IAF: ‘‘అతిపెద్ద జైషే శిబిరాన్ని ధ్వంసం చేశాం’’ - భారత విదేశాంగశాఖ కార్యదర్శి

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన భారీ శిబిరాన్ని ధ్వంసం చేశామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు.
ఇటీవల కశ్మీర్లో సాయుధ బలగాలపై దాడికి పాల్పడిన జైషే మొహమ్మద్ భారత్లో మరిన్ని దాడులకు పాల్పడటానికి ప్రణాళికలు రచిస్తోందన్న కచ్చితమైన సమాచారం అందడంతో, ఆ దాడులను నివారించటానికి ముందస్తు దాడి చేసినట్లు చెప్పారు.
భారత వాయుసేన ‘సర్జికల్ స్ట్రైక్’ గురించి విజయ్ గోఖలే మంగళవారం మీడియా ముందు ఒక ప్రకటన చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘ఫిబ్రవరి 14 న జైషే మొహమ్మద్ ఉగ్రవాద దాడిలో 40 మంది భారత వీర జవాన్లు మరణించారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ బహవల్పూర్ కేంద్రంగా రెండు దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉంది.
2001 డిసెంబర్లో భారత పార్లమెంటు మీద, 2016 జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరం మీద దాడికి పాల్పడింది.
పాకిస్తాన్, పీఓకేల్లో వందలాది ఉగ్రవాద శిక్షణ శిబిరాల గురించి పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాం. వాటిని అరికట్టాలని పాకిస్తాన్కు పదే పదే విజ్ఞప్తి చేశాం. పాక్ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.
భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మహమ్మద్ ప్రణాళిక రచిస్తున్నట్లు, ఫిదాయీలకు శిక్షణనిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందింది.
ఉగ్రవాదంపై పోరాటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి, ముందు జాగ్రత్తగా దాడి చేయడం తప్పనిసరి అయింది.
బాలాకోట్ వద్ద జైషే అతిపెద్ద శిక్షణ శిబిరం మీద దాడి చేశాం. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, వారి శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదిస్టులు చనిపోయారు.
ఫొటో సోర్స్, AFP
సాధారణ పౌరుల ప్రాణనష్టం లేకుండా ఉండేలా పర్వతాల మీద ఉన్న జైషే శిబిరం మీద ఈ రోజు తెల్లవారుజామున ఈ నాన్ మిలిటరీ ప్రిఎంప్టివ్ యాక్షన్ను భారత వాయుసేన చేపట్టింది.
జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బ్రదర్ ఇన్ లా (మరిది) మౌలానా యూసఫ్ అజాద్ అలియాస్ ఉస్తాద్ ఘోరీ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు.
ఈ దాడి కొంతసేపటి కిందటే జరిగింది కాబట్టి మరిన్ని వివరాల కోసం వేచిచూస్తున్నాం.
పాకిస్తాన్ ఇప్పటికైనా బహిరంగంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందని.. జేఈఎం, ఇతర ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేస్తుందని, వారికి ఆశ్రయం ఇవ్వటం, ప్రోత్సహించటం నిలిపివేస్తుందని ఆశిస్తున్నాం.’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)