#Balakot: న్యూస్ చానల్స్‌లో పాక్‌పై వైమానిక దాడి అంటూ చూపించిన వీడియో.. వాస్తవానికి ఓ వీడియో గేమ్‌లోనిది

  • ఫ్యాక్ట్ చెక్ టీమ్
  • బీబీసీ ప్రతినిధి
ఫేస్ బుక్

ఫొటో సోర్స్, Facebook Search

ఫొటో క్యాప్షన్,

'టైమ్స్ నౌ'తో పాటూ మరికొన్ని చానళ్లలో కూడా ఈ పాత వీడియోను ఉపయోగించాయి

సోషల్ మీడియా సహా భారత్‌లోని ఎన్నో టీవీ న్యూస్ చానళ్లలో పాకిస్తాన్‌పై భారత వైమానిక దాడులని చెబుతూ ఫిబ్రవరి 26న ఉదయం ఒక వీడియోను చూపించారు. కానీ ఆ వీడియో చాలా పాతది.

ఈ వీడియోను షేర్ చేసిన వారు భారత వైమానిక దళం పీఓకేలోకి వెళ్లి జైషే మహమ్మద్‌కు చెందిన ఒక పెద్ద శిబిరాన్ని నాశనం చేసిందని చెబుతున్నారు.

భారత్ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో భారత వైమానిక దళం పూర్తి చేసిన ఈ రహస్య మిషన్ గురించి చెప్పారు.

"జైషే మహమ్మద్ దేశంలోని మరికొన్ని ప్రాంతాలపై కూడా ఆత్మాహుతి దాడులకు ప్రయత్నించబోతోందని భారత ప్రభుత్వావనికి విశ్వసనీయ సమాచారం అందింది. అందుకే మంగళవారం తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్, బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ అతిపెద్ద ట్రైనింగ్ క్యాంప్‌ను టార్గెట్ చేసింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఆ తర్వాత నుంచి భారత్ సహా పాకిస్తాన్‌లో #Surgicalstrike2, #IndianAirForce, #Balakot ట్విటర్‌లో టాప్ ట్రెండ్స్‌లో నిలిచాయి.

ఈ హ్యాష్‌ట్యాగ్‌తోపాటు ఫైటర్ విమానాలు బాంబు దాడులు చేశాయంటూ ఒక వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. టీవీ ఛానళ్లలో చూపిస్తున్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్స్ వాదన ప్రకారం దానిని 2016 సెప్టంబర్ 22న తీశారు.

2016 సెప్టంబర్‌లో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీశారని చెబుతున్నారు.

ఈ వీడియోలో కొన్ని ఫైటర్ జెట్స్ ఇస్లామాబాద్‌పై గస్తీ తిరుగుతూ కనిపిస్తున్నాయి. వాటిలో ఒక విమానం లైట్ ఫ్లేర్ కూడా వదులుతుంది.

పాకిస్తాన్ వైమానిక దళం విమానాలు ఇస్లామాబాద్‌ నగరంపై గస్తీ తిరిగాయనే విషయాన్ని పాక్ సీనియర్ జర్నలిస్ట్ హామీద్ మీర్ 2016 సెప్టంబర్ 22న చేసిన ఈ ట్వీట్‌లో ధ్రువీకరించారు.

2016 సెప్టంబర్‌లో మీడియా రిపోర్ట్స్ ప్రకారం "2016 సెప్టంబర్ 18న జరిగిన ఉడీ దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దాంతో భారత్‌ నుంచి ఏదైనా దాడి జరిగే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ వైమానిక దళం ఇస్లామాబాద్, పరిససర ప్రాంతాల్లో ఫైటర్ విమానాల ల్యాండింగ్ ప్రాక్టీస్ చేసింది".

ఆ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ విమానాలను లాహోర్-ఇస్లామాబాద్ హైవేపై దిగడం కూడా ప్రాక్టీస్ చేసింది.

రెండో వీడియో

"రాత్రి 2.15కు నాకు ఫోర్ట్ అబ్బాస్ ప్రాంతంలో రెండు ఫైటర్ విమానాలు వెళ్లిన శబ్దం ఆందోళన కలిగించింది, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అవి సరిహద్దు దాటి వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలా లేక వాటిని వెంటాడుతూ వెళ్లిన పాకిస్తాన్ వైమానిక దళ విమానాలా?" అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జియా ఉల్-హక్ కుమారుడు ఇజాజ్ ఉల్-హక్ 2019 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు ట్వీట్ చేశారు.

ఇజాజ్ ఉల్-హక్ భారత్-పాకిస్తాన్ బోర్డర్‌లో ఉన్న హారునాబాద్(పాకిస్తాన్) నుంచి ఈ ట్వీట్ చేశారు. అది ముల్తాన్‌కు దక్షిణంగా ఉంది. భారత ప్రభుత్వం ఎక్కడైతే వైమానిక దాడులు చేశామని చెబుతోందో, దానికి హారూనాబాద్ చాలా దూరంగా ఉంది.

ఫొటో సోర్స్, Twitter

పాకిస్తాన్‌కు చెందిన అసద్ అనే ఒక ట్విటర్ యూజర్ ఇజాజ్ ఉల్-హక్ ట్వీట్‌కు సమాధనంగా మరో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఫిబ్రవరి 25న ఉదయం 1.21కు పోస్ట్ చేశారు. అంటే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయని చెబుతున్న ఒక రాత్రి ముందు దీన్ని పెట్టారు.

ఇదే వీడియోను "పాకిస్తాన్ వైమానిక దళం సాహసం" అని చెప్పి పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కానీ పాకిస్తాన్ ప్రజలు తీసిన ఎయిర్ స్ట్రైక్ వీడియోలంటూ భారత మీడియాలో, సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలను చూపిస్తున్నారు.

ఫొటో సోర్స్, SM Viral Video Grab

మూడో వీడియో

ఈ రెండు వైరల్ వీడియోలతోపాటు మితవాద వైఖరి ఉన్న కొన్ని ఫేస్‌బుక్, ట్విటర్‌, షేర్ చాట్, వాట్సాప్‌ గ్రూపుల్లో మూడో వీడియో కూడా షేర్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో కొంతమంది ఒక పాత భవనం దగ్గరకు పరిగెత్తుతూ కనిపిస్తున్నారు. ఆ భవనం ఒక ఫైటర్ విమానం టార్గెట్‌లో ఉంటుంది.

దీనిని పాకిస్తాన్‌పై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన విమానాల్లో ఒక మిరాజ్ ప్లేన్‌కు సంబంధించిన వీడియోగా చెబుతున్నారు

ఈ దాడిలో 300 మందికి పైగా మిలిటెంట్లు మృతి చెందారని ఈ వీడియో షేర్ చేసిన వారు చెబుతున్నారు.

కానీ నిజానికి ఇది ఆర్మా-2 అనే ఒక వీడియో గేమ్ నుంచి రికార్డ్ చేశారు. సైనిక వ్యూహాల ఆధారంగా ఉండే ఈ వీడియో గేమ్ రికార్డింగ్‌ను 2015 జులై 9న యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పలు టీవీ చానెళ్లూ ప్రసారం చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)