రాంతంలో భారత్, చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్‌కు మధ్య ఉన్న రేఖను వాస్తవాధీన రేఖ (Line of Actual Control) అంటారు.

బాలాకోట్ ఎక్కడుంది?

బాలాకోట్ పేరుతో రెండు ప్రాంతాలున్నాయి. ఒకటి పాక్ పాలిత కశ్మీర్‌లోనిది. ఇది పూంఛ్ సెక్టార్‌కు సమీపంలో ఉన్న ప్రాంతం.

మరొకటి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మంచెరా జిల్లాలో ఉంది. ఇది ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత వైమానిక దళం ఇక్కడే దాడి చేసినట్లు చెబుతున్నారు.

2005లో కశ్మీర్‌లో భూకంపం వచ్చినప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా నాశనమైంది. తిరిగి పునరుద్దరించడానికి చాలా కాలం పట్టింది. ఈ ప్రాంతం పునర్‌నిర్మాణానికి సౌదీ కూడా చాలా సహాయం చేసింది.

కున్హర్ నది ఒడ్డున కొండ ప్రాంతాలతో బాలాకోట్ చాలా అందంగా కనిపిస్తుంది. సింధూ నాగరికతకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, AFP

మిరాజ్-2000 యుద్ధవిమానాల సామర్థ్యం ఏమిటి?

భారత వైమానిక దళంలో ఉన్న అతిముఖ్యమైన యుద్ధవిమానాల్లో మిరాజ్ 2000 ఒకటి. 1999‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. 1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి. వీటికి వజ్ర అని నామకరణం చేశారు. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది.

సింగిల్ సీట్ ఉండే ఈ విమానంలో తేలికైన చిన్న ఇంజిన్ మాత్రమే ఉంటుంది. దీని బరువు 7500 కిలోలు. గంటకు 2,336 కిలో మీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. గగనతలంలో 17 కిలో మీటర్ల పై నుంచి దాడి చేసే సామార్థ్యం దీని సొంతం.

లేజర్ గైడెడ్ బాంబులను సులభంగా తీసుకెళ్లే ఈ విమానం గగన తలం నుంచి గగన తలంలోకి, గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలదు. భారత్‌తో పాటు ఎనిమిది దేశాలు ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

భారత యుద్ధవిమానాలు వేసిన పేలుడు పదార్థం పడిన ప్రదేశం అంటూ పాక్ సైన్యం విడుదల చేసిన చిత్రం

ఇంతకీ పేలోడ్ అంటే ఏమిటి?

గగనతంలోకి వెళ్లే విమానం లేదా రాకెట్ మోసుకెళ్లి సామర్థ్యాన్ని పేలోడ్‌ అంటారు.

సరళంగా చెప్పాలంటే విమానం, రాకెట్‌ తనతో పాటు గగనతంలోకి తీసుకెళ్లే బరువుగా దీన్ని చెప్పొచ్చు. రాకెట్‌లు తీసుకెళ్లే శాటిలైట్లు, మిస్సైల్స్, వార్‌హెడ్‌లను పెలోడ్‌గా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)