IAF: సరిహద్దు దాటి వచ్చిన భారత దేశ యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫిబ్రవరి 26 ఉదయం అందరూ పడకపై నుంచి లేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ "భారత్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్‌కు మూడు నాలుగు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చాయి" అంటూ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు.

"పాకిస్తాన్ వెంటనే బదులివ్వడంతో భారత్ వైమానిక దళం వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చిందని, తమకు ఎలాంటి నష్టం జరగలేదు" అని కూడా గఫూర్ చెప్పారు.

తమ వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహ్మద్ స్థావరాలను ధ్వంసం చేసిందని ఆ తర్వాత భారత్ చెప్పింది.

గతంలో సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని భారత్ చెప్పినప్పుడు, దాన్ని కొట్టిపారేసిన పాకిస్తాన్, ఈసారి భారత్ యుద్ధవిమానాలు సరిహద్దు దాటి వచ్చాయని స్వయంగా అంగీకరించింది.

భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోకి చొరబడి, దాడులు చేసి తిరిగి వచ్చినా అటు వైపు నుంచి పాకిస్తాన్ ఏమీ చేయలేకపోవడంపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

భారత యుద్ధవిమానాలను ఎందుకు కూల్చేయలేకపోయారని పాకిస్తాన్ ప్రజలు కూడా తమ సైన్యాన్ని నిలదీస్తున్నారు.

పాకిస్తాన్ పౌరుడు ఫవాద్ జావేద్ "భారత విమానాలు సరిహద్దు దాటి లోపలికెలా రాగలిగాయి" అని పాక్ ఆర్మీని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Twitter

"వారు మన గగనతలంలోకి చొచ్చుకొచ్చినపుడు మన సైన్యం వాటిని కూల్చేయలేదు. కానీ ఇప్పుడు ట్విటర్‌లో మాత్రం ఫైర్ చేస్తున్నారు" అని జావేద్ ట్వీట్ చేశారు.

వైమానిక దళంలోని ఎయిర్ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా భారత్ విమానాలు సరిహద్దులోకి చొరబడ్డాయనే విషయం పాకిస్తాన్ తెలుసుకోలేకపోయిందా? పాకిస్తాన్ వాటిపై ఎలాంటి చర్యలకు ఎందుకు దిగలేకపోయింది?

భారత వైమానిక దళంతో పోలిస్తే పాకిస్తాన్ వైమానిక దళం చాలా బలహీనంగా ఉందని 'ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్' డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ బహెరా చెప్పారు.

"పాకిస్తాన్ వైమానిక దళానికి ఇలాంటి దాడులను తిప్పికొట్టేంత సామర్థ్యం లేదు. భారత వైమానిక దళం సన్నాహాలు ఎంత పక్కాగా ఉన్నాయంటే, పాకిస్తాన్‌కు వాటిని పసిగట్టడం కూడా సాధ్యం కాదు. భారత్ చాలా తక్కువ సమయంలో ఈ దాడులు పూర్తి చేసింది. పాకిస్తాన్ ఎయిర్ సర్వేలెన్స్ సిస్టమ్, జామర్ చాలా బలహీనంగా ఉంటుంది. అంత తక్కువ టైంలో ఆ దాడిని ఎదుర్కోవడం పాకిస్తాన్‌ ప్రస్తుత ఎయిర్ సర్వేలెన్స్ వల్ల జరిగే పని కాదు" అని బహెరా తెలిపారు.

భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు సరిహద్దు దాటి వెళ్లాయని, 19 నిమిషాల్లోనే దాడులు పూర్తి చేసి తిరిగొచ్చాయని భారత మీడియా చెప్పింది. గత ఐదు దశాబ్దాల్లో 1971లో యుద్ధం తర్వాత మొదటిసారి భారత్ సరిహద్దు దాటి దాడులు చేసినట్లు చెబుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

మిరాజ్ 2000 యుద్ధ విమానం

పాక్ కదలికలు పసిగట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2000 ఏప్రిల్‌లో రష్యా నుంచి రెండు A-50 AWAC (ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్) ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేసింది. రాడార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్‌కు ఇవి చాలా కీలకం. భారత్ వీటిని కొనుగోలు చేసినప్పుడే, 'పాకిస్తాన్‌కు వాటి వల్ల ముప్పు ఉంటుందని, ఇవి ప్రమాదం' అని పాకిస్తాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అయాజ్ అహమద్ ఖాన్ చెప్పారు.

ఈ సిస్టమ్‌ ద్వారా పాకిస్తాన్‌లో, పాక్ ఎయిర్ ఫీల్డ్‌పై నిఘా ఉంచే సామర్థ్యం భారత్‌కు వచ్చిందని ఆయన తెలిపారు.

"ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌ బేస్‌లో కదలికలను ముందే తెలుసుకోగలదు" అని అయాజ్ ఖాన్ అప్పుడు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

పాతబడిన పాక్ రాడార్ వ్యవస్థ

"పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ ఎక్కడుందో, ఎక్కడ నుంచి పాక్ ఆర్మీ మిసైళ్లు మోహరిస్తోందో, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలు ఏంటో A-50 AWAC ద్వారా భారత్‌కు ముందే తెలిసిపోతుంది. రష్యాలో తయారైన A-50 AWAC ద్వారా పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల గురించి భారత్‌కు తెలుసుకోగలిగే సామర్థ్యం వస్తుంది. ఇది పాకిస్తాన్‌కు ఆందోళన కలిగించే అంశం. పాకిస్తాన్ డిఫెన్స్‌కు సంబంధించిన విషయాలను రిపోర్ట్ చేసే డిఫెన్స్ డాట్ పీకే వెబ్‌సైట్ కూడాఒక రిపోర్ట్‌లో పాకిస్తాన్ ఎయిర్‌బోర్న్ రాడార్స్ పాతబడ్డాయని చెప్పాయి" అని ఖాన్ తెలిపారు.

"ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ తన ఎయిర్ బోర్న్ సర్వేలెన్స్ కోసం చాలా ఖర్చు చేసింది. అయితే పాకిస్తాన్ కూడా వాటిని అప్‌గ్రేడ్ చేయాలని ప్రయత్నించింది. కానీ భారత్ చాలా విశాలమైన దేశం. అందుకే పాకిస్తాన్ సర్వేలెన్స్ సిస్టమ్‌ కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది."

"భారత్‌కు రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వెనకబడిపోయింది" అని అయాజ్ ఖాన్ తన రిపోర్టులో అన్నారు.

"ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ టెక్నాలజీ" అంటే ఇతర దేశాల వైమానిక దళం కదలికలపై నిఘా పెట్టే ఈ టెక్నాలజీలో అమెరికా అన్నిటికంటే ముందుంది.

ఫొటో సోర్స్, Getty Images

చైనాపై ఆధారపడుతున్న పాక్

రక్షణ అంశాల్లో పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా చైనాపై ఆధారపడుతోంది. కానీ ఎయిర్ సర్వేలెన్స్ అంశాల్లో చైనా నుంచి పాకిస్తాన్‌కు పెద్దగా సాయం లభించడం లేదు.

పాకిస్తాన్‌కు అమెరికా వైపు నుంచి అందే రక్షణ సాయం, రక్షణ సాంకేతికత ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది.

ఒబామా పాలనాకాలం చివర్లో పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల అమ్మకంపై అమెరికా కాంగ్రెస్ నిషేధం విధించింది.

ఆ తర్వాత ఎఫ్-16 ఫైటర్ జెట్స్ నుంచి దృష్టి మళ్లించిన పాక్.. చైనాతో కలిసి జేఎఫ్-17 ఫైటర్ జెట్స్ తయారుచేసే పనులు ప్రారంభించంది.

ఎఫ్-16 విమానాల విషయంలో అమెరికా కాంగ్రెస్ పాకిస్తాన్‌తో చాలా కఠినంగా వ్యవహరించింది. దీంతో సైనిక అవసరాలు తీర్చుకోడానికి పాకిస్తాన్ వేరే భాగస్వామిని వెతుక్కోవలసి వచ్చింది.

ఫొటో క్యాప్షన్,

మిరాజ్ 2000

భారత్‌ కంటే బలహీనంగా పాక్

ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం అమెరికా, పాకిస్తాన్ మధ్య ఆయుధ ఒప్పందాలు ఒక బిలియన్ డాలర్ నుంచి గత ఏడాది 2.1 కోట్ల డాలర్లకు పడిపోయింది. అయితే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మధ్య ఆయుధ ఒప్పందాలు ఉన్నాయి. కానీ వాటి వేగం చాలా నెమ్మదిగా ఉంది.

చైనా-పాకిస్తాన్ మధ్య ఆయుధ ఒప్పందాలు 74.7 కోట్ల డాలర్ల నుంచి 51.4 కోట్ల డాలర్లకు తగ్గాయి. కానీ, పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్మే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది.

అమెరికా డిఫెన్స్ వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్ పవర్ వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర మొత్తం 1281 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇటు భారత్ దగ్గర 2185 జెట్ ఫైటర్స్ ఉన్నాయి. "పాకిస్తాన్ అణుశక్తి ఉన్న దేశమే అయినా, చాలా అంశాల్లో భారత్‌తో పోలిస్తే చాలా బలహీనంగా ఉంది" అని లక్ష్మణ్ కుమార్ బహెరా చెప్పారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దుల్లో 2000 కిలోమీటర్ల వరకూ సర్వేలెన్స్ సామర్థ్యాన్ని బీఎస్ఎఫ్ త్వరలో సొంతం చేసుకోబోతోంది అని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)