గంగానది ప్రక్షాళన పూర్తయిందా? - లోక్‌సభ ఎన్నికలు 2019

  • 1 మార్చి 2019
నరేంద్ర మోదీ Image copyright Getty Images

కలుషిత గంగా నదిని పరిశుభ్రం చేస్తానని 2014లో భారతదేశ ప్రధాన మంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు.

తాము ఈ వాగ్దానానికి కట్టుబడి ఉన్నామంటూ, 3 బిలియన్ డాలర్లు (దాదాపు 2,125 కోట్ల రూపాయలు)తో ఐదేళ్లలో గంగానదిని ప్రక్షాళన చేస్తామని 2015లో బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. గంగానదిలో కాలుష్యం స్థాయులను తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లుగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో గత సంవత్సరం డిసెంబరులో మోదీ ప్రకటించారు.

ఈ విషయంలో మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

అయితే, ప్రక్షాళన పనులు నెమ్మదిగా జరుగుతున్నాయన్నది వాస్తవం.

1,568 మైళ్ళ పొడవైన గంగానది ప్రక్షాళనకు ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, 2020 నాటికి శుభ్రపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శుద్ధి చేయని మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థాలు గంగలో కలుస్తున్నాయి.

గంగానది ఎందుకు మురికిగా మారింది?

హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే గంగానదిని హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నది ఒడ్డున వందకు పైగా నగరాలు, వేలాది గ్రామాలున్నాయి.

Image copyright BC
చిత్రం శీర్షిక గంగా పరివాహక ప్రాంతం

కానీ ఈ నది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.

  • పరిశ్రమలు విడుదల చేసే విషపూరిత రసాయనాల నుంచి వచ్చే కాలుష్యం
  • వాణిజ్య, గృహ వ్యర్థాలు
  • పెద్దమొత్తాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు
  • వ్యవసాయానికి భూగర్భ జలాలు వినియోగం
  • సాగు నీటికి, ఇతర ఉపయోగాల కోసం నీటిని నిల్వచేసే జలాశయాలు

ఇవి గంగా కాలుష్యానికి కొన్ని కారణాలు.

చిత్రం శీర్షిక గంగా కాలుష్యం

అనుమతుల్లో జాప్యం, నెరవేరని గడువులు

గంగా నదిని ప్రక్షాళన చేయడానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయి. కానీ అవేవీ విజయవంతం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం నదిని శుభ్రం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులపై వ్యయాన్ని పెంచుతూ వస్తోంది.

అయితే పనుల్లో జాప్యం జరుగుతోందని, నిర్దేశించిన గడువు లోపల పనులు పూర్తికావడం లేదని 2017లో ప్రభుత్వ ఆడిట్లో వెల్లడించింది.

గత రెండు సంవత్సరాల్లో కేటాయించిన మొత్తంలో కనీసం పావువంతు కూడా ఖర్చుపెట్టలేదని ఈ నివేదిక పేర్కొంది.

''అనుమతులివ్వడంలో జాప్యం, ఖర్చుకాకుండా భారీగా మిగిలిపోయిన వివిధ పథకాల నిధులు, మానవ వనరుల కొరత... ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాల సాధన ఆలస్యం కావడానికి కారణమయ్యాయి'' అని ఆ నివేదిక తెలిపింది. గంగా ప్రక్షాళనకు ఉద్దేశించిన 236 ప్రాజెక్టుల్లో కేవలం 63 మాత్రమే పూర్తయ్యాయని గత సంవత్సరం భారత పార్లమెంటుకు సమర్పించిన వివరాల్లో ఉంది.

2019 మార్చి నాటికి గంగను 70%-80% శుద్ధి చేస్తామని, మరో సంవత్సర కాలంలో మిగిలిన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది.

నీటిలో ఆక్సిజన్ స్థాయులు కొద్దిగా మెరుగుపడ్డాయని ఇటీవల గంగానదిలో అత్యధిక కాలుష్యం ఉండే ఆరు ప్రాంతాల నుంచి నీటి నమూనాలను పరిశీలించిన నిపుణుల బృందం వెల్లడించింది. నదిలో ప్రాణుల మనుగడకు ఇది చాలా ముఖ్యమని పేర్కొంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రాజస్థాన్ నుంచి లండన్‌కి వెండి బిందెల్లో ‘గంగ’ ప్రయాణం

ఇంకా సమస్యలు కలిగిస్తున్నదేంటి?

గంగ ప్రక్షాళనకు ఇప్పటికీ కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి.

జనావాసాల నుంచి వచ్చే వృధా నీటిని శుద్ధిచేయడం వాటిలో అత్యంత ముఖ్యమైన సమస్య.

"నదిని ఆనుకుని ఉన్న పట్టణాల్లో ప్రధానంగా 97 పట్టణాల నుంచి రోజుకు 2.9 బిలియన్ లీటర్ల వృధా నీరు వస్తోంది. కానీ, ప్రస్తుతం రోజుకు 1.6 బిలియన్ లీటర్ల నీటిని మాత్రమే శుద్ధిచేసే సామర్థ్యం అందుబాటులో ఉంది" అని నది ప్రక్షాళనను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విభాగం తన నివేదికలో వెల్లడించింది. అంటే రోజుకు ఒక బిలియన్ లీటర్లకు పైగా మురికినీరు శుద్ధి చేయకుండానే నదిలో కలుస్తోంది.

2035 నాటికి జనావాసాల నుంచి వచ్చే వృధా నీటి పరిమాణం రోజుకు 3.6 బిలియన్ లీటర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనావేస్తోంది.

46 పట్టణాల్లోని 84 ట్రీట్‌మెంట్ (శుద్ధి) ప్లాంట్లలో నిజానికి 31 ప్లాంట్లు పనిచేయడంలేదని, మరో 14 ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతున్నాయని కూడా నివేదిక తెలిపింది.

గంగా ప్రక్షాళనకు వెచ్చించిన మొత్తం

మిలియన్ డాలర్లలో

మురుగు నీటి శుద్ధి503
నదిప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణం134.2
నదీ పరివాహక ప్రాంత శుద్ధి100
అటవీ ప్రాజెక్టులు16.2
నీటి నాణ్యత పర్యవేక్షణ5.4
పరిశోధన, అభివృద్ధి2.8
సెప్టెంబర్ 30, 2018 నాటికి మొత్తం ఖర్చు
ఆధారం: నేషనల్ క్లీన్ గాంజెస్ మిషన్

కాన్పూర్ పారిశ్రామిక వాడలోని తోళ్ల పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషపూరిత రసాయనాలను గంగలో కలవకుండా నిరోధించడం వంటి ఇతర ప్రయత్నాల ద్వారా కూడా నది కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

లక్ష్యం నెరవేరుతుందా?

మతపరమైన కార్యక్రమాల్లో స్నానాలకు ఉపయోగించే ఘాట్‌లలో కొన్నింటిని కూడా శుభ్రం చేశారు.

అయితే, తాము పరీక్షించిన 41 ప్రాంతాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే నది పరిశుభ్రంగా ఉండడం లేదా స్వల్పంగా కలుషితమై ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గత ఏడాది జూన్లో ఒక నివేదికలో స్పష్టం చేసింది.

మోదీ నియోజక వర్గం వారణాసిలోని నది నీటిలో సూక్ష్మక్రిములను తొలగించిన తర్వాత అది తాగడానికి యోగ్యంగా మారిందంటూ జనవరి 2019లో గంగా ప్రక్షాళన పురోగతిని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం ప్రక్షాళనకు గడువును పెంచినప్పటికీ ఆ లోపు పనులు పూర్తవడం కష్టమే అని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

"నాలుగేళ్లలో జరిగిన పనులను పరిశీలిస్తే నది నీటి నాణ్యతలో గణనీయమైన మార్పు కనిపిస్తుందనుకోవడం లేదు" అని దిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ద ఎన్విరాన్‌మెంసెంటర్ ఫర్ సైన్స్ అండ్ ద ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన చంద్ర భూషణ్ అంటున్నారు.

2019 మార్చి నాటికి 80 శాతం శుద్ధి చేయాలని, 2020 మార్చి నాటికి 100 శాతం గంగానది ప్రక్షాళన పూర్తి చేయాలన్న లక్ష్యాలు నెరవేరడం చాలా కష్టం అని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: జగన్ ప్రమాణ స్వీకారం 30న... నేటి సాయంత్రం చంద్రబాబు రాజీనామా

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 292 స్థానాల్లో బీజేపీ.. 51 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ... ఏపీలో ప్రభావం చూపని జనసేన: ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గంలో ఎవరిది ఆధిక్యం

వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా

40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి

నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్‌ల ‘వ్యక్తి పూజ రాజకీయాలు’